MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీముఖ లింగం అష్టతీర్ధ రాజమహాయోగం_Srimuka Lingam



శ్రీముఖ లింగం అష్టతీర్ధ రాజమహాయోగం
Srimuka Lingam

శివాలయాలు మహాశక్తి క్షేత్రాలు. నేల మీద వెలసిన ఒక్కో స్వయంభూ లింగానికీ ఒక్కో ప్రత్యేకత. అలాంటి ప్రాచీన శివలింగం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువైంది. ఇక్కడి స్వామిని శ్రీముఖలింగేశ్వరుడిగా పిలుస్తారు. ఇక్కడ శివుడు ఇప్పచెట్టు మొదలులో ముఖాకృతిలో వెలిశాడు. ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకవృక్షం అని అంటారు. అందువల్ల ఈ స్వామిని మధుకేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ స్వామికి ఈనెల 31 నుంచి 8 రోజుల పాటు ‘అష్టతీర్థ రాజ మహాయోగం’ జరుపుతున్నారు. ఈ ఎనిమిది రోజులూ స్వామితో పాటు, ఆలయానికి సమీపంలో ఉన్న వివిధ తీర్థాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

స్థల పురాణం... 
ద్వాపరయుగంలో వంశధారా నదీ తీరాన వామదేవ మహర్షి నిర్వహించిన యాగానికి యక్ష, గంధర్వ, కిన్నెరులు వచ్చారు. నదికి తూర్పు దిక్కున కిరాతులు నివసించేవారు. గంధర్వులు అక్కడి స్త్రీలతో రతికేళిలో మునిగి తేలి యాగం విషయం విస్మరించారు. వామదేవ మహర్షి గంధర్వుల కోసం ఆరా తీయగా జరిగిన విషయాన్ని గ్రహించి వాళ్లను కిరాతులుగా మారాలంటూ శపించాడు. గంధర్వులు శాపవిముక్తి కల్పించాలంటూ వామదేవుని వేడుకోగా, ద్వాపరయుగాంతాన అక్కడ ఉన్న మధుకేశ్వరుడు ముఖలింగేశ్వరుడిగా ఉద్భవిస్తాడనీ, అతని దర్శనంతో శాపవిముక్తి కలుగుతుందనీ చెప్పాడు. శాపగ్రస్తులైన గంధర్వులు చిత్రసేనుడను రాజుగానూ, మిగిలిన వారు అనుచరులుగానూ మారిపోయారు. మధుకవృక్షాలతో నిండిన అరణ్యంలో ఓ పెద్దపుట్ట సమీపంలో మధుకేశ్వరస్వామి కొలువై ఉండేవాడు. అక్కడ ఒక ఇప్పచెట్టు పెరిగి రెండుశాఖలుగా విడిపోయింది. చిత్రసేనుడు ఈ చెట్టు నుంచి వచ్చే ఆదాయంతోనే జీవించేవాడు. అతనికి చిత్కళ, చిత్తి అని ఇద్దరు భార్యలు. వాళ్లకి చిత్రసేనుడు చెట్టును చెరో సగం పంచి ఇచ్చాడు. చిత్కళ శివభక్తురాలు కావడంతో చెట్టు మొదట్లోని పుట్టను శివుడిగా భావించి పూజించేది. అందుకు మెచ్చిన శివుడు ఆమె వాటా సగం చెట్టుకు బంగారు పువ్వులను పూయించేవాడట. దీంతో చిత్తి మొత్తం చెట్టు తనకే కావాలని పట్టుపట్టి సాధిస్తుంది. తర్వాత చెట్టుకు బంగారు పూలు పూయకపోవడంతో భర్తతో తగవులాడుతుంది. గొడవలన్నింటికీ కారణం ఇప్పచెట్టేనని భావించిన చిత్రసేనుడు చెట్టును నరుకుతాడు. అక్కడ జ్వాలలు ఎగసి చనిపోతాడు. అతన్ని చిత్కళే చంపిందని చిత్తి కిరాతులకు చెప్పడంతో ఆమెను చంపేందుకు వారంతా వస్తారు. అప్పుడు ఆ చెట్టు దగ్గరే ఆమె శివుడ్ని ప్రార్థిస్తుంది. ఇప్పచెట్టు మొదట్లో శివుడు ముఖాకృతిలో దర్శనమివ్వడంతో అక్కడకు చేరిన కిరాతులంతా తిరిగి గంధర్వులుగా మారారు. బ్రహ్మ, విష్ణువులూ, దిక్పాలకులూ, దేవతలూ, యక్షులూ, కింపురుషులూ తదితరులంతా అక్కడకు చేరి స్వామిని దర్శించుకున్నారు. వారంతా ఒక్కో లింగం వంతున ప్రతిష్ఠించారు. అందుకే శ్రీ ముఖలింగం ప్రాంతమంతా ఒక్కటి తక్కువ కోటి లింగాలు కొలువయ్యాయని చెబుతారు. దీనివల్లే దీన్ని దక్షిణకాశీగా పిలుస్తారు.

