MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఒక్క సుగుణమున్నా చాలు!- Friendship, Neglected



ఆహారమే కాదు ఔషధం కూడా!
గుడ్‌ ఫుడ్‌
క్యారట్‌లోని బీటా కెరోటిన్‌ యాంటిఆక్సిడెంట్‌గా పని చేసి చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్‌ ‘ఎ’ లోపిస్తే కంటి సమస్యలతో పాటు చర్మం, జుత్తు, గోళ్లు పొడిబారుతాయి. చిన్న వయసులోనే ముసలితనం వస్తుంది. వీటిని క్యారట్‌ నివారిస్తుంది. ఔషధం... క్యారట్‌ యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. గాట్లు, గాయాల మీద తురిమిన క్యారట్‌ను కానీ ఉడికించి చిదిమిన క్యారట్‌ గుజ్జును కానీ పెట్టి కట్టు కడితే గాయం మానుతుంది.
క్యారట్‌లో ఉండే కెరోటినాయిడ్స్‌ గుండె సమస్యలను తగ్గిస్తాయి. రోజూ క్యారట్‌ తీసుకుంటుంటే కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గుతాయి.ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్‌ క్యాన్సర్, కోలన్‌ (పెద్దపేవు) క్యాన్సర్‌లను నివారించవచ్చు.కాలేయం నుంచి విషపూరితమైన వ్యర్థాలను క్యారట్‌ తొలగిస్తుంది. దీంతో ఫ్యాటీ లివర్‌ సమస్య రాదు. క్యారట్‌ తింటే దంతాలు, చిగుళ్లు కూడా శుభ్రమవుతాయి. దంతాల మీద నిలిచిన గార, ఆహారపదార్థాల అవశేషాలు తొలగిపోతాయి. లాలాజలం బాగా ఉత్పత్తి అవుతుంది. బ్యాక్టీరియా నివారణ అవుతుంది.



ఒక్క సుగుణమున్నా చాలు!
ఆత్మీయం
భగవంతుడు ఎంతో దూరదృష్టి కలిగినవాడు కనుకనే ప్రతివారికీ ఏదో ఒక సుగుణాన్ని ప్రసాదించి తద్వారా వారికి ఎనలేని కీర్తి కలిగేలా దీవిస్తాడు. ఉదాహరణకు రాక్షసులకు ఉన్నంత దీక్ష, పట్టుదల దేవతలలో కనిపించవు. అందుకే దేవతలు రాక్షసుల ముందు తలవంచ వలసి వచ్చేది. తామనుకున్న కార్యం సాధించే వరకూ, సకల దుఃఖాలనూ ... చివరకు ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి తపస్సు చేసి, అసాధారణ వరాలు పొందగలిగిన రాక్షసులు తమకున్న ఓర్పు, పట్టుదల అనే సుగుణాలతో దైవాన్ని కూడా వశపరచుకోగలిగారు.
మహాబలి దాతృత్వం ముందు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే వామనుడై చేయి సాచాడు. పదితలల రావణాసురుని భక్తి ముందు కైలాసనాథుడే ఆత్మలింగమై చేతికి చిక్కాడు. దుర్యో«దనుని స్నేహధర్మం ముందు అతడెంత దుర్మార్గుడైనా, శ్రీకృష్ణుడంతటి వాడిని కూడా నిర్లక్ష్యం చేసి, తన సర్వస్వాన్ని అతని పాదాక్రాంతం చేశాడు కర్ణుడు. వీరంతా ఎంతటి కర్కోటకులైనా, లోకకంటకులైనా, వారిలోని ఒక్క మంచిగుణంతో చరిత్రలో శాశ్వత కీర్తిని పొందగలిగారు.


