MohanPublications Print Books Online store clik Here Devullu.com

పూజ వెనుక పరమార్థం!_puja_


పూజ వెనుక పరమార్థం!
భారతీయ హైందవ సంప్రదాయం, అందులోని పూజావిధానాల వెనుక మనిషి మానసిక, శారీరక ఔన్నత్యానికి దోహదపడే విశేష క్రియలున్నాయి. దీపారాధన మొదలు హారతిదాకా... గంట కొట్టడం మొదలు మంత్రపుష్పందాకా ప్రతి క్రతువులోనూ మంత్రాలకు మించిన మహిమేదో ఉందంటే, మన ధర్మానికి ఎంత పవిత్రత ఉందో అర్థమవుతుంది. ఆ ధర్మ సూక్ష్మాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా.అనంతలక్ష్మి వివరిస్తున్నారిలా...
శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం శత సంవత్సరం దీర్ఘమాయుః...
అంటూ వందేళ్లు ఐశ్వర్యంతో ఆరోగ్యంగా జీవించమని దీవిస్తుంది వేదం. నిజానికి ఇక్కడ శతం అనే పదానికి పూర్ణం అనే అర్థం వస్తుంది. అంటే నిండైన జీవితంతో పాటు నిండైన ఆరోగ్యం, నిండైన ఐశ్వర్యం కూడా ఉండాలని భావం. మన జీవన విధానం అంత బాగుండాలని
ఆశీర్వదించే ఆ మహాగ్రంథాలు ఏ మార్గంలో ప్రయాణిస్తే, ఎలాంటి క్రతువులు ఆచరిస్తే మనం నిండునూరేళ్లూ వర్థిల్లుతామన్న సంగతిని చెప్పకుండా ఉంటాయా..! ఆ దిశలో మనిషికి దిశానిర్దేశం చేయకుండా ఉంటాయా..! వెలుగునిచ్చే జ్యోతిని నిత్యం పూజించమనే ఆ జ్ఞానదీపికలు మన బతుక్కి వెలుగుబాటలు పరవకుండా ఉంటాయా..!
మనిషి జననం మొదలు నిండు నూరేళ్ల పాటూ జరగాల్సిన క్రతువులూ మరణానంతరం నిర్వహించే సంస్కారాల వరకూ అన్ని విషయాలనూ వేదాలు పూసగుచ్చినట్టు చెప్పాయి. నల్లేరుమీద నడకలా జీవితాన్ని నడుపుకోవడమే కాదు అప్పుడప్పుడూ వచ్చే పెనుతుపానులను సమర్థంగా ఎదుర్కొనేందుకూ స్థైర్యాన్ని ఇచ్చేలా, ప్రతిదశలోనూ పాటించాల్సిన పూజా విధానాల్ని పొందికగా మలిచి మనకందించాయి. పంచభూతాలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కొన్నీ, మానసిక ప్రశాంతతను ప్రసాదించేవి కొన్నీ, ఆరోగ్యాన్ని అమర్చిపెట్టేవి కొన్నీ... అన్నీ మనకోసమే, మన బాగుకోసమే. తెలిసో తెలీకో భక్తితోనో భయంతోనో మనం యాంత్రికంగా చేసే వివిధ క్రియల వెనుక పరమార్థాన్ని తెలుసుకుంటే మన పూజకూ ఓ నిండుదనం వస్తుంది.
దీపారాధన ఎందుకు చేయాలి?
