MohanPublications Print Books Online store clik Here Devullu.com

అందుకే... ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!-Education, Teacher, విద్య, గురువు


అందుకే... ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ
ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే అలా ఇవ్వరు. అది గురువు ధర్మం. ఆ ధర్మాన్ని అక్షరాలా పాటించాడు ద్రోణుడు.
‘ద్రోణుడిని చంపడానికి నాకు కొడుకు కావాలి’ అని ద్రుపదుడు యజ్ఞం చేసాడు. యజ్ఞంలోంచి వచ్చాడు «ధృష్టద్యుమ్నుడు. వెళ్ళి ద్రోణాచార్యులవారి దగ్గర చదువు నేర్చుకో అన్నాడు తండ్రి. ఇప్పుడు «ధృష్టద్యుమ్నుడికి చదువు చెబితే, దానితో తనను చంపేస్తాడు. అయినా చెప్పాడు. విద్య నాది అని లోభంతో ఉంచుకుంటే వాసన వస్తుంది. ఒకళ్ళకు పనికి రాదు. నోటు చూపితే తప్ప నోట్లో నుంచి విద్యాబోధన పైకి రాదనుకోండి, అది లోభంతో కూడినది. నేర్చుకున్న చదువు బయటికి రావడం, ఆవుపాలిచ్చినట్లుండాలి. ఆవు ఎక్కడెక్కడో తిరిగి గడ్డిమేస్తుంది. పనికిరాని నీళ్ళు తాగుతుంది. గబగబా తినేసి వచ్చి కూర్చుని ప్రశాంతంగా మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నెమరువేసుకుంటుంది. ఎంతో కష్టపడి పాలు తయారు చేస్తుంది.
దూడ పరిగెత్తుకొచ్చి శిరాన్ని చప్పరిస్తే పాలు వదిలేస్తుంది. అలాగే ఎంతో కష్టపడి శాస్త్రాలు అధ్యయనం చేస్తాడు గురువు. ఒకటికి పదిసార్లు జ్ఞాపకం తెచ్చుకుని వాటిమీద సాధికారికత సంపాదించుకుంటాడు. కానీ శిష్యులకు అర్థమయ్యేటట్లు చెప్పడంకోసం శ్రమించి అరటిపండు ఒలిచినట్లుగా నోట్లోపెట్టేస్తాడు. ఎందుకలా? ’అయ్యా, మీరు నాకు చెప్పండి’ అని రెండు చేతులెత్తి నమస్కరించి కాళ్ళు పట్టుకుంటే చాలు, చెప్పకుండా ఉండలేక చెప్పేస్తాడు. అదీ ఆయన ఔదార్యం. అంతేకానీ తనకోసమని దాచుకోడు. అదీ విద్యయందు లోభం లేని ప్రవృత్తి అంటే.
ఇక్కడ ద్రోణాచార్యులవారికి లోభం లేదు విద్యాబోధనలో. పడిపోయే శరీరం ఎలా అయినా పడిపోతుంది. దానికి ఏదో ఒక కారణం ఉండాలి. «ధృష్ట్టద్యుమ్నుడి చేతిలో పడిపోయినా సరే చదువు చెప్తాను. గురువుగా అది నాధర్మం. బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఉపసంహారం నేర్పమని కన్నకొడుకు అశ్వత్థామ అడిగాడు. కానీ అశ్వత్థామలో రౌద్రప్రవృత్తి ఉంది. ముందువెనుకలు ఆలోచించే తత్త్వం కాదు. అలా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే చాలా ప్రమాదం. అందుకని చెప్పనన్నాడు. ప్రయోగం మాత్రం చెప్పి ఉపసంహరణ చెప్పడం ఆపేసాడు, అప్పుడయితే ప్రయోగించడని. మరి అర్జునుడు తన కడుపున పుట్టినవాడు కాదు, కేవలం శిష్యుడు. అర్జునుడిని కూర్చోపెట్టుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఉపసంహరణ రెండూ కూడా చెప్పాడు.
ఎవడు యోగ్యుడో, ఎవడు విద్యను సక్రమంగా వినియోగించుకోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించేముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటివారి చేతిలోనే విద్యను పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే అలా ఇవ్వరు. అది గురువు ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాడు ద్రోణుడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు తీసుకోవడానికి కారణముంది. ఏకలవ్యుడు అరణ్యంలో ఉన్నాడు. బాణప్రయోగం పరీక్షించి చూసుకోవడానికి పాండవులు వేటకొచ్చారు. వాళ్ళవెంట వేటకుక్కలు కూడా వచ్చాయి. అవి పరిగెడుతూ ఉండగా ఏకలవ్యుడిని చూసి ‘భౌ’ అని మొరిగాయి. నన్ను చూసి కుక్క మొరుగుతుందా అని తెరిచిన నోరు మళ్ళీ ముయ్యకుండా నోట్లోకి బాణాలు కొట్టాడు. ‘కుక్క అరిస్తేనే ఇలా బాణాలు కొట్టినవాడివి నీ చేతిలో ఎక్కువ విలువిద్య ఉంటే ఈ క్రౌర్యంతో ఎంతమందిని నిష్కారణంగా హింసపెడతావో!
ఇంత క్రౌర్యం ఉన్నవాడు ధర్మానికి ఎలా పనికొస్తాడు! పాత్రత లేదు’. ఆ కారణానికి తీసేసాడు బొటనవేలు. నిజానికి ఆయనకే స్పర్థ ఉంటే అశ్వత్థామకు ఎందుకు చెప్పకుండా ఉంటాడు? తనను చంపడానికి వచ్చిన «ధృష్టద్యుమ్నుడికి ఎందుకు చెప్తాడు? గురువు అంటే ధర్మాన్ని పట్టుకుని అనుసరించాలి. వారు ధర్మాన్ని ఆచరించి చూపారు. అందుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, శంకరాచార్యవంటి వారు ఆచార్యులయ్యారు.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list