MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఊసేయకండి ఆర'గింజ'oడి-Eat Nuts Dont Throw Nuts



ఊసేయకండి ఆర'గింజ'oడి

పంటి కింద గింజ పడితే అంతగా ఎందుకు గింజుకుంటారు? మింగితే కడుపులో ఏమైనా చెట్టవుతుందా? అవుతుంది... ఆరోగ్య ఫలాలిచ్చే చెట్టవుతుందండీ! ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. జ్ఞానం విత్తులాంటిదని కూడా అంటారు. ఈ కథనంతో ఆ విత్తు మీలో నాటుకుంటే ఆరోగ్యవృక్షం మీ ఒంటి నిండా విస్తరిస్తుంది. ఆరోగ్యఫలాలను మీకు అందించిన భాగ్యం మన ‘సాక్షి’ ఫ్యామిలీకి దక్కుతుంది. మీకు ఆరోగ్యాన్నందించడమే మా భాగ్యం. మీ ఆరోగ్యమే మీకూ, మాకూ మహాభాగ్యం.

కొన్ని గింజలను తినలేని, తినరానివాటిగా చూస్తుంటాం. పంటి కిందికి వచ్చిందా... గబుక్కున ఊసేస్తుంటాం. ఉదాహరణకు బొప్పాయి మధ్యన కనిపించే నల్లని గింజ ఒక్కటి పొరబాటున వచ్చినా దాన్ని ఠక్కున బయటకు తీసిపడేస్తాం. పుచ్చకాయ తినేటప్పుడు దాని గింజల్నీ అంతే. కానీ... తినరానివంటూ మనం పరిగణించే చాలా రకాల గింజలకు చాలా విలువ ఉంది. ఆరోగ్యపరంగా వాటికి ఉండే ప్రాధాన్యం తేలిగ్గా తీసిపారేయలేనిదే. వాటిలో చాలా రకాల విటమిన్లు, ప్రోటీన్లు, పీచు, ఖనిజలవణాల వంటి పోషకాలు ఉంటాయి. మనం తేలిగ్గా పరిగణించి, తుపుక్కున ఊసేసే కొన్ని గింజల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం.
కమలం గింజలు (లోటస్‌ సీడ్స్‌)
చాలామందికి లోటస్‌ గింజలు అన్న మాటే కొత్తగా అనిపిస్తుంది. కానీ తామరపూల నుంచి ఈ గింజలు లభ్యమవుతాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఈ గింజల లభ్యత ఎక్కువ. తామర పూల నుంచి వచ్చే ఆ గింజలను లోటస్‌ సీడ్స్‌ అని కొందరు, లోటస్‌ నట్స్‌ అని మరికొందరు పిలుస్తారు. వీటిని కొంతమంది కూరగా వండుకుంటారు. చాలామంది వీటిని ఎండబెట్టి ఔషధల తయారీలో ఉపయోగిస్తారు.
ముఖ్యంగా చైనీయులు ఈ గింజల నుంచి తమ సంప్రదాయ మందులను తయారు చేస్తుంటారు. తామర గింజల నుంచి ఎన్నో పోషకాలు లభ్యమవుతాయి. ఇందులో ప్రోటీన్లతో పాటు మెగ్నీషియమ్, పొటాషియమ్, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు, ఐరన్, జింక్‌ వంటి లోహధాతువులు పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజల్లో ‘ఎల్‌–ఐసోయాస్పరై్టల్‌ మిథైల్‌ట్రాన్స్‌ఫెరేజ్‌’ అనే ఎంజైమ్‌ ఉంది. ఇది మనలోని దెబ్బతిన్న కణజాలాన్ని చాలా వేగంగా రిపేర్‌ చేస్తుంది.
అందుకే వీటిని తినేవారు చాలా కాలం యౌవనంగా కనిపిస్తారు. లోటస్‌ గింజల్లోని ఈ గుణం కారణంగా చాలా కాస్మటిక్‌ కంపెనీలు తమ యాంటీ–ఏజింగ్‌ మందుల్లో వీటిని వాడుతున్నాయి. ఈ గింజల్లో అభ్యమయ్యే కింప్‌ఫెరాల్‌ అనే ఫ్లేవనాయిడ్‌ పోషకం చిగుర్లలో వచ్చే నొప్పి, వాపు, మంటను (ఇన్‌ఫ్లమేషన్‌ను) సమర్థంగా నివారించి, దంతాల ఆరోగ్యం బాగుండేలా చూస్తుంది. అందుకే దీర్ఘకాలం పాటు యౌవనం, దంతాల ఆరోగ్యం బాగుండాలంటే తామర గింజలను వాడటం మంచిది.

