MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీతల్పగిరిపై శ్రీహరి_Talpagiri Ranganadh Swamy Devalayam

శ్రీతల్పగిరిపై శ్రీహరి


నెల్లూరు జిల్లాలోని ఆలయాలన్నింటిలో ప్రాచీనమైనది... తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం. నెల్లూరులో పెన్నానదికి దక్షిణ ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని స్వామివారి పేరు రంగనాథస్వామి. అందువల్లే ఈ ప్రాంతానికి రంగనాయకులపేట అని పేరు.
స్థలపురాణం
మహా పుణ్యక్షేత్రాల దర్శనంలో భాగంగా ఈ ప్రాంతం మీదుగా ప్రయాణం సాగించిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. ఆ భక్తికి కరిగిపోయిన నారాయణుడు, కశ్యపుడి కోరికపైన ఇతర క్షేత్రాల్లానే ఈ ప్రాంతం కూడా భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అభయమిచ్చాడట. ఆ మాట ప్రకారమే శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథస్వామిగా ఇక్కడ వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మరో కథనం ప్రకారం... కశ్యప మహాముని నిర్వహించిన యజ్ఞం నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలలలో ఒకటి శ్రీరంగనాథస్వామి ఆలయంగా, ఇంకోటి శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంగా, మరొకటి వేదగిరి నృసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కాంద పురాణం వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది.
ఆదిశేషుడే తల్పగిరి
శ్రీరంగనాథుడు కొలువైన ఈ క్షేత్రానికి తల్పగిరి అన్న పేరు రావడం వెనకా ఓ ఆసక్తికర కథనం వినిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఓరోజు శ్రీదేవీ సమేతంగా భూలోకంలో విహరించదలచి ఆదిశేషుని పిలిచి అందుకు అనువైన ప్రాంతం చూపించమని అడిగాడట... అప్పుడు పినాకినీ నదీ తీరాన ఆదిశేషుడే స్వయంగా గిరిగా వెలసి మహావిష్ణువు పాద స్పర్శతో పులకించిపోయాడట. తల్పంగా మారి వైకుంఠంలో తనకు సేద తీరుస్తోన్న ఆదిశేషుడి పేరుతోనే భవిష్యత్తులో ఆ కొండ తల్పగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని స్వామి అనుగ్రహించాడట. అలా ఆ పర్వతం పదిహేడో శతాబ్దం నుంచి తల్పగిరిగానే వెలుగొందుతోంది. ఇది శ్రీరంగానికి ఉత్తర దిశలో ఉన్న ఆలయం కాబట్టి ఉత్తర శ్రీరంగం అనీ పేరు.
పశ్చిమదిక్కుగా విగ్రహం
తల్పగిరిలోని ఆలయ శాసనాల ప్రకారం 1178-1216 మధ్య కుళొత్తుంగ చోళుల హయాంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీరంగనాయకి అమ్మవారు, గోదాదేవి అమ్మవార్ల ఆలయాలనూ అప్పుడే నిర్మించారు. సాధారణంగా ముఖద్వారం ప్రవేశద్వారంగా ఉంటుంది. కానీ పెన్నానది దాదాపు ముఖద్వారం వరకూ రావడంతో గుడికి వెనక వూరివైపు వేరొక ముఖద్వారం ఉంటుంది. అందువల్ల ప్రధాన ద్వారం స్వామికి వెనకవైపు ఉంటుంది. ఆలయ గర్భగుడిలో పశ్చిమ దిశగా పెన్నానదికి అభిముఖంగా స్వామి శయనించి కనిపిస్తారు. 1859లో యరగుడిపాటి వెంకటాచలం పంతులు నేతృత్వంలో ఏడు అంతస్తులతో 96 అడుగుల ఎత్తయిన గాలిగోపురాన్ని పద్నాలుగు ఏళ్లపాటు శ్రమించి నిర్మించారు. గర్భాలయం ప్రాకారంపైన తీర్చిదిద్దిన దేవీదేవతల సుందర మూర్తులు చూపరులను ఆకట్టుకుంటాయి. మహ్మదీయ రాజులు దండయాత్రలో ఉదయగిరి దుర్గాన్ని వశం చేసుకున్నప్పుడు స్థానికులు స్వామివారి ఉత్సవమూర్తులను సంరక్షించుకునేందుకు వాటిని నెల్లూరు తరలించి భద్రపరిచారు. ఆ విగ్రహాలే ప్రస్తుతం ప్రధాన ఉత్సవాలలో పూజలందుకుంటున్నాయి.
ఫాల్గుణంలో బ్రహ్మోత్సవం
శ్రీరంగంలో మాదిరిగానే తల్పగిరిలోనూ మూలవిరాట్టు 12 అడుగుల ఆదిశేషునిపైన భారీ రూపంలో దర్శనమివ్వడం విశేషం. స్వామి పాదాల దగ్గర శ్రీదేవీ భూదేవినీ, నాభికమలంలో బ్రహ్మనూ దర్శించుకోవచ్చు. ఏటా 45రోజులపాటు తైల సమర్పణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఏటా దేవస్థాన ఉత్సవాలు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం కనులపండువగా జరుగుతాయి. మార్గశిర మాసంలో పగల్‌పత్తు-రాపత్తు ఉత్సవాలను 20రోజులపాటు వేడుకగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారంలో రంగనాథుని దర్శనం మోక్షప్రదమన్నది భక్తుల విశ్వాసం. ఫాల్గుణ శుద్ధ దశమి నుంచి శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవ సంబరాలు మొదలవుతాయి.
1928లో ముప్పిరాల చిన నరసింహాచారి స్వామికి తంజావూరు చిత్రకళతో నిండిన అద్దాల మందిరాన్ని నిర్మించారు. అక్కడ గజేంద్ర మోక్షం, దశావతారాలు, ఆళ్వారాచార్యుల చిత్రాలు బంగారు పూతతో కనువిందుచేస్తాయి. మందిర పైభాగంలో శ్రీమన్నారాయణుడు వటపత్రశాయిగా పవళించి ఏవైపు నుంచి చూసినా తమనే చూస్తున్న భావనను భక్తులకు కలిగిస్తాడు. శ్రీరంగనాథుడు అవతరించిన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు పెన్నానదిలో 12 ప్రముఖ నదులు సంగమించాయని పినాకినీ క్షేత్ర మహత్మ్య గ్రంథం చెబుతుంది. అందుకే ఆరోజు ఆ పుణ్య నదిలో స్నానం చేస్తే పుష్కరస్నాన ఫలం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. తల్పగిరి క్షేత్రంలో స్వామివారి పవళింపు సేవను చూసినపుడు కలిగే భావన నభూతో నభవిష్యతి.
నెల్లూరు రైల్వేస్టేషన్‌ నుంచి ఈ ఆలయాన్ని కాలి నడకనే చేరుకోవచ్చు!
- కె.శ్రీనివాసాచారి న్యూస్‌టుడే, నెల్లూరు కల్చరల్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list