MohanPublications Print Books Online store clik Here Devullu.com

మాయ చేస్తారు.. జాగ్రత్త!Becarefull

మాయ చేస్తారు.. జాగ్రత్త!
ఆర్థిక విషయాల్లో ఎంతో అప్రమత్తత అవసరం. లేకుంటే.. మోసగాళ్లు, మోసపూరిత పథకాల బారిన పడి మన కష్టార్జితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో ఆర్థిక మోసగాళ్లు ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగా ఉండాలి. వారి ఎత్తులకు పైఎత్తులు వేయగలగాలి. అప్పుడే బాధితుల జాబితాలో మన పేరు లేకుండా చూసుకోగలం.
అధిక వడ్డీ ఆశ... 
ఏ పథకమైనా ఒకటి రెండు నెలల్లోనే రెట్టింపు రాబడులు ఇవ్వదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలను గమనిస్తే.. స్వల్ప కాలంలో అధిక రాబడి ఆశతోనే చాలామంది లక్షలకు లక్షల రూపాయలు కోల్పోతున్నారు. ఇలాంటి పథకాల్లో కొన్నాళ్లు బాగానే ఉంటుంది. ముందు మదుపు చేసిన వారికి తర్వాత వారి నుంచి వచ్చిన డబ్బుతో కొన్నాళ పాటు బాగానే చెల్లిస్తారు. ఆ తర్వాతే అసలు చిక్కులన్నీ వస్తాయి. చెల్లింపులు ఆగిపోవడంతోపాటు.. అసలు మొత్తం కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటిదే ఇంకోటి.. ఒక పథకంలో మీరు చేరండి.. మీతోపాటు మరో ముగ్గురిని చేర్పించండి.. అంటూ వచ్చే గొలుసుకట్టు పథకాలు. ఇవి కూడా ముందు చెప్పినట్లుగానే చెల్లింపులు చేస్తాయి. సభ్యుల సంఖ్య పెరిగిన తర్వాత.. మొత్తానికే మోసం చేసేస్తారు. ఇవన్నీ కూడా ఎలాంటి నియంత్రణ లేని పథకాలు, సంస్థల ద్వారానే జరుగుతాయి. 
ఏం చేయాలి?: ఏ పథకమైనా ఒకటి రెండు నెలల్లో రెట్టింపు లాభాలను ఇస్తుందని ప్రకటిస్తే.. అది కచ్చితంగా మోసమే అని గుర్తించండి. పెట్టుబడులు పెట్టేప్పుడు సంస్థలకు ఉన్న గుర్తింపును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. నిజంగా అధీకృత గుర్తింపు ఉంటేనే పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
వ్యక్తిగత రుణాలిస్తామంటూ.. 
తక్కువ వడ్డీకి.. అధిక మొత్తంలో వ్యక్తిగత రుణం ఇస్తామంటూ తరచూ ఫోన్లు, ఈమెయిళ్లు వస్తుంటాయి.. ఐటీ రిటర్నుల లాంటి పత్రాలు అక్కర్లేదంటూ చెబుతుంటారు. ముందుగా రూ.2,500- రూ.5,000 వరకూ పరిశీలన రుసుముల కింద చెల్లించాలని చెబుతుంటారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సిందిగా సూచిస్తారు. సాధారణంగా ఇవి వ్యక్తిగత ఖాతాలు, నిర్మాణ సంస్థల పేరిట, లేదా ఏదైనా ప్రైవేటు సంస్థ పేరుపై ఉంటాయి. ఆ తర్వాత రెండు మూడు రోజులకు మీకు రుణం మంజూరు చేసామనే ఉత్తరం వస్తుంది. ఇదీ నకిలీదే. ఇక నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.. రుణం మొత్తం మీ ఖాతాలో జమ చేసే ముందు ప్రాసెసింగ్‌ రుసుము కింద కొంత మొత్తం చెల్లించాలని పేర్కొంటారు. ఇది రూ.25వేల నుంచి రూ.1,00,000 వరకూ కూడా ఉండొచ్చు. రుణ దరఖాస్తుతో పాటు మీ పాన్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర ముఖ్యమైన పత్రాలన్నీ జత చేయాలని చెప్పి, వాటిని సేకరిస్తారు.. ఆ తర్వాత ఇక కనిపించరు.. 