పుచ్చకాయ గింజలు
పుచ్చపండు తినే సమయంలో ఆ ఎర్రటి గుజ్జులో ఇమిడి ఉండే ఈ గింజల్ని వెంటనే ఊసేస్తాం. కానీ ఈ గింజల్లో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు (దాదాపు 100 గ్రాముల) ఎండబెట్టి గింజలను సేకరించి విశ్లేషిస్తే... అందులో 30.6 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుందనీ, మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్‌లో అది 61% అని తెలుస్తుంది. ఆ గింజల్లో ఉండే మరో పోషకం ఆర్గనైన్‌. ఇది రక్తపోటును నియంత్రించడమే కాదు... గుండెజబ్బులు రాకుండా నివారిస్తుంది.
ఇక పుచ్చగింజల్లో మెగ్నీషియమ్‌ 556 మిల్లీగ్రాములు ఉంటుంది. అది మన రక్తపోటును తగ్గిస్తుంది. మనం తినే పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌) సక్రమంగా జీర్ణమై, ఒంటికి పట్టేల చూస్తుంది. ఇక ఐరన్, ఫాస్ఫరస్, సోడియమ్, కాపర్, మ్యాంగనీస్, జింక్‌ వంటి అనేక ఖనిజాలు పుచ్చగింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జీవక్రియలకు అత్యంత అవసరమైన ఖనిజాలే. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే... ఒక కప్పు పుచ్చగింజలలో దాదాపు 51 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి.

ఇందులో శాచ్యురేటెడ్‌ కొవ్వులు, మోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ అన్నీ ఉంటాయి. వీటిలో ఉండే ఒమెగా–6–ఫ్యాటీ యాసిడ్స్‌ అనే మంచి కొవ్వులు రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యం పదిలంగా ఉండేలా చూస్తాయి. ఇక వీటిల్లో బి–కాంప్లెక్స్‌ పుష్కలంగా ఉంటుంది. శరీర జీవక్రియలకు అవసరమైన శక్తి వనరు బి–కాంప్లెక్స్‌. ఇందులోని నియాసిన్‌ మన నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థల ఆరోగ్యానికి, ప్రకాశవంతమైన చర్మసౌందర్యం కోసం ఉపయోగపడుతుంది. ఇక బి–కాంప్లెక్స్‌లోని ఇతర అంశాలైన ఫోలేట్, థయామిన్, రైబోఫ్లేవిన్, విటమిన్‌ బి6, ప్యాంటథోనిక్‌ యాసిడ్స్‌ సంపూర్ణారోగ్యానికి దోహదపడతాయి

గుమ్మడి గింజలు
ఈ గింజల్లో పనాగమిక్‌ ఆసిడ్‌ అనే పోషకం ఉంటుంది. దీన్నే పనాగమేట్‌ అని కూడా అంటారు. విటమిన్‌ బి–15 అని కూడా అంటారు. ఈ పనాగమేట్‌ అనే పోషకం జీవకణంలో జరిగే వాయువుల మార్పిడి (సెల్‌ రెస్పిరేషన్‌) సక్రమంగా జరిగేలా చేస్తుంది. అంతేకాదు... కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తం పీహెచ్‌ పాళ్లు సక్రమంగా ఉంచుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఇక మన శరీరం అనేక జీవక్రియలు జరిగే సమయంలో ఆ ప్రక్రియకు చెందిన వ్యర్థాలుగా ఫ్రీ రాడికల్స్‌ అనే పరమాణు పదార్థాలు వెలువడుతాయి. ఇవి క్యాన్సర్‌ను కలిగించడంతో పాటు... వయసు పెరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాయన్న విషయం తెలిసిందే. గుమ్మడి గింజల్లో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌... ఈ ఫ్రీ రాడికల్స్‌ దుష్ప్రభావాన్ని పూర్తిగా హరించి వేస్తాయి. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎంతగా తీసుకుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది.

