MohanPublications Print Books Online store clik Here Devullu.com

మదిలో మెదిలితే చాలు!-MadhiloMedhilthe Chalu


చర్మంపై కురుపులు వస్తే..

సాధారణంగా స్టాఫిలోకోక్కస్‌ అనే బ్యాక్టీరియా చర్మం మీద కురుపులు, పుండ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. ముందు ఎరుపు రంగులో కనిపించే ఈ కురుపులు ఆ తర్వాత చీము నిండి పుండుగా మారతాయి. ఈ దశలో విపరీతమైన నొప్పి, బాధ ఉంటాయి. ఈ సమస్యకు గృహ వైద్యంగా...
శొంఠి, ఇంగువను కలిపి, చూర్ణం చేసి, అందులో కొద్దిపాటి నీరు కలపాలి. అలా ఫేస్ట్‌గా తయారు చేసి, ఆ కురుపులు లేదా పుండ్లపైన రోజుకు రెండుసార్లు రాయాలి.
తులసి ఆకు రసంలో కాస్తంత పసుపు కలిపి... ఫేస్ట్‌ చేసి, పుండ్లమీద రుద్దాలి. ఈ ముద్దను కడుపులోకి కూడా తీసుకోవచ్చు. దీనివల్ల రక్తశుద్ధి కలిగి పుండ్లు తొందరగా నయం అవుతాయి.
లేత తమలపాకులను పెనం పైన వేసి మెత్తబడే దాకా వేడిచేయాలి. శుద్ధి చేసిన ఆముదం లేదా వండిన ఆముదాన్ని ఆ తమలపాకుల మీద రాసి పుళ్ల మీద పెట్టాలి.
ఆవాల చూర్ణంతో ఫేస్ట్‌ చేసి, పుండ్ల మీద లేపనంగా రాసినా మంచి ఫలితం ఉంటుంది.
పచ్చి నేల వామును సేకరించి, నూరి మాత్రలు తయారు చేసి, ఎండబెట్టి, గాజు సీసాలో భద్రపరుచుకుని ప్రతి రోజూ రెండు పూటలా... రెండేసి చొప్పున తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.
ఈ చిట్కాలు కురుపులు, పుండ్ల బాధ నుంచి చాలా తొందరగా ఉపశమనం కలిగిస్తాయి.


ఇవి తింటే ఆకలి తగ్గుతుంది!

ఆకలి బాగా వేస్తోందా... తిండిని కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నారా? అయితే ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని డైట్‌ నిపుణులు చెపుతున్నారు. నిత్యం వాల్‌నట్స్‌, సాల్మన్‌ చేపను తినమని సలహా ఇస్తున్నారు. కెనోలా నూనె వాడితే కూడా ఒంటికి మంచిదంటున్నారు. ఈ మూడింట్లలోనూ పోలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ (పియుఎ్‌ఫఎ) బాగా ఉన్నాయి. ఇవి హార్మోన్లలో మార్పు తెచ్చి ఆకలిని తగ్గిస్తాయి. అందుకే వీటిని తరచూ వాడమని నిపుణులు చెప్తున్నారు. వీటిని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. మన తినే తిండిని క్రమబద్ధీకరించడంలో ఎపిటైట్‌ హార్మోన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఏ మేర తినాలో సూచిస్తాయి. వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉండే పోలిఅన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ (పియుఎ్‌ఫఎ) ఎపిటైట్‌ హార్మోన్‌లో మార్పులు తెచ్చి కొద్ది ఆహారంతోనే మన కడుపు నిండిపోయేట్టు చేస్తాయి. పోలిఅన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ వాల్‌నట్స్‌, సాల్మన్‌ చేప వంటి వాటిల్లోనే కాకుండా అలస్కా సాల్మన్‌, ట్యూనా, అవిశ నూనె, గ్రేప్‌ సీడ్‌ ఆయుల్‌, కెనోలా ఆయుల్‌, ఫిష్‌ ఆయుల్‌ సప్లిమెంట్లలో కూడా పుష్కలంగా ఉన్నాయి.