మనకు ప్రత్యక్షదైవాలు ముగ్గురు. ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు, ఇంకొకరు అగ్నిదేవుడు. సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. చంద్రుడికి నూలుపోగు వేసి కృతజ్ఞత చెప్పుకుంటాం. మరి అగ్నిదేవుడూ... ఆయన్ను అర్చించేందుకే పూర్వం పెద్దలు ఇంట్లో నిత్యాగ్నిహోత్రం నిర్వహించేవారు. రోజూ అగ్ని దేవుడిని ఆవాహన చేసి నమస్కారం చేసేవారు. నిజానికి మనం భగవంతునికి ఇవ్వదలచుకున్నది ఏదైనా ఆయన్ను చేరాలంటే అగ్ని ద్వారా మాత్రమే ఇవ్వగలం. మనం అగ్నిలో ద్రవ్యాన్ని వేస్తూ ‘ఇంద్రాయ స్వాహా...’ అన్నామనుకోండి అగ్ని దాన్ని నేరుగా ఇంద్రుడికి చేరుస్తాడు. అదీ అణువంత కూడా ఆయన ఉంచుకోకుండా. ఇలా ఏ దేవుడి పేరు చెప్పి మనం ద్రవ్యాన్ని సమర్పిస్తే ఆయనకు చేరవేస్తాడు అగ్ని. అంటే భగవంతుడికీ మనకీ అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు. కానీ ఇలా నిత్యం అగ్నిహోత్రం వెలిగించడం అందరికీ, అన్నిరోజులూ సాధ్యం కాదు కనుక కనీసం దీపారాధన చేయడం ద్వారా మనం అగ్నికి నమస్కారం చేసుకుంటాం. ధూపం ఆఘ్రాపయామి అంటాం, నైవేద్యం పరికల్పయామి అంటాం కానీ దీప ఆరాధన అంటాం. అంటే నేరుగా దీపాన్నే పూజించటం. అందుకే దీపానికి కుంకుమపెట్టి, ఓ పువ్వూ, నాలుగక్షతలూ వేసి, ఇలా చెబుతాం...
సాజ్యం త్రివర్తి సంయుక్తం
వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం
త్రైలోక్యం తిమిరాపహం
ఈమూడు వత్తులతో నేను వెలిగించిన దీపం మూడు లోకాలలోని చీకట్లను పారదోలాలి అని దీనర్థం. మన ఇల్లు ఒక్కటే కాదు, మూడు లోకాలూ వెలుగులు విరజిమ్మాలన్న గొప్ప భావన ఇందులో దాగుంది. అచ్చంగా దీపానికే పూజచేసే సంప్రదాయమూ కొన్ని చోట్ల ఉంది. మనకిష్టమైన దైవాన్ని దీపపు వెలుగులో చూస్తూ పూజ చేయడం మరో పద్ధతి.
ఘంటానాదం విశేషం ఏమిటి?
మన ఇంట్లోకానీ, గుళ్లొకానీ పూజ మొదలు పెట్టే ముందు ఘంటానాదం చేస్తాం. మంత్రపరంగా అయితే
ఆగమార్థంతు దేవానాం
గమనార్థంతు రాక్షసాం
కురుఘంటారావం తత్ర
దేవతాహ్వానలాంఛనం...
అంటాం. దేవతలు వచ్చేందుకూ, రాక్షసగణాలు పారిపోయేందుకూ గుర్తుగా లాంఛనంగా మనం ఘంటానాదాన్ని చేస్తాం. అయితే ఘంటానాదానికి సంబంధించి శాస్త్రపరమైన విషయం ఒకటి ఉంది. మనం గంట రింగున మోగుతుంది అంటాం. నిజానికి గంటకు సంబంధించిన శబ్ద తరంగాలు వృత్తాకారంలో ఉంటాయి. వృత్తాకారంలో వచ్చే శబ్దం ఎప్పుడూ రింగులు రింగులు తిరుగుతూ పెద్దవృత్తాలను ఏర్పరుస్తుంది. అంటే అది ఆ ప్రాంతంలో శక్తి వలయాల్ని సృష్టిస్తుందన్నమాట! అంతేకాదు గంట శబ్దానికి కుడిఎడమ మెదళ్లను సమన్వయం చేసే శక్తి ఉందట. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం అంటూ గంటలు మోగించడం క్రైస్తవ సంప్రదాయంలోనూ చూస్తాం. ఇలాంటి ఓ ప్రత్యేక శక్తిని సృష్టిస్తుంది కనుకనే చాలా మతాలు ఘంటానాదానికి గొప్ప స్థానాన్నిచ్చాయి.
ప్రదక్షిణలోని ఆంతర్యం?