గుమ్మడి గింజల్లో పనాగమిక్‌ ఆసిడ్‌ ఎక్కువ. ఆక్సిజన్‌ లేదా పెరాక్సైడ్స్‌ పెరగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను పనాగమిక్‌ ఆసిడ్‌ నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడటానికి దోహదం చేస్తుంది. ఇక ఒత్తిడిని నివారించడానికి గుమ్మడి గింజలు ఎంతగానో దోహదపడతాయి. ఒత్తిడి వల్ల కలిగే అలసట ఫీలింగ్‌ను గుమ్మడి గింజలు పోగొడతాయి.
గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకుంటే ఎప్పుడూ ఏదో తినాలనే కాంక్ష తగ్గుతుంది. అందుకే స్థూలకాయం పెరగకుండా చూసుకోవాలని జాగ్రత్తపడేవారు ఈ గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. ప్రోస్టేట్‌ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇవి తోడ్పడతాయి. అంతేకాదు... గుమ్మడి గింజలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్‌ ముప్పును తగ్గిస్తాయి.
బొప్పాయి గింజలు
హైబ్రీడ్‌ బొప్పాయిలో గింజలు ఉండవు. కానీ ఆరోగ్యానికి దేశవాళీ బొప్పాయి చాలా మంచిది. బొప్పాయిని కోశాక దాని లోపలి గోడలకు అంటుకుని కనిపించే గింజలను కత్తితోనో, స్పూన్‌తోనో వదిలించుకుంటాం. పొరబాటున ఒకటో అరో గింజలు పంటికిందికి పోయిన పర్లేదు. లేదా మీరు కొరికి తిన్నా ఓకే.

ఎందుకంటే... బొప్పాయి గింజల్లో ఓలిక్, పాల్మిటిక్‌ యాసిడ్స్‌ అనే ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. శక్తిమంతమైన ఆ ఫ్యాటీయాసిడ్స్‌ క్యాన్సర్‌ను దూరంగా తరిమేస్తాయి. చైనా సంప్రదాయ మందుల్లో ఈ గింజల్ని కాలేయాన్ని శుద్ధి చేసే ఔషధంగా ఉపయోగిస్తారు. మనమంటే వాటిని వాడం గానీ... హవాయీ ద్వీపాలకు చెందిన వారు బొప్పాయి గింజలను వంటకాల్లో ఉపయోగిస్తారు. మనం మన వంటకాలపై మిరియాల పౌడర్‌ చల్లుకున్నట్లుగానే వారు ఆ గింజల పౌడర్‌ను వాడతారు.

పనస గింజలు
సాధారణంగా చాలా మంది పనస తొనలు తిన్న తర్వాత ఆ గింజలను పారేస్తుంటారు. అయితే పనస గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల పనస గింజల్లో 184 క్యాలరీల శక్తి, 7 గ్రాముల ప్రోటీన్లు, 38 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1.5 గ్రాముల పీచు, కొవ్వుపదార్థాలు ఉంటాయి. వాటిలో పీచు ఎక్కువ కాబట్టి స్థూలకాయం రాకుండా నివారిస్తాయి.

జీర్ణప్రక్రియ సాఫీగా అయ్యేలా చూస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెజబ్బులను అరికడతాయి. రక్తంలో చక్కెరపాళ్లను అరికట్టే తత్వం ఉన్నందున డయాబెటిస్‌ను నివారిస్తుంది. జీర్ణాశయాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. తద్వారా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిల్లో ఉండే థయామిన్, రైబోఫ్లేవిన్‌ మంచి శక్తివనరుగా పనిచేయడంతో పాటు చర్మం, కళ్లు, కురుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ కాబట్టి అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జింక్, ఐరన్, క్యాల్షియమ్, కాపర్, పొటాషియమ్, మ్యాంగనీస్‌ వంటి ఖనిజాలు ఎక్కువ. పనస గింజల్లోని పాలీఫీనాల్స్, ఫ్లేవనాయిడ్స్‌ వంటి వృక్షరసాయనాలు క్యాన్సర్లను దూరంగా తరిమివేస్తాయి.

ద్రాక్ష గింజలు
గతంలో ద్రాక్ష తింటున్నప్పుడు పొరబాటున గింజ వచ్చిందంటే తక్షణం ఊసేసేవారు. కానీ ఇప్పుడైనా సరే... గింజలున్న ద్రాక్ష తింటున్నప్పుడు ఒకటీ అరా గింజలనూ నమలండి. ఎందుకంటే ద్రాక్షగింజల్లో ఆలిగోమెరిక్‌ ప్రోయాంథోసయనడిన్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే ద్రాక్షగింజను నమిలేశామంటే క్యాన్సర్‌ వ్యాధిని దూరంగా తరిమేశామని అర్థం.