బాదాంతో నిగనిగ

ముఖంలో తేజస్సు రావాలంటే సౌందర్యసాధనాలను ఆశ్రయించాల్సిందే. అలాగని క్రీములు, లోషన్ల వెంబడి పడితే అసలుకే ఎసరు రావొచ్చు. సహజ సిద్ధమైన వస్తువులతో ముఖారవిందాన్ని చంద్రబింబంగా మలుచుకోవచ్చు. ఒకసారి బాదాం పప్పులను ఆశ్రయించి చూడండి.. మోములో మోదం ఖాయం.
బాదాంలో ఎన్నో పోషకాలున్నాయి. విటమిన్స్‌, మినరల్స్‌, ప్రొటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. బాదాం ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా చర్మానికి కావలసిన పోషకాలు అందుతాయి.
జిడ్డు చర్మం ఉన్నవారికీ, పొడి చర్మంతో సతమతమయ్యే వారికీ.. ఇద్దరికీ బాదాం ఫేస్‌ప్యాక్‌లు సాయపడతాయి.
జిడ్డు చర్మానికి
బాదాం పప్పులు ఐదారు తీసుకొని రాత్రంతా బాగా నానబెట్టాలి. ఉదయాన్నే బాదాం కాయలను పేస్ట్‌లా అరగదీసి, అందులో ఓట్‌ మీల్‌ వేయాలి. తర్వాత కొద్దిగా పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి... అరగంట తర్వాత చన్నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే మేని ఛాయ మెరిసిపోతుంది.
బాదాం పేస్ట్‌లో అరటిపండు గుజ్జును బాగా కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.
పొడి చర్మానికి
బాదాం పేస్ట్‌లో అరగదీసిన గంధం కలిపి.. ముఖానికి అప్లై చేసి, బాగా మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకున్నా సత్ఫలితం కనిపిస్తుంది.
చిన్న కప్పు శెనగపిండి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అందులో బాదాం పేస్ట్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి గంట సేపు ఆరనివ్వాలి. తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.


బెడ్‌రూమ్‌ చిన్నగా ఉంటే!

పడకగది చిన్నగా ఉంటే వస్తువులను అమర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మల్టీఫంక్షన్‌ ఫర్నిచర్‌ను ఎంచుకోవడం, అవసరం లేని ఫర్నిచర్‌ను తొలగించడం వంటివి చేయడం వల్ల బెడ్‌రూమ్‌లో స్థలం కలిసొస్తుంది. అలాంటి కొన్ని చిట్కాలు ఇవి.
పడకగదిలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకునే ఫర్నిచర్‌ ఉంటే తొలగించాలి. వాటి స్థానంలో బెడ్‌లోనే కింద స్టోర్‌ చేసుకునే సౌలభ్యం ఉన్న బెడ్స్‌ను ఎంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల బెడ్‌రూమ్‌ విశాలంగా కనిపిస్తుంది.
మల్టీఫంక్షన్‌ ఫర్నిచర్‌ను ఉపయోగించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ ఫర్నిచర్‌ను సోఫాగాను, బెడ్‌గాను ఉపయోగించుకోవచ్చు. అపార్ట్‌మెంటుల్లో స్థలం లభ్యత తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఈ ఫర్నిచర్‌ బాగా నప్పుతుంది.
బెడ్‌రూమ్‌లో ముర్ఫీ బెడ్‌ను ఏర్పాటు చేసుకున్నా స్థలం కలిసొస్తుంది. ఈ రకమైన బెడ్‌ ఒక గోడకు అమరిపోతుంది. కావాలనుకున్నప్పుడు బయటకు లాగి బెడ్‌ మాదిరిగా వేసుకోవచ్చు. ఒక రకంగా ఫోల్డ్‌ చేసుకునే బెడ్‌ అన్నమాట.
బెడ్‌రూమ్‌లో స్టీరియో, గేమింగ్‌ సిస్టమ్‌ వంటివి ఉంటే వాటిని లివింగ్‌రూమ్‌లోకి లేదా మరో గదిలోకి మార్చుకోవాలి. ఒకవేళ టీవీ తప్పనిసరైతే గోడకు అమర్చుకునే టీవీని ఎంచుకోవాలి.
వీలైతే బెడ్‌ సైజు కొద్దిగా తగ్గించుకోవచ్చు. దీనివల్ల పడకగదిలో స్థలం కొంత ఫ్రీ అవుతుంది.

కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లు ముందే తెలుసుకోలేమా?
ఇటీవలి కాలంలో కిడ్నీల్లో ఏర్పడిన రాళ్ల కారణంగా చాలా మంది సతమతమవుతున్నారు. అయితే కొంత మంది రాళ్లు. ఏడెనిమిది మి. మీటర్లు పెరిగే దాకా డాక్టర్‌ను సంప్రతించడమే లేదు. దీనికి రాళ్లు ఏర్పడిన తాలూకు లక్షణాలేవీ తెలియకపోవడం కారణమా? లేక ఆ లక్షణాల్ని వీళ్లు నిర్లక్ష్యం చేస్తారా? ఇంతకీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయో, వాటిని ఏ మేరకు గుర్తించవచ్చో చెప్పండి?
- ఎల్‌. కాశీరాం, రామగుండం
రక్తంలో క్యాల్షియం, పాస్పరస్‌, యూరిక్‌ యాసిడ్‌, లవణాల మోతాదు మించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అయితే, రాళ్లు ఏర్పడ టం అన్నది మూత్రపిండాల్లోనే జరిగినా, వాటిల్లోంచి కొన్ని కిందికి జారి, మూత్రాశయంలోకి, మూత్రనాళంలోకి చేరుతాయి. కొందరిలో ఈ రాళ్లు ఏర్పడటానికి మూత్రవ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం కూడా కారణం కావచ్చు. అయితే ఈ రాళ్లు, మూత్రనాళపు సున్నితమైన పొరను నిరంతరం రాపిడికి గురిచేయడం ద్వారా బాగా దెబ్బతీస్తాయి. అందుకే ఆ విషయాన్ని ముందే గమనించడం చాలా అవసరం. అయితే కొన్ని ప్రత్యేక లక్షణాల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నదీ లేనిదీ ముందే గమనించవచ్చు. ఆ లక్షణాలు...
నొప్పి, వీపు కింది భాగంలో మొదలై అది పొత్తి కడుపుదాకా వ్యాపిస్తుంది. దీనివల్ల వృషణాల్లోనూ, పురుషాంగంలోనూ మంట, పోటు వేధిస్తాయి. స్త్రీలలో అయితే జననాంగం వరకూ మంట ఉంటుంది.
పొత్తి కడుపు నుంచి పురీషనాళం వరకు నొప్పి తెరలు తెరలుగా వస్తూ, తీవ్రమవుతుంది. కాకపోతే ఈ నొప్పి నిరంతరంగా కాకుండా, కాసేపు ఉంటూ, మరికాసేపట్లో తగ్గుతూ ఉంటుంది. మౌలికంగా ఈ నొప్పి కిడ్నీ నుంచి మూత్రాశయం వరకు రాయి మూత్రనాళలంలో కదులుతూ ఉండడం వల్ల కలుగుతుంది.
కొందరికి, వాంతులు, వణుకు, జ్వరం, కడుపులో తిప్పుతున్న భావన ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో భరించరాని నొప్పి కూడా ఉంటుంది.
రాయి వల్ల కలిగే రాపిడితో నడుము, పొత్తి కడుపు బాగా సున్నితమైపోయి తాకినా భరించలేనంతగా నొప్పి కలుగుతుంది. కొందరికి మూత్రంలో రక్తం కూడా పడవచ్చు.
ఈ లక్షణాల ఆధారంగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గ్రహించి వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే, సమస్య నుంచి చాలా తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి.
- డాక్టర్‌ కె. వినీత్ కుమార్‌, నెఫ్రాలజిస్ట్‌

మదిలో మెదిలితే చాలు!
పూర్వం ఒక గ్రామంలో ఒక అమాయక యువకుడు ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం అతడు పక్క గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. సాయం సంధ్య అవుతండటంతో ముందుజాగ్రత్తగా ఒక లాంతరు పట్టుకుని ఊరి నుంచి బయల్దేరాడు. ఒక మైలు వెళ్లే సరికి బాగా చీకటి పడింది. ఒక చెట్టు కింద కూర్చుని లాంతరు వెలిగించాడు. లాంతరు పట్టుకుని బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఏమైందో గానీ, అక్కడే చతికిలపడి బోరున విలిపించడం మొదలుపెట్టాడు. అదే చెట్టు కింద విశ్రమిస్తున్న ఒక సాధువు యువకుడి దగ్గరకు వచ్చాడు. ‘ఏం నాయనా! ఎందుకు ఏడుస్తున్నావ్‌?’ అని ప్రశ్నించాడు. దానికా యువకుడు.. ‘స్వామి! ఇప్పటికే బాగా చీకటి పడింది. ఈ లాంతరు చూస్తే.. దీని వెలుగు పది గజాలకు మించి రావడం లేదు. నేనేమో ఇంకా రెండు మైళ్లు ప్రయాణించాలి. ఇంత చీకటిలో అంత దూరం వెళ్లడం ఎలాగో పాలుపోవడం లేద’ని బదులిచ్చాడు. యువకుడి అమాయకత్వం చూసి సాధువుకు జాలి కలిగింది. ‘బాబూ! నీ వెంట వెలుగు ఉండగా భయమెందుకు. నువ్వు పది గజాలు నడువు. లాంతరు వెలుగు మరో పది గజాలు విస్తరిస్తుంది..’ అని యువకుడికి ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విని యువకుడు నడక ప్రారంభించాడు. భక్తి, వైరగ్యం, విచారణ ఇవి కూడా ఒక్కరోజులో తటస్థపడేవి కావు. ఈ భావనలు మనసులో చిరుదివ్వెలా వెలిగితే చాలు.. ఆ చిన్ని ప్రకాశం ఆలంబనగా సాధన చేస్తే.. అజ్ఞానందకారాలు తొలిగిపోతాయి.