రోజ్‌ రోజ్‌ రోజ్‌ వాటర్‌...
బ్యూటిప్స్‌
రోజ్‌వాటర్‌ను అచ్చ తెలుగులో చెప్పాలంటే గులాబీ నీరు. దీనిని ముఖానికి పట్టిస్తే చాలా మంచిది. అయితే దానికొక పద్ధతి ఉంది. అదేమిటో చూద్దాం. కాటన్‌ బాల్‌ను రోజ్‌ వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖచర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకొంటాయి. దానివల్ల ముఖ చర్మం తాజాగా ఉంటుంది. దీనికి మరికొన్ని పొడులు కలిపితే చర్మసౌందర్యం చెప్పనలవి కాదు. వాటిలో ముల్తానీ మట్టి బెస్ట్‌. ఇది అన్ని ఫేస్‌ ప్యాక్స్‌లో కంటే చాలామంచి ఫేస్‌ ప్యాక్‌. ఇది వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశిస్తుంది.
ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ చుక్కలను కలిపి ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసినట్లైతే ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.ఆరెంజ్‌ ఫేస్‌ప్యాక్‌ చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.




‘ఐస్‌క్రీమ్‌’ మేకప్‌
మేకప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ రావటం మామూలే! కానీ ఇప్పుడు ఊహలకందని ఓ విచిత్రమైన ట్రెండ్‌ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. అదే... ‘ఐస్‌క్రీమ్‌ మేకప్‌’. రంగురంగుల సౌందర్య సాధనాలను ఉపయోగించి ముఖానికి కారుతున్న ఐస్‌క్రీమ్‌ లుక్‌ తెప్పించటం ఈ మేకప్‌ ప్రత్యేకత. ముఖం మీద మేకప్‌ తోపాటు తల మీద బోర్లా పడిన ఐస్‌క్రీమ్‌ కోన్‌ లాంటి డెకరేషన్‌ కూడా ఉండటంతో టోటల్‌గా ఐస్‌క్రీమ్‌ని తలపిస్తూ ఉంటారు మోడల్స్‌! కొన్నిసార్లు మరింత రియలిస్టిక్‌గా ఉండటం కోసం మేకప్‌ పూర్తయ్యాక కొంత అసలు సిసలు ఐస్‌క్రీమ్‌ను ముఖం మీద కూడా చిలకరిస్తారట. వెర్రి వేయి విధాలంటే ఇదేనేమో!

ఒత్తిడి వదిలించే ‘ఫిడ్జెట్‌ స్పిన్నర్‌’
ఆందోళన, ఒత్తిడిలను వదిలించాలంటే సంగీతం వినాలి లేదా ప్రకృతిలో విహరించాలి. ఇవీ ఒత్తిడిని చిత్తు చేయటానికి మన అనుసరిస్తూ వస్తున్న పద్ధతులు. కానీ ఒత్తిడిని చిటికెలో తుర్రుమనిపించే ఓ సరికొత్త స్ట్రెస్‌ యాంటీడోట్‌ మార్కెట్లోకొచ్చింది. రెండు వేళ్ల మధ్య ఇమిడిపోయే ఆ బొమ్మే ‘ఫిడ్జెట్‌ స్పిన్నర్‌’. ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ అనేది వేళ్ల మధ్య ఇమిడిపోయి గుండ్రంగా తిరిగే గ్యాడ్జెట్‌. గుండ్రంగా తిరుగుతూ ఉన్న ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ను చూస్తుంటే మనసులో ఒత్తిడి మటుమాయమవతుందని. ఆహ్లాదకరమైన భావన కలుగుతోందని ప్రపంచవ్యాప్త యూజర్ల రివ్యూలు చెబుతున్నాయి. దీని గురించి యూట్యూబ్‌లో బోలోడన్ని వీడియోలు కూడా వచ్చేశాయి. కొందరు ఉత్సాహపరులు ఈ విడ్జెట్లను ఒత్తిడి, అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ ఉన్న వాళ్లకు స్వచ్ఛందంగా పంచుతున్నారు కూడా! ఇక ఈ విడ్జెట్‌ స్పిన్నర్స్‌లో రకాలు కూడా ఉన్నాయి. రకరకాల రంగులు, సైజులు, షేపుల్లో దొరికే ఈ స్పిన్నర్స్‌లో కొన్ని వెలుగులు కూడా వెదజల్లుతాయి.