ఇదే తరహాలో.. తనఖా రుణాలను కూడా ఆస్తుల అసలు విలువకంటే, చాలా అధిక మొత్తంలో ఇప్పిస్తామని చెబుతుంటారు. ముందుగా 5-10శాతం కమిషన్‌ ఇవ్వాలంటారు. ఆస్తికి సంబంధించి సర్వేకు వచ్చినట్లు నటిస్తుంటారు. నకిలీ గుర్తింపు కార్డులు కూడా ఉంటాయి. మీరు నిజమే అని నమ్మి కమిషన్‌ చెల్లించిన తర్వాత ఇక వారి నుంచి ఏ స్పందనా ఉండదు. 
ఏం చేయాలి?: ముందే కొంత మొత్తాన్ని జమ చేయాలని కోరుతున్నారంటే అది కచ్చితంగా మోసమే అని గుర్తించాలి. మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడే వ్యక్తిగత రుణం జోలికి పోవాలి. అంతేకానీ, ఇస్తున్నారు కదా అని తీసుకోవడం ఆర్థికంగా ఏ మాత్రం మంచిది కాదు. ఇక మీకు ఇలాంటి ఫోన్లు వస్తే.. ముందుగా మీ బ్యాంకు, లేదా ఆ ఫోన్‌లో చెప్పిన సంస్థ వినియోగదారుల సేవా కేంద్రానికి మీరే స్వయంగా ఫోన్‌ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. బ్యాంకు/రుణ సంస్థ అధీకృత వ్యక్తులకు మాత్రమే మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను అందించండి. కమిషన్‌ ఇస్తే చాలు.. మీకు కావాల్సినంత మొత్తం ఇప్పిస్తాం అంటూ వచ్చే వారిని ప్రోత్సహించకండి.
చెక్కులతోనూ..
ఇదో కొత్త తరహా మోసం.. ఇటీవలే నోయిడాలో 6కేసులు నమోదయ్యాయి.. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డులు ఇస్తామంటూ.. తరచుగా ఫోన్‌ చేస్తారు. బ్యాంకు అధీకృత వ్యక్తులం అంటూ నమ్మించి, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుస్తారు.. పాన్‌, ఆధార్‌, టెలిఫోన్‌ బిల్లు, చిరునామా ధ్రువీకరణలు, ఫొటోలు.. ఇలా అన్నీ తీసుకొంటారు. పత్రాల మీద సంతకాలు చేయిస్తారు. రద్దు చేసిన, ఖాళీ చెక్కులను సంతకం చేసి ఇవ్వాల్సిందిగా సూచిస్తారు. డబ్బులు అడగటం లేదు కాబట్టి, మనకూ అనుమానం రాదు. ఇక్కడే మోసగాళ్లు తెలివి ప్రదర్శిస్తారు. సంతకాలన్నీ వారు ఇచ్చిన పెన్నుతోనే చేయాల్సిందిగా అడుగుతారు. ఈ పెన్నుతో మీరు చెక్కుపై ‘క్యాన్సిల్‌’ అని రాసిన అక్షరాలను ఏ మాత్రం అనుమానం రాకుండా సులువుగా చెరిపేందుకు వీలుంటుంది. ఆ తర్వాత ఆ చెక్కుపై మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును రాసేసుకొని, ఆ మొత్తాన్ని తమ ఖాతాలోకి మళ్లిస్తారు. కొన్నిసార్లు మీ మొబైల్‌ నెంబరుపై కొత్త సిమ్‌ కార్డు కూడా తీసేసుకొని, ఓటీపీల్లాంటివి వారికే వచ్చేలా చూసుకుంటారు. బ్యాంకుకు వెళ్తే తప్ప మనం మోసపోయామనే సంగతి తెలియదు. 
ఏం చేయాలి?: రుణం ఇస్తామని ఎవరైనా ఫోన్‌ చేసినా, వ్యక్తిగతంగా వచ్చి కలిసినా.. వారి గుర్తింపు కార్డులను పరిశీలించాలి. వారి గుర్తింపు కార్డును ఫోనులో ఫొటో తీసుకొని పెట్టుకోవాలి. పత్రాలు ఇచ్చే ముందు బ్యాంకుకు ఫోన్‌ చేసి, అధీకృత వ్యక్తి ఎవరు, అతని పేరు, ఫోన్‌ నెంబరులాంటివి తీసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న పెన్నుతోనే సంతకం చేయడం, చెక్కును క్యాన్సిల్‌ చేసినప్పుడు తేదీ, మొత్తం రాసే చోట కూడా పూర్తిగా గీతలు కొట్టేయాలి.
