MohanPublications Print Books Online store clik Here Devullu.com

స్తంబాద్రి నరసింహ స్వామి ఖమ్మం_Stambadri Narasimha Swamy Khammam







కొండ గుహలో నారసింహుడు!

ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఉగ్రనారసింహమూర్తి స్తంభం నుంచి ఉద్భవించింది ఈ వూరిలోనేనట. అందుకే ఈ వూరిని స్తంభాద్రి అని పిలుస్తారు. పానకప్రియుడికి ఇక్కడ పానకంతోనే అభిషేకం చేయడం మరో విశేషం. ఖమ్మం నగరంలో కొండగుహలో కొలువైన ఈ నారసింహుడి దర్శనమే భయనాశకం.

హరి నామాన్ని జపించినందుకే కన్న కొడుకును నానా కష్టాలూ పెట్టిన హిరణ్యకశిపుడ్ని సంహరించేందుకు, అతని మాట ప్రకారమే స్తంభం నుంచి ఉద్భవించి భక్తుడి నమ్మకాన్ని నిలబెట్టిన భక్తవరదుడు నారసింహుడు. ఆయన రాక్షస సంహారానంతరం తన అవతారాన్ని చాలించి భక్తుల కోసం కొలువయిన క్షేత్రం ఖమ్మం నగరంలోని స్తంభాద్రి గుట్ట. వివాహం, సంతానం, దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా... లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం అని వేడుకున్న వారిని ఒడ్డున పడేయడమే ఈయన తీరన్నది భక్తుల నమ్మకం. 
మూడు యుగాలకు ముందే... 

ఇక్కడి నారసింహుడు యుగయుగాల దేవుడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. రామావతారానికి ముందు అవతారమైన నారసింహావతారం కృతయుగానికి చెందినదైతే, హిరణ్యకశిపుడ్ని చీల్చిన తర్వాత స్వామి ఆ చోటే కొలువుతీరిన ప్రశస్తి ఉండటంతో తర్వాతి యుగంలో భరద్వాజ మహర్షి ఆయన కొలువైన ఈ గుహనే ఆశ్రమంగా చేసుకున్నారట. తన పరివారంతో కలిసి ఇక్కడ ఉండటమే కాదు ఇక్కడికి దగ్గరలోని ఒక సెలయేరులో స్నానాదికాలు చేస్తుండేవారట. అంతమంది మునులు రోజూ స్నానాలు చేసే ఏరు కనుక ఖమ్మం పక్కగా ప్రవహించే ఏరుకు ‘మున్నేరు’గా పేరొచ్చిందట. భరద్వాజుడి ముని పరివారంలో ఒకరైన మౌద్గల మహాముని లక్ష్మీనరసింహ స్వామి కోసం తీవ్రంగా తపస్సు చేశాడట. అప్పుడు నారసింహుడు లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడట. తర్వాత ద్వాపర యుగంలోనూ ఈచోటు నారసింహ క్షేత్రంగా వెలుగొందినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. మునులు తమ అవసరాలకు నీటి కోసం కోనేటిని అడగగా, స్వామి తన పాదతాడనంతో కొండమీదే కోనేరుని ఏర్పాటు చేశారట. ఇప్పటికీ పాదాకృతిలోనే కనిపించే కోనేటిని ఆలయంలో దర్శించవచ్చు. స్వామి వెలసిన ఈ ప్రాంతం పేరు మీదుగానే ఖమ్మాన్ని తొలుత స్తంభాద్రి అని పిలిచేవారు. తర్వాత కంభంమెట్టుగా, ఖమ్మంగా రూపాంతరం చెందింది.

ఇప్పటి ఆలయం 
ఖమ్మం నగరానికి 20కి.మీ దూరంలో ఉన్న అష్ణగుర్తి గ్రామానికి చెందిన భూపతి వెంకమ అనే భక్తురాలికి ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి తాను స్తంభాద్రి గుట్టపై ఉన్నాననీ, తానున్న ప్రదేశాన్ని చెప్పి నిత్యనైవేద్యాలూ పూజలూ చేయమని ఆదేశించాడట. దీంతో ఆమె వూరి ప్రజలకు విషయం చెప్పి వెంటనే స్తంభగిరిపై స్వామి చెప్పిన ప్రాంతంలో వెదకగా నరసింహుడి గుహ కనపడింది. ఆనందాశ్చర్యాలకు గురైన వూరి భక్తులు స్వామి కైంకర్యాలకోసం అష్ణగుర్తిలో కొంత ప్రాంతాన్ని ఇచ్చారు. అంతేగాక ఆ నరహరికి అర్చనలు చేసేందుకు నరహరి వంశీకులను వెదికి తెచ్చి వారినే వంశపారంపర్యంగా అర్చకులుగా కొనసాగిస్తున్నారు. 16వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నగరంలోని ఖిల్లా నిర్మాణ సమయంలో స్వామివారిని దర్శించుకొని ముఖమండప నిర్మాణం, రాతి ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయించాడట. 32 అక్షరాలతో ఉండే స్వామివారి బీజాక్షర శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని 32 స్తంభాలతో ముఖమండపం, 32 అడుగుల ఎత్తులో రాతి ధ్వజస్తంభం ఏర్పాటుచేయించడం విశేషం. అప్పటి సామంతరాజులు వేమారెడ్డి, లక్ష్మారెడ్డి ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆధారాలున్నాయి.
 
ముస్లిం భక్తులు... 
ఇక్కడ ప్రతి ఉగాదికి స్వామి వారి తొలి అభిషేకం వారి పెద్దల పేరిట ముస్లింలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నిజాం నవాబుల కాలం నుంచీ ఇదే విధానం కొనసాగుతోంది. ఇక్కడ ఇప్పటికీ స్వామి కొండ గుహలోనే కొలువయ్యాడు. దాన్ని కదపకుండానే ఆలయాన్ని నిర్మించారు. పక్కనే మరో గుడిలో లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామిని శాంత పరచేందుకు నిత్యం పానకంతో అభిషేకం జరుపుతారు. భక్తులు తమ కోర్కెలు తీరేందుకు ‘కొబ్బరికాయ ముడుపు’ కట్టడం సంప్రదాయం. ఉన్నత విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, విదేశీయానం తదితర సంకల్పాలతో రవిక గుడ్డలో కొబ్బరికాయను ముడుపు కట్టి ప్రత్యేక పూజలు చేస్తే స్వామి కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం.

ప్రత్యేక పూజలు... 
ప్రతి ఆదివారం ఆలయంలో నిర్వహించే శాంతికళ్యాణం, పవళింపుసేవ, అన్నదాన కార్యక్రమాలకు వేలాది భక్తులు హాజరవుతారు. వైశాఖమాసంలో వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలు, శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు, ఆశ్వయుజమాసంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, కార్తీకమాసంలో దీపోత్సవం, ధ్వజస్తంభంపై ఆకాశదీపం ఏర్పాటుచేయడం, ధనుర్మాసంలో నెల రోజుల పాటు తెల్లవారుజామునే స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. దసరా రోజున స్వామి వారి పారువేటను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇది నిజాముల కాలం నుంచీ కొనసాగుతోంది. 
ఖమ్మం నగరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరాలంటే హైదరాబాద్‌ నుంచి 200 కి.మీ, విజయవాడ నుంచి సుమారు 120 కి.మీ ప్రయాణించాలి. రైలు సదుపాయమూ ఉంది.
- అల్లూరి శ్యాంకుమార్‌, న్యూస్‌టుడే, ఖమ్మం 
చిత్రాలు: కె.శ్రీనివాస్‌




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list