ఆలయంలోకి ప్రవేశించగానే మనం చేసేపని ప్రదక్షిణ. ప్రదక్షిణలోనూ రెండు రకాలు. ఒకటి ఆత్మప్రదక్షిణ, రెండోది దైవ ప్రదక్షిణ. దేనికదే ఓ ప్రత్యేకత కలిగింది. నిజానికి మనం ఆలయంలోకి ప్రవేశించగానే దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. మంత్రపరంగానైతే ప్రదక్షిణల్లో మనం సత్వ, రజో, తమో గుణాల్ని విడనాడి త్రిగుణాతీతంగా అవుతామనీ, అలాంటి స్థితిలో దైవ ప్రార్థన చేయాలనీ చెబుతాం. ప్రదక్షిణ వల్ల శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఏ రకంగా అంటే... ముందుగా మనం ఆత్మ ప్రదక్షిణను తీసుకుందాం. బొంగరం సాధారణంగా పడిపోయి ఉంటుంది. అది ఎప్పుడైతే తనచుట్టూ తాను తిరగడం మొదలు పెడుతుందో అప్పుడు నిటారుగా నిలబడగలుగుతుంది. ఇక్కడ ప్రదక్షిణ బొంగరానికి నిలబడే శక్తిని ఇస్తుందన్నమాట. అలాగే భూమిని చూద్దాం... అది నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. విశ్వంలో వేలాడుతున్నట్టు కనిపించినా దానంతట అది నిలబడేందుకు కావలసిన శక్తిని భ్రమణం ఇస్తుంది. అలాగే, భూమి నిరంతరం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి నుంచి శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. ఇదేవిధంగా మనం శక్తికేంద్రకమైన దైవం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆయన్నుంచి శక్తిని పొందుతాం. ఇందులోనూ మరో విషయం ఉంది, ప్రదక్షిణ అంటే కుడిదిశలో తిరగడం అని అర్థం. అంటే మనం సవ్యదిశలో తిరుగుతామన్నమాట. విశ్వంలో ఏ పదార్థమైనా సవ్య దిశలో తిరిగినప్పుడు దాన్నుంచి పాజిటివ్‌ ఎనర్జీ ఉద్భవిస్తుంది.

ధూపం ఎందుకంత ప్రత్యేకం?
నిప్పుల్లో సాంబ్రాణి, గుగ్గిలం, అగరులాంటివి వేస్తారు. ఇవన్నీ చెట్ల నుంచి వచ్చేవే. వాసన మనిషిని ఉత్తేజపరుస్తుంది. అరోమాథెరపీ అనే పదం వినే ఉంటాం. మిడతలా ఎగిరే మనసును కట్టడి చేయాలంటే మంచి పరిమళంతోనే సాధ్యం మరి! అంతేకాదు, మన దగ్గర కొంచెమే ఉంది. దాన్ని పదిమందికీ పంచాలి అనే భావనను కూడా ఈ ధూపం చక్కగా ప్రతిబింబిస్తుంది.
హారతి ఎందుకు ఇస్తాం?
కర్పూరానికి అలసటను దూరం చేసే శక్తి ఉంటుంది. సాధారణంగా భగవంతునికి ఇచ్చే హారతికైనా, పూజ తర్వాత మనకిచ్చే మంగళహారతికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అంతేకాదు వృత్తాకారంలో దైవం చుట్టూ హారతిని తిప్పడం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి నాలుగు దిశలకూ ప్రయాణిస్తుంది. మనం హారతిని కళ్లకు అద్దుకోవడంవల్ల ఆ తరంగాలు మన అరచేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. హారతి సమయంలో చేసే ఘంటానాదం సాంత్వననిచ్చే తరంగాల సృష్టికి సహకరిస్తుంది.
తీర్థంలో ఏముంది?
