MohanPublications Print Books Online store clik Here Devullu.com

మలి వయసులో.. ఆర్థిక వ్యూహం! -Siri

మలి వయసులో.. ఆర్థిక వ్యూహం! 
పదవీ విరమణ చేయబోతున్నారా? మరి లక్షల్లో రాబోతున్న డబ్బును ఏం చేయాలో ఆలోచించుకున్నారా? మరో 20 ఏళ్ల వరకూ అది మిమ్మల్ని సంరక్షించాలి. మరి దీనికోసం మీ వ్యూహం ఎలా ఉండాలి? మున్ముందు ఏ ఆర్థిక ఇబ్బందులూ దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఉద్యోగంలో ఉన్నప్పుడు ఓ భరోసా ఉంటుంది. నెలనెలా క్రమం తప్పని ఆదాయం.. ఎప్పటికప్పుడు పెరిగే వేతనం.. వైద్య సౌకర్యం లాంటివి ఉంటాయి. పదవీ విరమణ చేసిన తర్వాత ఇలాంటివి దాదాపు దూరం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పింఛను, పరిమితులతో కూడిన వైద్య చికిత్సా ఖర్చులు అందుతాయి. ఈ వెసులుబాట్లు ఉన్నా.. లేకున్నా.. ప్రతి ఒక్కరూ.. తమకంటూ ఓ కచ్చితమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. అప్పుడే నెలనెలా సొమ్ముకు ఇబ్బంది పడకుండా.. 20ఏళ్లకు పైగా విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు వీలవుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వయసులో పెట్టుబడులు ఉండాలి. ఉన్న సొమ్ముతోనే భవిష్యత్తు అంతా ఏ కష్టం లేకుండా ఎవరిమీదా ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ ఉండేలా చూసుకోవాలి.
పొదుపూ.. పెట్టుబడి.. 
సరైన ఆదాయమే లేనప్పుడు పొదుపు, పెట్టుబడులు అంటే కష్టమే. వీటితో ఇప్పుడేం అవసరం అనే సందేహమూ రావచ్చు. ఇక్కడ ఆదాయం ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు.. వచ్చిన ఆదాయంలో నుంచి కనీసం 10శాతం పొదుపు చేశామా లేదా అనేదే ముఖ్యం. ఒక్కసారి మీరు ఉద్యోగం ప్రారంభించిన రోజులు గుర్తుకు తెచ్చుకోండి. అప్పటి నుంచీ ఎంతో కొంత పొదుపు, పెట్టుబడి పెట్టడం వల్లే కదా.. ఇప్పుడు మీరు ఈ స్థాయికి చేరింది? ఆ అలవాటును ఇప్పుడు మానుకోకండి. పదవీ విరమణ తర్వాత వచ్చిన సొమ్ము నుంచి కూడా కొంత పొదుపు చేయండి. ఆ మొత్తాన్ని సరైన పథకాల్లో మదుపు చేయండి. వృథా ఖర్చులు సాధ్యమైనంత వరకూ కట్టడి చేయండి. దీనివల్ల మీ దగ్గరున్న సొమ్ము నిల్వ కరిగిపోకుండా ఉంటుంది.
ఆరోగ్యం జాగ్రత్త! 
మన దగ్గరున్న డబ్బు ఒక్కసారిగా కరిగిపోవడానికి ఒక్కసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే చాలు. పెరుగుతున్న వైద్య ఖర్చులు అందరికీ ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. 58, 60 ఏళ్ల తర్వాత ఆరోగ్య సమస్యలు కాస్త అధికంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి, ముందుగా మీరు చేయాల్సిందేమిటో తెలుసా? మీ ఆరోగ్యాన్ని వీలైనంత వరకూ కాపాడుకోవడం. అప్పుడే మీ దగ్గరున్న డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు బృంద ఆరోగ్య బీమా పాలసీలు ఉంటాయి. వీటిని వ్యక్తిగత పాలసీలుగా మార్చుకునే వెసులుబాటు ఉందా? ఒకసారి తెలుసుకోండి. ఆదాయం తగ్గిందనీ, ఖర్చులు తగ్గాయనీ ఆరోగ్య బీమాను విస్మరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. ఇప్పటికే మీరు వ్యక్తిగతంగా పాలసీని తీసుకుంటే.. దాన్ని కొనసాగించండి. వాస్తవానికి 54 ఏళ్ల వయసు వచ్చే నాటికే సొంతంగా ఒక ఆరోగ్య పాలసీ తీసుకోవడం ఎవరికైనా అవసరమే. ఇప్పటికైనా ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు పెద్దల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. ఇవి కొంత ఖరీదే అయినప్పటికీ వైద్య ఖర్చులను తట్టుకునేందుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు.. 58-60 ఏళ్ల వయసు వారు ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు.. రూ.3లక్షల పాలసీకి కనీసం రూ.12వేల వరకూ ప్రీమియం ఉంటుంది. రూ.5లక్షల పాలసీని ఎంచుకుంటే రూ.17వేల వరకూ చెల్లించాల్సి రావచ్చు.