నయాపూల్‌...బహుత్ పురానా హై!
ఈ రోజు కొత్త అనిపించినది... రేపటికి పాతవుతుంది. కొన్ని మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. శతాబ్దాలు గడిచిపోయినా వాటి కొత్తదనం అలాగే నిలిచిపోతుంది. మరి అవి నిత్యనూతనంగా ఉంటాయా అంటే... అలా కనిపించవు, అనిపించవు. అయినా ఎంత పాతబడిపోయినా.. పేరు మొదట్లో మాత్రం కొత్త వేలాడుతూనే ఉంటుంది. హైదరాబాద్‌లో నయాపూల్‌ అలాంటిదే. ఎప్పుడో నిజాంల కాలంలో కట్టినా.. ఇప్పటికీ ఆ బ్రిడ్జి పేరు నయాపూలే. అలాగే రెండేసి బస్టాండులు ఉన్న పట్టణాల్లోనూ కొత్త, పాత పేర్లు వినిపిస్తూ ఉంటాయి. కొత్త బస్టాండ్‌ ఎంత పాతబడినా.. పేరులో మాత్రం కొత్త కొనసాగుతూనే ఉంటుంది. పాత బస్టాండు పునర్నిర్మాణంతో కొత్తదనం సంతరించుకున్నా.. కొత్త బస్టాండ్‌ పేరు మాత్రం చెక్కు చెదరదు. మన దగ్గరే కాదు పారి్‌సలోనూ కాలం మార్చని కొత్తదనం ఒకటి ఉంది. అదే సీన్‌ నదిపై నిర్మించిన పాంట్‌నెఫ్‌ (న్యూ బ్రిడ్జ్‌). దీని నిర్మాణం ఎప్పుడు మొదలైందో తెలుసా.. 1578 సంవత్సరంలో. పూర్తయ్యే సరికి 1607 అయింది. అప్పట్లో ఈ బ్రిడ్జ్‌కు ‘కొత్త వంతెన’ అన్న పేరు పెట్టారు. అంతకు మునుపు కట్టిన వంతెనలన్నీ కూలిపోయాయి. ఈ బ్రిడ్జి మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఈ బ్రిడ్జ్‌ తర్వాత సీన్‌ నదిపై ఎన్నో కొత్త కొత్త వంతెనలు నిర్మించారు. అయినా.. ఈ బ్రిడ్జ్‌ పేరు మాత్రం న్యూ బ్రిడ్జ్‌గా అలాగే ఉండిపోయింది.
పిల్లల్లో ఒబేసిటీ!
ఊబకాయంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో ఇండియా రెండో స్థానంలో ఉంది. కోటి యాభై లక్షల చిన్నారులతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, కోటి నలభైనాలుగు లక్షల చిన్నారులతో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది చిన్నారులు, పెద్దలు స్థూలకాయం మూలంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెజబ్బులు, డయాబెటిస్‌, కేన్సర్‌, ఇతర ప్రమాదకరమైన జబ్బులు ఊబకాయం వల్లే వస్తున్నాయి. వీటివల్ల చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉందని పరిశోధకులు అంటున్నారు. గత ఏడాది దాదాపు 40 లక్షల మరణాలు అధిక బరువు కారణంగానే జరిగాయు. అందులో 40 శాతం మంది బాడీ మా్‌స ఇండెక్స్‌(బిఎమ్‌ఐ) ‘ఒబేసిటీ’ని సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒబేసిటీతో బాధపడుతున్న చిన్నారులు అమెరికాలో 13 శాతం ఉంటే, ఈజిప్టులో అధికంగా 35 శాతంగా ఉన్నారు. బంగ్లాదేశ్‌, వియత్నాంలో అతి తక్కువగా 1 శాతం ఉన్నారు.

