MohanPublications Print Books Online store clik Here Devullu.com

సుదర్శనం_Sudarsanam

       సుదర్శనం



సుదర్శనం అనగా మంచిచూపు. మంచిదృష్టి. మంచీ-చెడు అనునవి చూచేవారి దృష్టిని బట్టి మనస్సుననుసరించీ కలుగుతాయి. అంతా మనం చూసే చూపులోనే ఉంటుంది. దర్శనం అనగా మనం కోరుకున్న వస్తువ్ఞ మన ముందు కన్పించుట లేదా ప్రత్యక్షమగుట. ఈ ప్రతక్ష్యమనునది ఆధ్యాత్మికపరంగా ఆలోచించినపుడు దైవం గురించి చేసే సాధన-యోగం-తపస్సు వలననే సిద్ధించడం జరుగుతుంది. పురాణాలలో యోగులు-దేవతలు-దానవ్ఞలు-ఆ యుగాలలోని ప్రముఖులు దైవసాక్షాత్కారం కోసం చేసే నిష్కామ కర్మల ఫలితమే దైవదర్శనం పొందుట జరుగుతూ మోక్షసాధనకు మార్గదర్శనం అవ్ఞతుంది. మన ఆలోచనాపరిధిని బట్టి దర్శనాలు కలుగుతూ ఉంటాయి.

లోకంలో భగవంతుడు భక్తుని భావమును ప్రధానంగా చూచుకొనును గాని ఆయన అర్పించే పదార్థముల విలువలను గానీ ఆతడొనరించు పూజల ప్రాధాన్యతను గానీ చూడడు. భగవద్గీత 11వఅధ్యాయం విశ్వరూప సందర్శనయోగంలో నాల్గవశ్లోకంలో అర్జునుడు పరమాత్మను విశ్వరూపాన్ని చూడాలని కోరుతూ ”మన్యసేయదితచ్ఛక్యం మయాద్రష్టుమితి ప్రభో యోగేశ్వర! తలోమేత్వం దర్శయాత్మా నమవ్యయం అన్నాడు. నాశరహితమైన నీ విశ్వరూపమును నాకు చూపుమన్నాడు.

కృష్ణపరమాత్మ సంతోషించి తన విశ్వరూపాన్ని చూడమంటూ శ్లోII ఇహైకస్థం జగత్‌కృత్నం-పశ్యాద్య సచరాచరమ్‌ మమదేహీగుడాకేశ-యచ్చాన్యద్రష్టుమిచ్ఛసి అంటూ స్థావరజంగమములతో కూడి సమస్త జగత్తును అవయవరూపంతో నా ఈ దేహంనందు ఒకేచోట ఉన్నదానినిగా దర్శించు ఇతరమైన దేనినీ చూడదలంచుచున్నావో దానిని కూడా మంచి దృష్టితో చూడమన్నాడు పరమాత్మ. మామూలుగానే నీవ్ఞ దర్శించే నీ నేత్రములు నా విశ్వరూపమును దర్శించలేవు నీకు దివ్యదృష్టి ప్రసాదిస్తున్నాను. ఈ దివ్యనేత్రము చేతనా మహిమలను దర్శించుము. ఈశ్వరశక్తిని చూడుమన్నాడు. దివ్యదృష్టివలన ఎన్నో దైవదర్శనాలను చేయ వచ్చును.

అర్జునుడు ప్రసన్నచిత్తుడై పరమాత్మ విశ్వరూపాన్ని దర్శించాడు. పిదప పరమాత్మ అర్జునునితో ఇలా అన్నాడు. శ్లోII సుదుర్దర్శమిదం రూపం-దృష్టవానసియన్మమ దేవా! అస్యస్యరూపస్య-నిత్యం దర్శనకాంక్షిణఃII మహాతపస్సుచే చూడదగిన నా రూపమును నీవిపుడు దర్శించావో, అట్టి చూడశక్యముగాని, నా ఈ విశ్వరూపమును దేవతలుకూడా సర్వకాలముల యందును దర్శించవలెనని యెదుకోరుకగలవారై యున్నారు. కానీ దేవతలకు నా దర్శనము దుర్లభము అన్నాడు పరమాత్మ. దర్శన ఫలితాన్ని అద్భుతంగా వర్ణించారు పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఒకనాడు అకాలమున వచ్చి ద్రౌపదిని భోజనం పెట్టమనినాడు. వెంటనే ఆమె వంట పాత్రలో ఒక ప్రక్కనతుక్కున్న ఒక చిన్న మెతుకును భక్తితో వడ్డించినది. దానితోనే కృష్ణుడు తృప్తిపడి ఆకలి తీరిందనీ, ఆమెకు అకాల దర్శనమొసగి ఆమె భక్తిని ప్రశంసించినాడు.