శక్తినిచ్చే సపోటా
శక్తి హీనత కూడా ఒక జబ్బులాగే వేధిస్తుంది. ఏ పనిచేయాలన్నా అడుగు ముందుకు సాగదు. ఇదంతా పోషకాల లోపమే తప్ప అదేదో రుగ్మత అని కాదు. ఎప్పుడైనా నీరసంగా, బాగా నిస్సత్తువగా ఉన్నప్పుడు ఒక సపోటా పండు తినిచూడండి. కొద్ది నిమిషాల్లోనే శరీరం శక్తిని పుంజుకుంటుంది. దీంట్లో ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌, చక్కెర సమృద్ధిగా ఉండడమే అందుకు కారణం.
సపోటాలో రక్తవృద్ధి, ధాతుపుష్టిని కలిగించే అంశాలతో పాటు, మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అంతే కాదు, సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, కెరొటనాయిడ్లు, మాంసకృతులు, పిండిపదార్థాలు, పాస్పరస్‌ కూడా సమృఽధ్దిగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరస్‌ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. ఏ, సీ, విటమిన్లు కూడా పెద్ద మొత్తంలో ఉండడం వల్ల యాంటీ-ఆక్సిడెంట్లు లభిస్తాయి.
సపోటా పండ్లను తరుచూ తింటే దృష్టి లోపాలు కూడా దూరమవుతాయి. రోజూ ఒక పండు చొప్పున తింటూ ఉంటే రోగనిరోధకశక్తి పెరగడంలో పాటు ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
ఇవి మలబద్ధకం సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులోని కొన్ని రసాయనాలు పేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర వ్యాధిగ్రస్తం కాకుండా కాపాడతాయి. రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్ధులు, తరుచూ సపోటా పండ్లు తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుంచి బయటపడతారు. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.

వరుసగా ఈ గర్భస్రావాలేమిటి?
నా పెళ్లయి ఏడేళ్లవుతోంది. నా భార్య ఆరోగ్యంగానే ఉంటుంది. కాకపోతే బలహీనంగా ఉంటుంది. మూడుసార్లు గర్భస్రావం అయ్యిందే తప్ప సంతానం కలగలేదు. ఇప్పటి దాకా ఆమె శారీరక బలహీనతే ఇందుకు కారణం అనుకున్నానే తప్ప, దీని వెనుక ఏదో ఆరోగ్య సమస్య ఉందని నేననుకోలేదు. ఇప్పుడిప్పుడే అనుమానం వస్తోంది. ఇంతకీ ఈ వరుస గర్భస్రావాలకు కారణం ఏమైఉంటుంది?
- ఎల్‌. ప్రభాకరరావు, హన్మకొండ
ఎవరికైనా రెండుసార్లకు మించి గర్భస్రావం అయ్యిందీ అంటే దాన్ని ఒక ఆరోగ్య సమస్యగానే పరిగణించాల్సిందే. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఇలాంటి స్త్రీలలో 60 శాతం మంది ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వగలుగుతారు. ఆ విషయం అలా ఉంచితే, ఇలా ఎక్కువ సార్లు గర్భస్రావం కావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉంటాయి.
ఎక్కువసార్లు జరిగే గర్భస్రావాలకు సాధారణంగా, పుట్టుకతో వచ్చే క్రోమోజోముల లోపాలు కారణంగా ఉంటాయి. గర్భస్త శిశువులో అలా లోపాలున్న క్రోమోజోములు ఉన్నాయని తెలియగానే వాటిని అసాధారణమని గుర్తించి తల్లి శరీరం ఆ పిండాన్ని తృణీకరిస్తుంది. దాంతో గర్భస్రావం అవుతుంది.
గర్భస్రావం మరో రకంగా కూడా జరగవచ్చు. తలిదండ్రుల్లోని ఎవరో ఒకరిలో అసాధారణ క్రోమోజోములు ఉండవచ్చు. వీటి తాలూకు లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. అయినా అవి శిశువుకు సంక్రమించే అవకాశం ఉంది. దాదాపు 10 శాతం గర్భస్రావాలు ఈ కారణంగానే జరుగుతాయి.
గర్భాశయం, సర్విక్స్‌ లోపాలు రెండవ కారణం. గర్భాశయం నిర్మాణంలోనే ఏమైనా లోపాలున్నప్పుడు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా సర్విక్స్‌ బలహీనంగా ఉండి, గర్భాశయంలోని శిశువు బరువును ఆపలేని స్థితిలో కూడా గర్భస్రాం కావచ్చు.
అంతకు ముందే కిడ్నీ సంబంధితమైన ఏదైనా వ్యాధి ఉండి, అధిక రక్తపోటు కూడా తోడైతే, గర్భం నిలవకపోవచ్చు. కాకపోతే అధిక రక్తపోటును పూర్తిస్థాయిలో నియంత్రించడం ద్వారా ఈ గర్భస్రావాలను కొంతమేర అరికట్టే అవకాశం ఉంది.
అంతకు ముందే ఉన్న అధిక రక్తపోటు కారణంగా కిడ్నీ పాడైపోయినప్పుడు కూడా గర్భస్రావానికి దారి తీయవచ్చు. ఏమైనా ఇంకా జాప్యం చేయకుండా వెంటనే గైనకాలజిస్టును సంప్రదించండి. వ్యాఽధి నిర్దారణ పరీక్షలన్నీ చేసి వారు తగిన చికిత్సలు అందిస్తే మీ సమస్య తొలగిపోతుంది.