ఒకే చోట వద్దు! 
‘వచ్చిన డబ్బంతా ఒక చోట పెడితే ఇబ్బంది లేకుండా రాబడి వస్తుంది కదా!’ ఈ ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ, దీనివల్ల తక్కువ రాబడి వచ్చే పథకాలనే చూడాల్సి వస్తుంది. అసలుకూ, రాబడికీ హామీ ఉండటం ఒక్కటే పెట్టుబడులకు ప్రామాణికం కాదు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని ఆర్జిస్తున్నామా లేదా అనేదే ప్రధానం. ద్రవ్యోల్బణాన్ని మించి కనీసం 1 శాతమైనా అధిక రాబడి వచ్చేలా పెట్టుబడులు ఉండాల్సిన అవసరం ఉంది. ముందుగా మీరు చేయాల్సిందేమిటంటే.. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని బ్యాంకులో ఉంచుకోండి. కొంత మొత్తాన్ని సులువుగా నగదుగా మార్చుకునే వీలుండే పెట్టుబడులు పెట్టాలి. నెలవారీ ఆదాయం కోసం పోస్టాఫీసు పథకాలు, పెద్దల పొదుపు పథకం, మ్యూచువల్‌ ఫండ్లు అందించే మంత్లీ ఇన్‌కం ప్లాన్లను పరిశీలించవచ్చు. కొంత దీర్ఘకాలిక పెట్టుబడి కోసం జాతీయ పొదుపు పథకాలు, డెట్‌ ఫండ్లు, బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆశ్రయించవచ్చు. అనుకోని ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని స్వల్పకాలిక డిపాజిట్లు, లిక్విడ్‌ ఫండ్లలో పెట్టుకోవచ్చు.
పెట్టుబడి వృద్ధి చెందాలి.. 
సురక్షిత పథకాల్లో రాబడికి హామీ ఉంటుంది. కానీ, పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేంత రాబడి రాకపోవచ్చు. కాబట్టి, కొంత నష్టభయం ఉన్నప్పటికీ ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల వైపు చూడటం మంచిది. మీ పెట్టుబడుల్లో 20శాతానికి మించకుండా బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే ప్రయత్నం చేయవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నప్పుడు స్థిరాస్తులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ పెట్టుబడి వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకొని, అప్పుడప్పుడూ కొంత మొత్తం రావాలనుకున్నప్పుడు డివిడెండ్‌ ఆప్షన్‌ను పరిశీలించాలి.
పింఛను రావాలంటే.. 
పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం రావాలని భావించే వారు బీమా సంస్థలు అందించే ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాలను పరిశీలించవచ్చు. వీటితో పాటు మార్కెట్లో అనేక ఇతర పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యాన్యుటీ పథకాల్లో మీరు పెట్టిన పెట్టుబడి సొమ్మును బట్టి, హామీతో కూడిన రాబడి నెలనెలా వస్తుంది. మీ తదనంతరం మీ జీవిత భాగస్వామికి కూడా పింఛను అందే ఏర్పాటు చేయవచ్చు. ఇందులో కూడా రకరకాల అవకాశాలున్నాయి. జీవితాంతం వరకూ ఇద్దరికీ పింఛను అంది, తర్వాత ఆ సొమ్మును నామినీకి అందించేలా చూసుకోవచ్చు. ఇలాంటి పాలసీల వల్ల మీకు ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం అవుతుంది. (పింఛను పథకాలపై పూర్తి సమాచారం కోసం.. ఈనాడు.నెట్‌, సిరిలో.. ‘కాస్త అధిక పింఛను వచ్చేలా’ కథనాన్ని చూడండి.)