రాజుల కాలంలో... 
క్రీ.శ. 720-1450 వరకు కళింగ దేశాన్ని రెండు కోవలకు చెందిన గంగ వంశపు రాజులు పాలించేవారు. వీరిలో రెండో కోవకు చెందిన ఒకటో కామర్ణవునితో శ్రీముఖలింగం ఆలయం నిర్మితమైనట్టు చారిత్రక ఆధారం. అలాగే రెండో కామర్ణవుని కాలంలో ఆలయ అభివృద్ధి జరిగింది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని 14వ శతాబ్దంలో పర్లాఖిముండి రాజు విష్ణువర్థన మధుకర్ణ గజపతి పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయంలో వాస్తుశిల్పం గంగ చాళుక్య శిల్పకళను ప్రస్ఫుటిస్తుంది. శ్రీముఖలింగంలో వారాహీ అమ్మవారి ఆలయంతో పాటు సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయం, ముక్తేశ్వరాలయం తదితర ఉపాలయాలున్నాయి.

అష్టతీర్థ రాజమహాయోగం 
శ్రీముఖలింగ క్షేత్రం అరుదైన ‘అష్టతీర్థ రాజమహాయోగం’ జరుపుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఇక్కడ పరమశివుణ్ని ప్రత్యక్షంగా చూడొచ్చని ఆర్యవాక్కు. శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిని అనుసరించి అష్టదిక్కుల్లో ఎనిమిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. దక్షిణాయనంలో శ్రావణమాస శుక్లపక్షంలో స్వాతీ నక్షత్రం, అష్టమి తిథి, సోమవారం కలసిన మహోన్నత సమయం అష్టతీర్ధరాజ మహాయోగానికి సరైన సమయం. 1946లో ఆగస్టు 5నుంచి 12వ తేదీవరకూ, తదుపరి 2000 సంవత్సరంలో ఆగస్టు 7నుంచి 14 వరకూ అష్టతీర్థ రాజమహాయోగ ఉత్సవాలు జరిగాయి. ఈ ఏడాది ఈనెల 31నుంచి ఆగస్టు 7వరకు 8రోజుల పాటు ఈ మహా ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీముఖలింగం క్షేత్రానికి రెండు మైళ్ల వ్యాసార్థంలో ఉన్న ఎనిమిది తీర్థాల్లో ఈ ఉత్సవాలు జరుపుతారు. బిందుతీర్థం, గయాతీర్థం, హంసతీర్థం, పిశాచ విమోచన తీర్థం, పక్షిమోచన తీర్థం, జంబుతీర్థం, సూర్యతీర్థం, సోమతీర్థాలుగా పిలిచే తీర్థాల్లో ఒక్కో రోజు ఒక్కోచోట భక్తులు స్నానమాచరించి ఆయా తీర్థాల్లో కొలువైన దేవతలను దర్శించుకుంటారు. తద్వారా అనంత పుణ్య ఫలాలను పొందడంతో పాటు సకల పీడలనుంచి విముక్తులై, అకాల మృత్యువును జయించి చివరకు శివసాయుజ్యాన్ని పొందుతారన్నది శాస్త్రోక్తి.
జిల్లా కేంద్రం శ్రీకాకుళానికి 51కి.మీ దూరంలో ఉన్న శ్రీముఖలింగం పుణ్య క్షేత్రానికి అక్కడి నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. శ్రీకాకుళం, నరసన్నపేట మీదుగా చల్లవానిపేట కూడలి నుంచి శ్రీముఖలింగం వెళ్లేందుకు పక్కా రహదారి సదుపాయం ఉంది.
                      - డి.డి.ప్రభుశర్మ, న్యూస్‌టుడే, నరసన్నపేట 
                     - వి.ఢిల్లేశ్వరరావు, న్యూస్‌టుడే, జలుమూరు










No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list