యోగ ప్రొటోకాల్‌
యోగ ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? ఎలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది? బోలెడు సందేహాలు కదా.. ఇటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ‘కామన్‌ యోగ ప్రొటోకాల్‌’ అనే బుక్‌లెట్‌ను విడుదలచేసింది. ఇవ్వాళ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఇందులో యోగా చరిత్రతో పాటు దానివల్ల కలిగే లాభాలు, సూచనలతో పాటు ఆసనాలను బొమ్మల ద్వారా వివరించారు. ఈ పుస్తకంలోనే యోగాలో చేయాల్సినవి, చేయకూడనివి అంటూ ఓ పది సూచనలు పేర్కొన్నారు. అవేంటంటే...
పరిసరాలను, శరీరాన్ని, మనసును శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఏమీ తినకుండా అంటే ఖాళీ కడుపున యోగ చేయాలి. లేదా మితాహారం తీసుకున్న తరువాత చేసినా పర్వాలేదు..
తేలికపాటి, సౌకర్యంగా ఉండే కాటన్‌ దుస్తులు వేసుకోవాలి.
ప్రార్థన చేశాక యోగ ప్రారంభించాలి.
హడావిడిగా కాకుండా ఆసనాలను నెమ్మదిగా వేయాలి.
శరీరం గురించి తెలుసుకోవాలి. అలాగే ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు, శ్వాస నిలపడం వంటి విషయాలను జాగ్రత్తగా గమనిస్తుండాలి.
యోగ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో తప్ప నోటి ద్వారా గాలి పీల్చకూడదు. వదలకూడదు.
యోగ పూర్తయ్యాక మెడిటేషన్‌ చేసి ఆ సెషన్‌ను ముగించాలి. ఈ సమయంలో నేల మీద సూది పడినా వినపడేంత నిశ్శబ్దం ఉండాలి.
యోగ చేసిన 20 లేదా 30 నిమిషాల తరువాతే స్నానం చేయాలి.
తినడం కూడా అంతే... యోగ పూర్తి చేసిన 20 లేదా 30 నిమిషాల తరువాతే.

