MohanPublications Print Books Online store clik Here Devullu.com

సమస్యలకు విరుగుడు శాంతి మంత్రం_marrege coupil



సమస్యలకు
విరుగుడు శాంతి మంత్రం

అర్థం చేసుకునే తత్వంతోనే తప్ప బలవంతంగానో, హింసతోనో శాంతి సాధ్యంకాదు
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌
శాంతిస్వేదంలో ఎంత తడిస్తే యుద్ధ రుధిరం అంత తక్కువ చూడొచ్చు
- డాక్టర్‌ విజయలక్ష్మీ పండిట్‌
పోరు ఎన్నటికీ హితవుకాదు, శాంతి ఎప్పటికీ చేటు చేయదు
- బెన్‌ ఫ్రాంక్లిన్‌
వీరేకాదు.. దాదాపు ప్రపంచ మేధావులంతా శాంతి పాటించకుంటే జీవనమెంత దుర్భరమో చాటి చెప్పారు. అదీ శాంతి, సౌహార్దాల గొప్పతనం! 
మనమంతా కోరుకునేది ప్రశాంతమైన జీవితాన్నే. ముఖ్యంగా ఇంట్లో శాంతి చాలాచాలా అవసరం. బయట ఎంత శ్రమించినా గూటికి చేరగానే అలసటంతా హుష్‌కాకీ అయిపోతుంది. ఆందోళనలన్నీ పోగొట్టి ఆనందాలు నింపుతుంది. భూమ్యాకర్ష్షణను మించిన బలమైన అయస్కాంతశక్తి ఇంటివైపు లాగుతుంది. ఎందుకంటే అక్కడ ప్రేమానురాగాల అనంతాకర్షణ ఉంటుంది. మనకోసం ఎదురు చూస్తూ మనకి మేలు జరిగితే సంతోషించి, కలత చెందితే ఓదార్చే మనసు కాచుకుని వుంటుంది. ఆ ఇంటిమీద మనకే హక్కు. ఆ మనిషి మనకే సొంతం. ఆ ప్రేమకు నిర్వచనం లేదు. ఆ అనురాగానికి అంతం లేదు. ఇతర బాంధవ్యాలెన్ని ఉన్నా అవి తాత్కాలికం లేదా బలహీనం. చిరకాలం తోడుండేది, కలకాలం కష్టసుఖాలు పంచుకునేది మాత్రం జీవిత భాగస్వామి ఒక్కరే! అలాంటి ఆత్మబంధువుతో శాంతంగా, స్నేహంగా మెలిగితే జీవనం సుఖసంతోషాలమయం. అందుకు భిన్నంగా అసహనాలు, ఆరోపణలతో కాలం వెళ్ళబుచ్చితే కాపురం కదనభూమిని తలపిస్తుంది. సాధారణంగా ఏ ఇద్దరి ఆలోచనల్లోనూ ఐక్యత ఉండదు. భార్యాభర్తల్లోనూ బేధాభిప్రాయాలు తప్పవు. అంతమాత్రాన ఘర్షణలూ, గర్జనలూ అక్కర్లేదు. క్లిష్ట సమస్యల్ని సైతం కాస్తంత ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే శాంతంగా, సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. భార్యాభర్తల్లో ఎవరు ఓ మెట్టు దిగినా ఫర్వాలేదు. అది మరొకరి విజయమూ కాదు.. ఒకరి ఓటమి అంతకన్నా కాదు.. బంధాన్ని నిలుపుకోవాలన్న ఒకే ఒక్క ఆరాటం తప్ప! భాగస్వామిపై ఆధిక్యం ప్రదర్శించాలని ఇంటిని నరకం చేస్తే ఆ నరకజ్వాలల్లో మనమూ భస్మంకాక తప్పదనే స్పృహ ఇరువురికీ ఉండాలి.
* మనసులో ఉన్న ఇష్టాన్ని నాటకీయంగా గాక నమ్మకంగా చెప్పగలిగితే అవతలి వ్యక్తి వశమైపోతారు. 
* ప్రేమగా అక్కున చేర్చుకోవడంతో అనురాగం రెట్టింపవుతుంది. 
* కష్టనష్టాల్లో నేనున్నాననే ఆలంబన అందివ్వడం కంటే సుగుణం లేదు. 
* భాగస్వామితో కలిసి కాఫీ తాగడం, భోజనం చేయడం, సినిమాలూ షికార్లులాంటివి సాన్నిహిత్యాన్ని పెంచిపోషిస్తాయి. 
* ఏ కాస్త తీరిక దొరికినా ఆటపాటలతో సరదాగా నవ్వుకోవడం ప్రశాంతతకు బ్రహ్మాండమైన చిట్కా. 
* సంసారమన్నాక బాధ్యతలు తప్పవు. అవి భారమనుకుంటే దూరం పెరుగుతుంది. ఇద్దరూ పంచుకుని ఇష్టంగా చేస్తే బంధం బలపడుతుంది. 
* తప్పులు లేదా బలహీనతలను భూతద్దంలో చూడక క్షమిస్తే అంతా ఆనందమే.
- నాగరత్న

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list