ఇల్లుంటే చాలు.. 
మీకు సొంతిల్లు ఉందా? అయితే, అదే మీకు మలి వయసులో కొండంత రక్ష. మీ ఇంట్లో మీరు ఉంటూనే.. దానిని పింఛను ఇచ్చే మార్గంగా మలుచుకోవచ్చు. దీనికోసం బ్యాంకులు అందిస్తున్న ఎదురు తనఖా (రివర్స్‌ మార్టిగేజ్‌) పథకాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మీ పదవీ విరమణ జీవితాన్ని ఏ ఆర్థిక ఇబ్బందీ లేకుండా గడిపేందుకు అవకాశం ఉంటుంది. మీ దంపతుల తదనంతరం బాకీ మొత్తాన్ని చెల్లించి, మీ వారసులు ఇంటిని తిరిగి తీసుకోవచ్చు. లేదా బ్యాంకు ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, ఇల్లు ఎక్కడ ఉందన్నది ఈ విషయంలో ప్రధానం. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఉంటే బ్యాంకులు ఈ పథకాన్ని అమలు చేయడానికి అంగీకరించకపోవచ్చు. పూర్తి వివరాల కోసం బ్యాంకులను సంప్రదించండి.
మొహమాటాలు వద్దు.. 
పదవీ విరమణ చేయగానే లక్షల రూపాయిలు చేతికి వస్తాయి. ఇలాంటప్పుడే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొడుకులు, కూతుళ్లకూ కొంత మొత్తం ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది. మనవడికీ, మనవరాలికీ బహుమతులు ఇవ్వాలనుకుంటారు. గృహోపకరణాల కోసం ఖర్చు చేస్తుంటారు. ఇవన్నీ కూడా కాస్త విచక్షణతో చేయాల్సిన విషయాలు. అధిక వడ్డీ ఆశతో అప్పులు ఇవ్వడం, తెలియని వ్యాపారాల జోలికి వెళ్లడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. 
* మీకు అభిరుచి, అనుభవం ఉన్న రంగాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విషయాన్ని ఆలోచించవచ్చు. సేవా కేంద్రాల్లాంటివి కూడా నిర్వహించే విషయాన్ని పరిశీలించవచ్చు.
పన్ను..భారం కాకూడదు
క్రమం తప్పని ఆదాయం వస్తున్నప్పుడు నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సిందే. కానీ, మలి వయసులో వచ్చే రాబడిపై పన్ను పడకుండా చూసుకోవాలి. కనీసం 10శాతం పన్ను పడినా ఎంతో కొంత కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి, పన్ను పరిమితి దాటిన ఆదాయం ఉన్నవారు... ఇతర మినహాయింపుల కోసం ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామికి ఏ ఇతర ఆదాయాలు లేకపోతే.. పెట్టుబడులన్నీ తన పేరుమీద చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకునేందుకు వీలవుతుంది.



రాయితీతో.. గృహరుణం...
పట్టణాల్లో నివసిస్తూ సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీకి ఇంటి రుణం లభిస్తే ఆ అనందమే వేరు కదూ! అది కూడా వడ్డీ రాయితీ ఉంటే.. నెలకు రూ.25,000లోపు ఆదాయం వస్తున్న కుటుంబాల నుంచి రూ.1,50,000 నెలసరి ఆదాయం ఉన్న వారి వరకూ అన్ని సదుపాయాలతో సొంతింటి కలల్ని నిజం చేయడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమే ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం’. మరి దీని గురించి తెలుసుకుందామా!
ఆదాయం రూ. 6 లక్షలుంటే..
వార్షిక కుటుంబ ఆదాయం రూ.6లక్షలోపు ఉన్నవారు ఆర్థిక ‘బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాలకు వడ్డీ రాయితీ రుణ పథకం’లో భాగంగా రుణం పొందేందుకు అర్హులు. 
* రూ.3లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న కుటుంబాలను ఆర్థిక బలహీన వర్గాల వారిగానూ, రూ.3లక్షల పైన రూ.6లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న కుటుంబాలను అల్పాదాయ వర్గాలుగానూ పరిగణిస్తారు. 