ఐఆర్‌డీఏ పేరుతో...
రద్దయిన పాలసీ నుంచి డబ్బు ఇప్పిస్తాం.. లేదా మీరు ఇప్పటికే తీసుకున్న పాలసీకి చెల్లించిన కమిషన్‌ను తిరిగి మీ ఖాతాలో జమ చేస్తాం.. అంటూ ఐఆర్‌డీఏ లేదా ఇన్సూరెన్స్‌ వెరిఫికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్లతో ఫోన్లు వస్తుంటాయి. రద్దయిన పాలసీల నుంచి డబ్బు వెనక్కి అనగానే మనం కొంత ఆసక్తి చూపిస్తాం కదా! అదే మోసగాళ్లకు వరం! ఆ డబ్బును మీ ఖాతాలోకి జమ చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాల్సిందిగా కోరతారు. మీ ఖాతా మీకు సంబంధించిందే అని ధ్రువీకరించడం కోసం.. మీ ఖాతా నుంచి కొంత సొమ్మును వారు పేర్కొన్న ఖాతాలోకి జమ చేయమంటారు.. లేదా కొత్త పాలసీనేదైనా తీసుకోమని కోరుతుంటారు. మీరు అలా జమ చేశారా? ఇక అంతే సంగతులు! ఆ డబ్బు గురించి మర్చిపోవాల్సిందే. 
ఏం చేయాలి?: బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏ) ఎప్పుడూ పాలసీదారులకు నేరుగా ఫోన్లు చేయడంగానీ, ఈమెయిల్‌ పంపించడంలాంటివి చేయదు. పాలసీదార్లను అప్రమత్తం చేసేందుకు మాత్రమే సందేశాలను పంపిస్తుంటుంది. క్లెయింలు, కొత్త పాలసీల్లాంటి వాటి గురించి మాట్లాడితే.. వెంటనే ఫోన్‌ పెట్టేయండి. అవసరమైతే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయండి.
ఈ షేర్లు కొనండి...
ఫలానా షేర్లు కొంటే.. ఈ రోజు ఇంత లాభం వస్తుంది అంటూ సంక్షిప్త సందేశం వస్తుంది.. వివరాల కోసం.. ఈ ఫోన్‌ నెంబర్లో సంప్రదించండి అని సూచిస్తారు. వారిని సంప్రదించినప్పుడు.. వివరాలు తెలియజేసేందుకు కొంత రుసుము చెల్లించాలంటారు. అన్నీ పూర్తయ్యాక.. కొన్ని షేర్ల పేర్లు చెప్పి, వాటిలో మదుపు చేయాలని సూచిస్తుంటారు. ఇవన్నీ ఆపరేటింగ్‌ షేర్లే అయ్యుంటాయి. ఇలాంటి వాటిలో మదుపు చేసినప్పుడు మీరు మీ పెట్టుబడిని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. 
ఏం చేయాలి?: షేర్‌ మార్కెట్‌లో మదుపు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో చెప్పారని ఒక షేరును కొనడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే నేరుగా షేర్లలో మదుపు చేయాలి. నమ్మకమైన స్టాక్‌ బ్రోకర్‌ను ఎంచుకొని, వారి ద్వారా మాత్రమే లావాదేవీలను పూర్తి చేయాలి.
డిపాజిట్లు తీసుకోవడం...
కొన్ని సంస్థలు తాము డిపాజిట్లను స్వీకరిస్తున్నామంటూ.. బ్యాంకు వడ్డీతో పోలిస్తే 2-3 శాతం వరకూ అధిక వడ్డీ ఇస్తున్నామంటూ పేర్కొంటాయి. ఏజెంట్లకు అధిక కమిషన్ల ఆశ చూపి, డిపాజిట్‌దారులను చేర్పించేలా ప్రోత్సహిస్తాయి. ఇందులో కొన్ని ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏలాంటి నియంత్రణ సంస్థల గుర్తింపు ఉన్నట్లు కూడా నకిలీ ధ్రువీకరణలు చూపిస్తాయి. కరపత్రాల రూపంలో ప్రచారం చేస్తుంటాయి. మొదటి ఆరేడు నెలలు అధిక వడ్డీ చెల్లిస్తాయి. కానీ, ఆ తర్వాత బిచాణా ఎత్తేస్తాయి. 