మామూలుగా తులసికి ఓ ప్రత్యేకత ఉంది. కొడిగడుతున్న శక్తులకు పునరుజ్జీవాన్ని తెచ్చే లక్షణం దీనికుంది. చనిపోతున్న వాళ్ల నోట్లో తులసి తీర్థం వేయడం వెనుక ఉన్న మర్మం కూడా ఇదే. తులసి తీర్థాన్ని కూడా ఉద్ధరిణి సాయంతో సవ్యదిశలో తిప్పుతూ ఉండటాన్ని గమనిస్తాం. ఇక్కడా వర్తులాకార తరంగాల శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే పచ్చకర్పూరం, యాలకులకు మనసుకు ఉత్తేజం కలిగించే గుణం ఉంటుంది. పచ్చకర్పూరానికి దేన్నైనా పాడవకుండా ఉంచే లక్షణం ఉంటుంది. నిజానికి అదో ప్రిజర్వేటివ్‌. తిరుపతి లడ్డూలో పచ్చకర్పూరం వేయడం వెనుకా కారణం ఇదే. ఇక, ఇందులో భగవంతుడి అనుగ్రహమూ దాగుంది. భగవంతుని పేరు చెబుతూ అరచేతిని పదార్థాలవైపు చూపుతున్నప్పుడు మన అరచేతుల నుంచి బంగారు రంగు కిరణాలు వెలువడతాయన్నది ప్రాణిక్‌హీలింగ్‌లో చెబుతారు. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ఏ పదార్థానికైనా అంత రుచి రావడం వెనకున్న రహస్యం ఇది.
శఠగోపం ఆకారం ఎందుకలా?
శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకం. ఈ మధ్య పిరమిడ్‌ ధ్యానం, పిరమిడ్‌ థెరపీ గురించి వింటూనే ఉన్నాం. మన చుట్టూ ఉండే వివిధ రకాల శక్తులను ఒకచోటికి తెచ్చి, మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగానూ స్వస్థపరచేలా ఈ ఆకారాలు సాయపడతాయన్నది ఇందులోని విషయం. గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్‌ తరహా) నిర్మాణాలూ పిరమిడ్‌ తరహాలోనే పనిచేస్తాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటాన్ని మనం గమనించొచ్చు. అందువల్ల శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది. ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది. అదే జ్ఞానులూ, యోగులకు దాదాపు జానెడు ఎత్తులో ఉంటుంది. అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. శఠగోపాన్ని ఆరు అంగుళాలూ, ఎనిమిది అంగుళాలూ లెక్కన ఎత్తుగా చేయడం వెనక సహస్రార చక్ర స్థితి ముడిపడి ఉంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు.
మంత్రపుష్పం పరమార్థం ఏమిటి?
పూజలో పూలు వాడతాం. మరి మంత్రపుష్పం ప్రత్యేకత ఏమిటీ అంటే - భగవంతుడికి మనం చేయగలిగిన ఉపచారాలన్నీ చేశాక, పెట్టగలిగిన పదార్థాలన్నీ పెట్టాక... మనల్ని మనం ఆ దేవదేవుడికి సమర్పించుకోవడమే మంత్రపుష్పంలోని పరమార్థం.
నీలతోయత మధ్యస్థా విద్యుల్లేఖేవభాస్వరా
నీవారశూక వత్తన్వీ పీతాభాస్వత్యణూపమా
తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః...
అని చెబుతుంది నారాయణ సూక్తం. అంటే కిందివైపు ముడుచుకుని ఉన్న కమలంలా నాభికి పైనా, గొంతుకు కిందా 12 అంగుళాల పరిమాణంలో ఉన్న భాగం (హృదయం), మనం తిన్న అన్నాన్ని శరీరభాగాలన్నింటికీ సమానంగా పంచుతుందట. దానిపై భాగంలో విచ్చుకున్నట్టు ఉండే సూక్ష్మపద్మంలాంటి చోట నివ్వరిధాన్యపు ముల్లంత (వడ్లగింజ కొస) పరిమాణంలో పసుపురంగు కాంతితో మనలోని పరమాత్మ ఉంటాడంటూ సవివరంగా మన జ్యోతి స్థానాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని మంత్రపుష్పంతో జతచేసి చదువుతాం. అంటే నాలోని ప్రాణం నీవు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను స్వామీ... అని చెప్పుకోవడం మంత్రపుష్పంలోని పరమార్థం.
సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?
మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే... ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం. భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.
వేల సంవత్సరాల నాడు రుషులూ, మునులూ తాము తపించి, ఆచరించి, అనుభవంలోకి తెచ్చుకున్న ఎన్నో విషయాలనూ, విశేషాలనూ భగవంతుడికి దగ్గరగా బతికేందుకంటూ ఇలా పూజా రూపంలో పొందుపరిచి మనకందించారు. ఇందులో ఏది ఎందుకు చేయాలీ, అన్న ఆలోచన ఎలా ఉన్నా... మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు వెళ్లే స్వచ్ఛతను అందిస్తాయివి. అంతేకాదు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్నీ, మనసును అదుపులో ఉంచుకునే చాకచక్యాన్నీ, మనల్ని మనం గమనించుకుంటూ బతికే నైపుణ్యాన్నీ దోసిటపట్టే పట్టునిస్తాయి. అలాంటి స్థిరమైన మనసుతో, మనమీద మనకు అదుపుతో, ప్రశాంతంగా జీవిస్తే... ‘శతమానం భవతి’ అనే వేదవాక్కు ఫలించదంటారా!
దేవాలయానికే ఎందుకంటే...
ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు ‘గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?’ అనే సందేహం సహజం. దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది. నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక, మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్లొ నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్లతరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం గొప్పవిషయంగా చెబుతారు.
షోడశోపచారాల అర్థమిదీ..!
పూజ చేయడం అంటే భగవంతుడిని మన ఇంటికి ఆహ్వానించి సేవించడం. అంటే మనకు దేవుడు ఒక ప్రత్యేకమైన అతిథి అన్నమాట. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి సత్కారాలు చేస్తామో అదే విధంగా దేవుణ్ణీ సేవించడమే పూజావిధానం. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞొపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం - ఈ పదహారూ షోడశోపచారాలు. ఇంట్లోకి అతిథి వస్తున్నప్పుడు ఎదురెళ్లి లోపలికి తీసుకువస్తాం, అది ఆవాహనం. వచ్చాక కుర్చీ వేస్తాం, అది ఆసనం. కాళ్లు కడుక్కునే నీళ్లు ఇవ్వడాన్ని పాద్యం అంటారు. చేతులుకడుక్కునే నీళ్లు అర్ఘ్యం, ఇక దాహానికి ఇచ్చే నీరు ఆచమనీయం. తర్వాత స్నానానికి నీళ్లు పోసి, కట్టుకునేందుకు వస్త్రం ఇస్తాం. ఆ తర్వాత యజ్ఞొపవీతం సమర్పిస్తాం. తర్వాత భగవంతుడికి బొట్టు పెట్టి, చల్లటి గంధాన్ని రాస్తాం. పూలతో అలంకారం చేస్తాం. ఆ తర్వాత వాతావరణాన్ని హాయిగా చేసేలా ధూపం రూపంలో కాస్త పరిమళం వేస్తాం. ఆ చోటంతా కాంతిమంతంగా అనిపించేందుకు దీపాన్ని చూపిస్తాం. తర్వాత పూజను బట్టి, ముందుగా అవసరార్థ నివేదనమని ఏ బెల్లపు ముక్కో, అరటి పండో పెట్టేస్తాం. లేదంటే, మహానైవేద్యం సమర్పిస్తాం. తర్వాత చక్కగా సుగంధ ద్రవ్యాలతో నిండిన తాంబూలాన్ని అందిస్తాం. చివరిగా హారతిచ్చి, మనల్ని మనమే ఆయనకు అర్పించుకునే క్రతువుగా మంత్రపుష్పాన్ని సమర్పించి పూజను ముగిస్తాం. మనింటికి వచ్చిన మహా అతిథిని మనకున్నంతలో గౌరవంగా చూసుకోవడమే ఈ షోడశోపచారాల పరమార్థం.      - లక్ష్మీహరిత ఇంద్రగంటి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list