* భార్య, భర్త, పెళ్లికాని పిల్లలను కలిపి లబ్దిదారు కుటుంబంగా పరిగణిస్తారు. 
* పారిశుధ్య కార్మికులు, వితంతు మహిళలు, మహిళలు, షెడ్యూలు కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దివ్యాంగులు, లింగ మార్పిడి చేయించుకున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యం ఉంటుంది. 
* ఆర్థిక బలహీన వర్గాల వారు నిర్మించాలనుకున్న, విస్తరించాలనుకున్న ఇళ్లు 30 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా (సుమారు 323 చదరపు అడుగులు) వరకూ ఉండవచ్చు. అదే విధంగా అల్పాదాయ వర్గాల వారైతే 60 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా (సుమారు 646 చదరపు అడుగులు) వరకూ ఉండవచ్చు.
ఎంత తగ్గుతుంది?
* లబ్దిదారు అదాయాన్ని అనుసరించి గరిష్ఠ రుణ పరిమితిని, రుణ చెల్లింపు కాలాన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. 
* రుణ పరిమితికి లోబడి, రూ.6లక్షలు, 20 ఏళ్ల రుణ చెల్లింపు పరిమితి వరకూ 6.5% వడ్డీ రాయితీకి అర్హులు. రూ.6లక్షలకు పైగా, 20 ఏళ్లకు మించిన చెల్లింపు వ్యవధితో మంజూరైన రుణాలకు వడ్డీ రాయితీ లెక్కింపు రూ.6లక్షలు, 20ఏళ్ల చెల్లింపు వ్యవధికి పరిమితమవుతుంది. 
* ఈ 6.5%వడ్డీ రాయితీని, నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికన లెక్కించి ఆ మొత్తాన్ని, కేంద్ర ప్రభుత్వం ఆయా ఆర్థిక సంస్థలకు, రుణ మంజూరు సమయంలో విడుదల చేస్తుంది. ఆ మొత్తం లబ్దిదారుడికి మంజూరైన పరిమితిలో మినహాయించి, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, లబ్దిదారుడు చెల్లించాల్సిన నెలసరి వాయిదాను నిర్ణయిస్తాయి. ముందస్తుగానే వడ్డీ రాయితీ మంజూరు కావడం వల్ల, చెల్లించాల్సిన నెలసరి వాయిదాలో భారీగా తగ్గింపు లభిస్తుంది. 
* ఉదాహరణకు మీకు రూ.10లక్షల రుణం మంజూరయ్యిందనుకోండి. మీరు రూ.6లక్షల వరకూ వడ్డీ రాయితీ పొందేందుకు అర్హులు. కాబట్టి, ఆ మొత్తంపై నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికన, 20 ఏళ్ల చెల్లింపు పరిమితికి వడ్డీ రాయితీ లెక్కిస్తే రూ.2,67,280 వడ్డీ రాయితీకి మీరు అర్హులవుతారు. ఈ మొత్తాన్ని రూ.10లక్షల్లో నుంచి తగ్గించి, రూ.7,32,720లకు మాత్రమే నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు. అంటే, సుమారు నెలకు రూ.2,500 వరకూ మీకు లబ్ది చేకూరినట్లే.
మధ్యతరగతి వారికీ..
వార్షికాదాయం రూ.6లక్షలు-రూ.12లక్షల మధ్య ఉన్నవారు మధ్యాదాయ పథకం-1లోను, రూ.12లక్షలు- రూ.18లక్షల లోపు కుటుంబ ఆదాయం వస్తున్న వారు మధ్యాదాయ పథకం-2 లోనూ రుణం పొందేందుకు అర్హులు. 
* ఇళ్ల నిర్మాణం, కొనుగోలు కోసం గరిష్ఠంగా రుణాన్ని పొందవచ్చు. 
* భార్య, భర్త, పెళ్లికాని పిల్లలను కలిపి లబ్దిదారు కుటుంబంగా పరిగణిస్తారు. వైవాహిక స్థితితో నిమిత్తం లేకుండా ఆదాయం కలిగిన వయోజనులను వేరే కుటుంబంగా పరిగణిస్తారు. 