ఏం చేయాలి?: ఒక సంస్థ తమకు గుర్తింపు ఉందని చెబితే.. అది వాస్తవమా? కాదా?అని ధ్రువీకరించుకోవాలి. దీనికోసం నియంత్రణ సంస్థల వెబ్‌సైట్లను పరిశీలించవచ్చు. పెట్టుబడులు పెట్టేప్పుడు నష్టభయాన్ని కూడా అంచనా వేసుకోవాలి. నియమ నిబంధనలను స్పష్టంగా తెలుసుకోవాలి.
ఇలా కూడా ఉంటాయి...
* మీ వ్యక్తిగత వివరాలను బ్యాంకులో ‘అప్‌డేట్‌’ చేసుకోవాలని సూచిస్తూ ఒక మెయిల్‌ వస్తుంది. చూడ్డానికి అచ్చం మీ బ్యాంకు వెబ్‌సైటులాగానే ఉంటుంది.. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు.. ప్రస్తుత పాస్‌వర్డ్‌లాంటివి అన్నీ అడుగుతారు. మీరు వివరాలు పూర్తి చేసిన క్షణాల్లో మీ ఖాతాలో డబ్బు మాయం అవుతుంది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వ్యక్తిగత వివరాలను బ్యాంకు ఎప్పుడూ అడగదు. ఒకవేళ అడిగినా మీకు సమీపంలోని బ్యాంకు శాఖకు వెళ్లాలని సూచిస్తుంది.
* క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలు స్కిమ్మింగ్‌ తదితర ప్రక్రియల ద్వారా తస్కరిస్తారు. మీ వ్యక్తిగత రహస్య సంఖ్యను నమోదు చేసేప్పుడు దాన్ని తెలివిగా గ్రహించి, మీ కార్డును కొనుగోళ్ల కోసం ఉపయోగిస్తారు.
మీరు చేయని వ్యవహారాలకు సంబంధించిన సమాచారం రాగానే వెంటనే కార్డు సంస్థకు ఫోన్‌ చేసి కార్డును తాత్కాలికంగా నిలిపి వేయాల్సిందిగా సూచించాలి.
* బహుమతులు, లక్కీ డ్రాలో విజేతలు... కోట్ల రూపాయలను మీరు గెల్చుకున్నట్లుగా వచ్చే ఈ సందేశాలకు ఎప్పుడూ స్పందించవద్దు. పేరు, ఖాతా వివరాలు, చిరునామాలాంటివి పంపించకండి. ఏ పరిస్థితుల్లోనూ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయకండి.
గుర్తుంచుకోండి...
* మీకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పుడూ ఎవరికీ ఇవ్వకండి. వ్యక్తుల, సంస్థల గుర్తింపును పూర్తి స్థాయిలో పరిశీలించాకే వీటిని ఇవ్వండి. ముఖ్యంగా, ఆధార్‌, పాన్‌ కార్డుల నకళ్లను ఎవరికీ ఇవ్వకండి. 
* నియంత్రణ, పారదర్శకత ఉన్న సంస్థలనే పెట్టుబడుల కోసం ఎంచుకోండి. 
* కొత్త కొత్త ఆర్థిక నేరాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి పత్రికల్లో వస్తూనే ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవాలి. మనం ఆ మోసాల బారిన పడకుండా అప్రమత్తం కావాలి. 
* మీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఇతరులు వినియోగించకుండా చూసుకోండి. పిన్‌ వివరాలు ఎవరికీ చెప్పకండి. నెలకోసారి మీ ఖాతా వివరాలు, మీ కార్డు లావాదేవీలను సరిచూడండి. 
* పూర్తి సురక్షితం, నమ్మకమైన వెబ్‌సైట్ల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయండి. మోసపోయినట్లుగా గమనిస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. 
* ఏదైనా పథకంలో చేరేందుకు దరఖాస్తు పత్రం పూర్తి చేస్తుంటే.. నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోండి. చిన్న అక్షరాల్లో మనకు ఇబ్బంది కలిగించే షరతులు ఎన్నో ఉంటాయి. వీటిని గమనించకుండా సంతకం చేసేస్తే.. తర్వాత వచ్చే ఇబ్బందులకు బాధ్యత వహించాల్సింది మనమే.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list