పిల్లల ఇష్టాలు తెలుసుకోవడం కష్టమే
తల్లితండ్రులూ... మీ పిల్లల ఆసక్తులేమిటో ఎప్పుడైనా గమనించారా? లేదు కదూ. దీనిపై మనదేశంలో ఇటీవల జాతీయ స్థాయిలో ఒక సర్వే చేశారు. అందులో తమ పిల్లల ఆసక్తుల పట్ల తల్లితండ్రులు ఎలా స్పందిస్తున్నారు, తమ పిల్లలకు ఎలా సహకరిస్తున్నారన్న దానిపై ఒక పరిశీలన చేశారు. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో సేకరించిన డేటాలో చాలామంది తల్లితండ్రులు తమ పిల్లల ఆసక్తులను ఎలా గుర్తించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని వెల్లడైంది. అంతేకాదు పిల్లల ఇష్టాలకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలన్న విషయంలో కూడా తల్లితండ్రులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఈ సర్వేని పిన్వి (ప్లే- ఇంట్ర్‌స్ట-వైజ్‌) డేటా యాప్‌ సహాయంతో చేశారు. పిల్లల సృజనాత్మక అభివృద్ధి, పెరుగుదల, స్మార్ట్‌ పేరెంటింగ్‌లపై ఈ సర్వే నిర్వహించారు. దీంట్లో తమ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారి ఇష్టాయిష్టాలు, ఆసక్తులపై తల్లితండ్రులు దృష్టిసారిస్తున్నారని తేలింది. ఈ సర్వేలో 800 మంది అభిప్రాయాలను తీసుకున్నారు. అందులో 73 శాతం తల్లితండ్రులు తమ పిల్లల ఆసక్తులు వారి సంతోషంలో ప్రతిఫలిస్తున్నాయని అంటే, 16 శాతం మంది పేరెంట్స్‌ పిల్లల ఆసక్తులు వారి కున్న హాబీలను బట్టి ఉంటున్నాయన్నారు. పిల్లల యాటిట్యూడ్‌ను బట్టి వారి ఆసక్తులు ఉంటున్నాయని 11 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే పిల్లల ఆసక్తులను గుర్తించడం కష్టమవుతోందని కూడా 25 శాతం మంది తల్లితండ్రులు అభిప్రాయపడ్డారు. 31 శాతం మంది పేరెంట్స్‌ మారుతున్న తమ పిల్లల ఆసక్తులను ఒక దారిలో పెట్టడం కష్టంగా ఉందన్నారు. పిల్లల్లోని ఆసక్తులను వృద్ధి చేయడానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలో తెలియాలని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు.

చాక్లెట్‌తో చక్కని నిగారింపు..
వంటింట్లో వాడే పదార్థాలను ఉపయోగించి ఏం చేస్తాం? వంట చేస్తాం అంటారా! అంతేకాదు మనం వాడే తాజా పండ్లూ, కూరగాయలతో అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. అదెలాగో చూసేయండి మరి.
టొమాటో: చాలా కూరల్లో వీటిని ఉపయోగిస్తాం. ఇదే టొమాటో సహజ సన్‌స్క్రీన్‌లా ఉపయోగపడుతుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. మెరిపిస్తుంది. 1 -2 చెంచాల టొమాటో రసాన్ని మీ ముఖానికి పూతలా వేసి చేతివేళ్లతో నెమ్మదిగా మర్దనా చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చాలు. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
చాక్లెట్‌: ఇది చర్మాన్ని తేమ కోల్పోకుండా చేస్తుంది. కొత్త కణాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది. కరిగించిన చాక్లెట్‌ని ముఖానికీ, మెడకు రాసి... ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా వారానికోసారి చేయాలి.
యాపిల్‌: దీనిలో చర్మానికి మేలు చేసే ఎ, సి విటమిన్లు, రాగి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి వయసును తగ్గించే సహజ యాంటీ ఏజింగ్‌ కారకంలా పనిచేస్తాయి. ముఖంపై ముడతల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. మృతకణాలనూ నివారిస్తాయి ఆ పోషకాలు. పైగా ఇది అన్నిరకాల చర్మతత్వాలవారికీ సరిపోతుంది. చెంచా యాపిల్‌ తురుములో రెండు చెంచాల కొబ్బరినీళ్లూ, మూడు చుక్కల నిమ్మనూనె వేసుకుని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. పొడిచర్మతత్వం ఉన్నవారు నిమ్మనూనెకు బదులు నువ్వుల నూనె వాడుకోవచ్చు.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list