ద్రాక్షగింజల్లోని ప్రోయాంథోసయనడిన్స్‌ మన రక్తనాళాల, వాటి చివరన ఉండే రక్తకేశనాళికల (క్యాపిల్లరీస్‌) ఆరోగ్యం బాగుండేలా చూస్తాయి. ద్రాక్షగింజలు చేసే ఈ అద్భుతాలను 2009లో ‘ద జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌’ అధికారికంగా నమోదుచేశారు. అంతేకాదు... ద్రాక్షగింజల్లో విటమిన్‌–ఇ, ఫ్లేవనాయిడ్స్, లినోలిక్‌ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్‌ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరంగా తరిమేస్తాయి.

మహిళల్లో అవి మరింత సమర్థంగా ఈ పనిచేస్తాయట. గుండెపోటును నివారించడమే కాదు... గుండెలయతప్పే టాకికార్డియా వంటి గుండెజబ్బులనూ అరికడతాయి. డోక్సోరూబిసిన్‌ వంటి కొన్ని రకాల ఔషధాలు గుండె పాలిట విషపూరితంగా పనిచేస్తాయి. వాటిని ద్రాక్షగింజలు శుభ్రం చేస్తాయి. అంతేకాదు... రక్తనాళాలు పెళుసుబారిపోయే అథెరోస్కి›్లరోసిస్‌ కండిషన్‌ను నివారిస్తాయి. దానితోపాటు డిప్రెషన్‌ను సమర్థంగా అరికడతాయి.
అవిశె గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌)
వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఒమెగా–3 ఫ్యాట్స్‌ అవిశెగింజల్లో చాలా ఎక్కువ. గుండెజబ్బుల నివారణ కోసం, అధిక రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్‌ను నివారించడానికి అవి ఎంతగానో తోడ్పడతాయి. ఆర్థరైటిస్, ఆస్తమా, ఇన్‌ఫ్లమేటరీ జబ్బులు, ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్, క్యాన్సర్లను అవిశలు చాలావరకు నిరోధిస్తాయి.
అవిశెల్లో విటమిన్‌–బి, విటమిన్‌–ఇ చాలా ఎక్కువ. దాంతో పాటు పీచుపదార్థాలు (సొల్యుబుల్‌ ఫైబర్‌) కూడా ఎక్కువ. ఒకటి లేదా రెండు టేబుల్‌ స్పూన్ల అవిశె పొడిని నీళ్లలోగానీ లేదా పాలు, పెరుగులో కలిపి తీసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది.

గుర్తుంచుకోండి... తినకూడని గింజ
ఆపిల్‌ గింజ!
పండ్ల గింజల్లో పోషకాలు ఉన్నాయి కదా అని అన్ని పండ్లగింజలూ అంతే మేలు చేయవు. ఆపిల్‌ గింజలను పొరబాటున కూడా తినవద్దు. అయితే పంటికిందకి వస్తే ఆందోళన పడకండి. కానీ వెంటనే ఊసేయండి. నిజానికి ఆపిల్‌ గింజల్లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నప్పటికీ కొరకకుండా జాగ్రత్త తీసుకోవడమే మంచిది.

ఎందుకంటే వీటిల్లో అమైగ్డాలిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచిదా చెడ్డదా అన్న అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. ఆపిల్‌ గింజలు ఎక్కువగా తింటే ఊపిరి సరిగా అందని స్థితికి వెళ్తారు. అంతేకాదు, తలనొప్పి, వికారం, వాంతులు, తల దిమ్ము, బలహీనత, గుండె స్పందనలు మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఆపిల్‌ గింజలకు దూరంగా ఉండండి.

గమనిక
పొరబాటున నమలడం సరే... ఇక్కడ పేర్కొన్న గింజల వల్ల సమకూరే ఆరోగ్య ప్రయోజనాలు పొందాలనుకునే వారు... ఆయా గింజలను ఎండబెట్టి, పౌడర్‌లా చేసుకొని, మనం మిరియాల పొడి (పెప్పర్‌) చల్లుకున్నట్లుగా నీళ్లు, పాలు లేదా పెరుగన్నంలో చిటికెడంత చల్లుకోవచ్చు. ఇక పనసగింజలను మాత్రం కూర లేదా పులుసు వండుకుంటే సరిపోతుంది.
– సుజాత స్టీఫెన్, చీఫ్‌ న్యూట్రిషనిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌ పేట, హైదరాబాద్‌


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list