* మధ్యాదాయ పథకం-1 లబ్దిదారులైతే, నిర్మించదలచుకున్న లేదా కొనదలచుకున్న ఇళ్లు 90 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా (సుమారు 969 చదరపు అడుగులు) వరకూ ఉండవచ్చు. అదే విధంగా మధ్యాదాయ పథకం-2 లబ్దిదారులైతే 110 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా (సుమారు 1184 చదరపు అడుగులు) వరకూ ఉండవచ్చు.
ఎంత తగ్గుతుంది?
* గరిష్ఠ రుణ పరిమితి, గరిష్ఠ చెల్లింపు గడువు ఆయా రుణ మంజూరు సంస్థల నిబంధనలని అనుసరించి ఉంటాయి.
* మధ్యాదాయ పథకం - 1 లబ్దిదారులు, పొందిన రుణ పరిమితికి లోబడి, రూ.9లక్షలు, 20ఏళ్ల రుణ చెల్లింపు పరిమితి 4 శాతం వడ్డీ రాయితీకి అర్హులు. 
* మధ్యాదాయ పథకం-2 లబ్దిదారులు, పొందిన రుణ పరిమితికి లోబడి, రూ.12లక్షలు, 20 ఏళ్ల రుణ చెల్లింపు పరిమితి వరకూ 3శాతం వడ్డీ రాయితీకి అర్హులు. ఉదాహరణకు ఈ వర్గంలో, మీకు రూ.15లక్షల రుణం మంజూరయిందనుకోండి. మీరు రూ.12లక్షల రూపాయల వరకూ వడ్డీ రాయితీ పొందేందుకు అర్హులు. కాబట్టి, ఆ మొత్తంపై నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికన, 20ఏళ్ల చెల్లింపు పరిమితికి వడ్డీ రాయితీ లెక్కిస్తే రూ.2,30,156 వడ్డీ రాయితీకి మీరు అర్హులవుతారు. ఈ మొత్తాన్ని రూ.15లక్షల్లో నుంచి తగ్గించి, రూ.12,69,844మీద మాత్రమే నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు. అంటే, సుమారు నెలకు రూ.2వేల వరకూ మీకు లబ్ది చేకూరుతుందన్నమాట. 
* మధ్యాదాయ పథకం-1 లబ్దిదారులు రూ.9లక్షల పైన పొందిన రుణ మొత్తానికి, మధ్యాదాయ పథకం-2 లబ్దిదారులు రూ.12లక్షలపైన పొందిన రుణ మొత్తానికి, 20ఏళ్ల చెల్లింపుపైన కాల పరిమితికి వడ్డీ రాయితీ వర్తించదు. అంటే, వడ్డీ రాయితీ పరిమితికి మించిన కాలానికి, రుణ మొత్తానికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇతర ఇంటి రుణ ఖాతాదారులకు వర్తించే వడ్డీని లెక్కిస్తాయన్నమాట.
ఏయే బ్యాంకుల్లో...
ఆంధ్రాబ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌లతో 30 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌తో సహా 22 గ్రామీణ బ్యాంకులు, 70కు పైగా హౌసింగ్‌ ఫైనాన్సు సంస్థలు, సహకార బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఇంటి రుణాలు పొందవచ్చు. 
* రుణ పరిమితి, రుణ చెల్లింపు వ్యవధిల ఆధారంగా, మీరు పొందబోయే వడ్డీ రాయితీని ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు. 
https://nhb.org.in/government-scheme/pradhan-mantri-awas-yojana-credit-linked-subsidy-scheme/ 
* రుణం పొందాలనుకుంటున్న లబ్దిదారులు పథకం అమలు చేస్తున్న బ్యాంకులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కోసం నిర్దేశించిన ప్రతినిధి సంస్థల ద్వారాగానీ రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. 
* భారత దేశంలో ఎక్కడా, సొంత పక్కా ఇల్లు లేని వారు మాత్రమే ఈ పథకంలో రుణం పొందేందుకు అర్హులు. అయితే, ప్రస్తుతం ఉన్న పక్కా ఇంటి విస్తరణ, అభివృద్ధి కోసం రుణ మంజూరు విషయంలో ఈ నిబంధన వర్తించదు.
* అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు, గృహ సముదాయాల్లో నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేసినప్పుడూ నిబంధనల ప్రకారం వడ్డీ రాయితీ లభిస్తుంది.
-పున్నమరాజు


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list