ద్రౌపది కృష్ణదర్శనాన్ని పొందుట ఎంతో అదృష్టం. తులాభార సందర్భమున భక్తితో రుక్మిణి వేసిన తులసీదళముతో సరితూగినాడు శ్రీకృష్ణుడు. అలాగే ఆంధ్రమహాభాగవతంలో కథ కుచేలుడర్పించిన యటుకులనాదరముతో గైకొని వాటి రుచికానందించుచు ప్రేమతో ఆప్యాయంగా ఆరగించినాడు. అవి వట్టి ముడియటుకులు. అవి అంత రుచికరములెట్లైనవి? కుచేలుని పవిత్ర భావమే అటుకులకా రుచిని కల్గించి పరమాత్మ దర్శనం చేయించింది. అటులనే భక్తి ముద్ర పడిన వస్తువ్ఞ అల్పమైనను దాని విలువ హెచ్చుగా ఉంటుంది. ఆ ముద్రపడని వస్తువ్ఞలెంత గొప్పవైనను వాటికి విలువలు సున్న. అలాగే మన జీవన వృక్షముల పండిన ప్రేమ ఫలమును భగవంతునికి అర్పించి, దైవ సాక్షాత్కారాన్ని పొందాలి. దర్శించాలి. దైవదర్శనమే సుదర్శనం. విశ్వాసం-మనోనిగ్రహం గలవారికే మంచి దర్శనాలు లభిస్తాయి.

ప్రభుదర్శనం కోసం వెళ్లునపుడు రిక్తహస్తములతో పోరాదని కుచేలుని భార్య అటుకులనిచ్చి పంపింది భక్తితో-ఆకలి నిండిన హృదయంతో. ”రిక్తహస్తేననోపేయాత్‌-రాజానాం-దైవతం-గురుం అన్నది సూక్తి, శాస్త్రవాక్యం. దర్శనం విషయంలో మనోనిగ్రహం-ధైర్యం-దర్శించే వస్తువ్ఞపట్లగానీ, పరమాత్మ పట్లగానీ దృఢనిశ్చయం కలగాలి. భయసంశయాలుండరాదు. భగవద్దర్శనం కొరకు ఆయన అనుగ్రహం పొందుటకు తనకు అధికారమున్నట్లు నిస్సంకోచముగా పోవలయును. కుచేలుడు అలాగే సహధర్మచారిణి ప్రోత్సాహంతో ధైర్యం కూడగట్టుకుని వెళ్లి పరమాత్మ దర్శనాన్ని పొంది, దైవ ఆతిథ్యాన్ని అందుకొని సకలైశ్వర్య సంపన్నుడై తిరిగి వచ్చుడు తన గృహానికి ఆనందలోలుడై. సుదర్శనం అంటే వివేక దృష్టి. మధురమైన వాక్కు-అర్పణ స్వభావం అలవరచుకోవాలి. దురభిమానం గర్వమును వదులుకుంటే సుదర్శన ప్రాప్తి కలుగుతుంది. భగవంతుని దర్శనంతో అన్ని ప్రాప్తిస్థాయి. రూపదర్శనంలో సద్గుణాలు శోభించాలి. దృశ్యవస్తుదర్శనం అనిత్యం-అశాశ్వతం భగవంతుని దర్శనం శాశ్వతం-సుదర్శనమ్‌II అనన్యభక్తియే సుదర్శనముకు ఆలంబన.
– పి.వి. సీతారామమూర్తి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list