శ్వాసకోసం.. ఓ పాటేస్కోండి!
ఒక్కసారి కళ్లుమూసుకోండి... మీరు శ్వాస తీసుకునే విధానాన్ని ఓసారి గమనించండి. లోతుగా వీలైనంత ఎక్కువగా తీసుకుంటున్నారా? లేకపోతే వేగంగా ఏదో హడావుడిగా అయిందనిపిస్తున్నారా? మనలో ఈ రెండోరకంవాళ్లే ఎక్కువ. ఇందువల్ల శరీరానికి అవసరమైనంత ప్రాణవాయువు అందదు. దాంతో చురుగ్గా ఉండలేరు. శ్వాస తీసుకోవడానికీ, చురుగ్గా ఉండటానికీ సంబంధం ఏంటంటారా? ఉంది..
* శ్వాస ఎంత ఎక్కువ తీసుకుంటే అంతగా మన మెదడు చురుగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ప్రాణవాయువులో ప్రధాన వాటా మెదడుదే! ప్రాణవాయువు సంపూర్ణంగా అందితేనే బుర్ర చురుగ్గా ఉంటుంది. ప్రాణాయామం వంటివి ఇందుకెంతో ఉపకరిస్తాయి. 
* మనం బెలూన్‌ వూదుతాం కదా! ఈసారి వీలైనంత ఎక్కువగా వూది ఓ పెద్ద బుడగని తయారుచేయండి. ఆ గాలిని వదిలేసి మళ్లీ వూదండి. ఇలా పదేపదే చేయండి. ఇలా చేయడం వల్ల వూపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వీలైనంత ఎక్కువ గాలిని తీసుకోవచ్చు. పిల్లలు ఆడుకునే నీటి బుడగలూ ఇందుకెంతో ఉపయోగపడతాయి. 
* చాలా పలుచగా ఉన్న చిన్న రంగు కాగితాన్ని ముక్కుపై ఉంచండి. మీరు శ్వాస వదిలినప్పుడు అది గాల్లో ఎగురుతుంది. దానిని ముక్కుపై పెట్టుకున్నప్పుడు వీలైనంత ఎక్కువగా గాలి వదిలేలా చూడండి. దీనివల్ల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. 
* పాటలు పాడేవారిలో, మురళివాయించే వారికి శ్వాస నియంత్రించడం చాలా తేలిక. అందుకే ఓ అభిరుచిగా వీటిని నేర్చుకుని చూడండి. ఆనందమే కాదు.. ఆరోగ్యమూ సొంతమవుతుంది. 
* నడకా, పరుగూ అధికంగా ఉండే కార్డియో, ఏరోబిక్‌ వ్యాయామాలు చేయడం వల్ల వూపిరితిత్తులు వాటి పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తాయి. ఈత, కొండలెక్కడం కూడా ఇదేస్థాయి ఫలితాన్నిస్తాయి. 
* శ్వాసని మామూలుగాకన్నా రెట్టింపుగా తీసుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత సేపు ఆపి ఉంచండి. ఇప్పుడు వదిలిపెట్టేయండి. ఇలా రోజూ సాధన చేయండి. దీనివల్లా వూపిరితిత్తులు 85 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి.


తల్లి కాబోతున్నారా.. తీపి తగ్గించండి!
గర్భిణిగా కోరిందల్లా తినాలంటారు. తియ్యగా, పుల్లగా ఉండే పానీయాలూ తాగాలంటారు. అలాగని శీతలపానీయాలు తాగడం మాత్రం అంత మంచిదికాదని చెబుతోంది తాజా పరిశోధన ఒకటి. ముఖ్యంగా వీటివల్ల పుట్టబోయే బిడ్డలు మామూలుకంటే రెట్టింపు బరువుతో ఉంటున్నారని చెబుతున్నారు పరిశోధకులు. కొంతమంది తల్లులు తీపి మీద ఇష్టంతో తాగితే ... మరికొంతమంది అవగాహన లేక రోజులో కనీసం ఒక్కసారైనా ఈ శీతలపానీయాలని తాగేస్తున్నారు. ఆ ప్రభావం వల్ల గర్భిణుల్లో జస్టేషినల్‌ డయాబెటిస్‌ మొదలై.. శిశువులు బరువు పెరుగుతున్నారట. అమెరికాకి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌హెల్త్‌ అండ్‌ హ్యుమన్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ వాస్తవం బయటపడింది. సాధారణంగా మధుమేహం ఉన్న తల్లుల్లో పిల్లలు అధికబరువుతో పుట్టడం అనేది సహజమే. శీతలపానీయాలు అధికంగా తాగిన తల్లుల్లో అంతకన్నా రెట్టింపు బరువుతో పుడుతున్నారట బిడ్డలు. ఈ అధ్యయనంలో మరో చేదు వాస్తవం కూడా బయటపడింది. ఈ మధ్యకాలంలో గర్భిణుల్లో ఎక్కువగా ఉమ్మనీరు తగ్గిపోవడాన్ని గుర్తించారు వైద్యులు. సాధారణంగా ఇలాంటివాళ్లని ద్రవపదార్థాలు తీసుకోమంటారు. నీళ్లు తాగమంటారు. గర్భిణులు వీటికి బదులు శీతలపానీయాలు తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారట! కానీ వీటిలోని కృత్రిమ చక్కెరలు ఆరోగ్యానికి అంత మంచి చేయవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list