MohanPublications Print Books Online store clik Here Devullu.com

సుఖం దుఃఖానికి! దుఃఖం సుఖానికి!-Sukam Dukkaniki Dukkam Sukaniki



సుఖం దుఃఖానికి! దుఃఖం సుఖానికి!

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష
సుఖదుఃఖదాః
ఆగమాపాయినః అనిత్యాః తాన్‌ తితీక్షస్వభారత

అంటున్నాడు భగవద్గీత రెండో అధ్యాయంలో 14వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ. జీవితంలో ఒడుదొడుకులు తట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒడుదొడుకులు లేని జీవితం ఉంటుందా? సుఖదుఃఖాలను ఎలా భావించాలి? ఓసారి సుఖం, మరోసారి దుఃఖం రకరకాలుగా వస్తున్నాయి. సుఖంగా ఉన్నప్పుడు దుర్వార్త వింటే ఆ సుఖం తాలూకు మజా మొత్తం పోతుంది. వెంటనే ఆ దుఃఖంలో పడిపోతాం.

అదే దుఃఖంలో ఉన్నప్పుడు ఏదైనా శుభవార్త తెలిసినా సరే దుఃఖం నుంచి పూర్తిగా బయటపడం. అంటే ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటున్నాడు మనిషి. అందుకే ‘దుఃఖాత్మకమ్‌ జగత’ అన్నారు. సహజంగా మనిషి మనసు దుఃఖాత్మకం. మరి దీన్నుంచి ఎలా బయటపడాలి? దీన్ని తట్టుకోవడమెలా? అంటే ఉపాయం భగవద్గీతలో చెబుతున్నాడు.

‘మాత్రా స్పర్శాస్తు’ అంటే ఇంద్రియాలకు కలిగే సుఖానుభవం, దుఃఖానుభవం. ఒక మంచి గులాబ్‌జామ్‌ తిన్నారు. అది తిన్నప్పుడు కలిగిన మధురానుభూతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత సేపు ఉంది? ఒకసారి ఆలోచించండి. గులాబ్‌జామ్‌ పళ్ళెంలో ఉండగా లేదు. కడుపులోకి పోయిన తరువాత లేదు. నాలుక మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ అనుభూతి ఉంది. నాలుక మీద ఎంత సేపు ఉంది. పది సెకన్లు మాత్రమే ఉంది.

ఆ పది సెకన్ల అనుభూతి కోసం పది రూపాయలు పెట్టి గులాబ్‌జామ్‌ తింటున్నాం. ‘ఘడియ భోగం, ఆరు నెలల రోగం’ అని రకరకాల సుఖాల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి జైళ్ల పాలవుతున్నారు. ఇది అవసరమా? ఒక్కసారి ఆలోచించండి.‘శీతోష్ణ సుఖదుఃఖదాః’ అంటే సుఖదుఃఖాలు గాలివాటం లాంటివి. దుఃఖం ఉన్నప్పుడే సుఖం మజా తెలుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే సాయంకాలం చల్లటి గాలి విలువ తెలుస్తుంది. సుఖం దుఃఖానికి, దుఃఖం సుఖానికి కారణమవుతున్నాయి. మన సుఖదుఃఖాలన్నీ శీతోష్ణాలలాంటివి. అలా తీసుకోగలిగితే ఉద్యోగంలో, సంసారంలో ఎంత హాయిగా ఉంటాం. శీతోష్ణాల మాదిరిగానే సుఖదుఃఖాలను భరించాలి. అంటే మంచి గ్రంథాలు చదవడం, మంచి మనుషులను కలిసి మాట్లాడటం, మంచి వ్యక్తులతో స్నేహం చేయడం చాలా ముఖ్యం. దీన్నే సతసాంగత్యం అంటారు. దాని ప్రాధాన్యాన్ని భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి ఇలా చెబుతున్నాడు...

సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు, జనులకు కలుషమడచు
కీర్తి ప్రకటించు, చిత్త విస్ఫూర్తి జేయు
సాధు సంగంబు సకలార్థ సాధనంబు
సతసాంగత్యం అనేది మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. బుద్ధికుండే జడత్వాన్ని పోగొట్టి చైతన్యవంతుల్ని చేస్తుంది. లోకంలో గౌరవాన్ని కలిగిస్తుంది. సతసాంగత్యం వల్ల లోపల ఉండే కల్మష భావాలు పోతాయి. మంచి పేరు వస్తుంది. జ్ఞానం వికసిస్తుంది. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ‘సతసాంగత్యం’ అంటే వేరే ఏదో కాదు. మంచి గ్రంథం చదవడం. భగవద్గీత చదవడం, భర్తృహరి సుభాషితాలు చదవడం కూడా సతసాంగత్యమే. ‘సాధుసంగంబు’ అంటే వట్టి సాధువులతో స్నేహం అని మాత్రమే కాదు, మంచి మనుషులతో స్నేహం చేయడం. ఇది అందరూ పాటిస్తే సుఖదుఃఖాలను సమానస్థాయిలో తీసుకోవడం సాధ్యమవుతుంది.
-డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list