MohanPublications Print Books Online store clik Here Devullu.com

మంగళగిరి_Mangalagiri

ముగ్గురయ్యల కొండ... మంగళగిరి


భక్తుల కోరిన కోర్కెలు తీర్చేందుకు కొండపైన కొలువయ్యాడు పానకాల స్వామి. ఆ దిగువనే నిలిచాడు శ్రీలక్ష్మీనృసింహస్వామి. నమ్మినవారిని గండాల నుంచి గట్టెక్కించేందుకు కొండ శిఖరాన వెలిశాడు గండాలయస్వామి. ఇలా ముగ్గురు నరసింహస్వాములు ఒకేచోట ఉన్న ఆ దివ్య క్షేత్రమే మంగళగిరి.
మంగళగిరి ప్రసిద్ధ వైష్ణవాలయం. దీన్నే మంగళాచలం, మంగళశైలం, మంగళాద్రి, ధర్మాద్రి, ముక్త్యాద్రి అనికూడా పిలుస్తారు. సర్వ శుభాలూ చేకూర్చే ఐశ్వర్య ప్రదాయిని లక్ష్మీదేవి అధిష్ఠించి ఉన్న క్షేత్రమిది.
స్థల పురాణం...
పూర్వం నమూచి అనే రాక్షసుడు మనుషులూ, ఆయుధాల వల్ల మరణం లేకుండా బ్రహ్మదేవుడి వరం పొందుతాడు. ఆ గర్వంతో ముల్లోకాలలోని సకల పాలకులనూ హింసిస్తుంటాడు. దేవతలూ, మునులూ శ్రీమహావిష్ణువుని శరణు వేడతారు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని సముద్రపు నురుగులో ముంచి నమూచిపై ప్రయోగిస్తాడు. అతడు పారిపోయి తోతాద్రిగా పిలిచే మంగళాద్రి క్షేత్రంలోని చీకటి గుహలో దాక్కుంటాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంలో ప్రవేశించి నమూచిని సంహరిస్తాడు. ఉగ్రరూపంలో ఉన్న శ్రీవారిని శాంతింపజేయటానికి శ్రీమహాలక్ష్మి ఇక్కడి కొండపై తపస్సు చేసింది. మంగళాద్రి క్షేత్రంపై నమూచి దాగిన గుహ ఇప్పటికీ ఉంది. ఈ కొండపై శ్రీమహావిష్ణువు-సుదర్శనమూర్తిగా, శ్రీమహాలక్ష్మి-రాజ్యలక్ష్మి స్వరూపంలో స్వయంభువుగా వెలసి దర్శనమిస్తున్నారు.
క¹ృతయుగం నుంచీ ఉన్న ఈక్షేత్రంలో కొలువై ఉన్న పానకాల శ్రీలక్ష్మీనృసింహస్వామిని యుగయుగాల దేవుడిగా కొలుస్తారు. ఈ స్వామికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవునెయ్యి, ద్వాపరయుగంలో ఆవుపాలను నైవేద్యంగా సమర్పించేవారట. కలియుగంలో భక్తులు పటిక బెల్లం పానకం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కొండపైన శ్రీవారి కోసం పానకం తయారుచేస్తారు. నిత్యం పానకం పొంగి పొరలుతున్నా శ్రీవారి సమక్షంలోనూ, భక్తులు నడయాడే ప్రాంతంలోనూ ఈగలు అనేవే కనిపించకపోవడం ఇక్కడి ప్రత్యేకత.
కొలువైన శ్రీలక్ష్మీనృసింహస్వామి
దిగువ సన్నిధిలో ఎడమతొడపై అమ్మవారు కూర్చున్న లక్ష్మీనృసింహస్వామి దర్శనమిస్తాడు. భీముడితో గండకశిలని తెప్పించి విగ్రహంగా మలచి ధర్మరాజు ప్రతిష్ఠించాడని చెబుతారు. పక్కనే రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు స్వామిని దర్శించుకున్న సందర్భంగా గర్భాలయానికి ముందు మండపాన్ని నిర్మించారు. దీంట్లోనే శ్రీవారి నిత్య కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయానికి తూర్పున పదకొండు అంతస్తుల గాలి గోపురం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా గుర్తింపు పొందింది.
దీపమే గండాలయస్వామి...
మంగళగిరి క్షేత్రంలో పడుకుని ఉన్న ఏనుగు ఆకారంలో కొండ ఉంది. ఏనుగుపై అంబారీ అమర్చినట్టుగా చిన్నగుడి శిఖర భాగాన కనిపిస్తుంది. ఇదే గండాలయస్వామి ఆలయం. ఇది సుమారు 850 అడుగుల ఎత్తైన కొండ శిఖర భాగాన ఉంది. ఇక్కడ దేవుడికి రూపం ఉండదు. చిన్న గుహలా కనిపించే గుడిలో ఒక ఇనుప పాత్ర ఉంటుంది. దాంట్లో ఆవునెయ్యి లేదా నువ్వులనూనె పోసి దీపం వెలిగిస్తారు. ఈ దీపాన్నే గండాలయస్వామిగా ఆరాధిస్తారు. ఆపదలూ, గండాల్లో ఉన్నవారు తమను గట్టెక్కించమని ఇక్కడ మొక్కుతారు. భక్తుల మొర ఆలకించి ఎంతటి గండంలో ఉన్నప్పటికీ ఇట్టే గట్టెక్కించి ఈ స్వామి ఆదుకుంటాడని నమ్ముతారు. ఆ విశ్వాసంతోనే భక్తులు సాయంత్రం సమయంలో ఎత్తైన కొండ ఎక్కి దీపం వెలిగిస్తారు. ఈ దీప మహత్యం గురించి ఎంతచెప్పినా తక్కువే. రాత్రంతా ఎంత తీవ్రంగా గాలి వీచినా దీపం వెలుగుతూ వూళ్లొని వాళ్లందరికీ కనిపిస్తూనే ఉంటుంది. పూర్వం కొండరాళ్లూ, చెట్లమార్గంలో అతి కష్టంపై శిఖర భాగానికి చేరుకుని భక్తులు గండదీపం వెలిగించేవారు. ఇప్పుడు మెట్లదారి ఏర్పాటుచేశారు. శ్రీరామానుజాచార్యులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం విశేషం.
దిగువ సన్నిధి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో, కొండపైకి వెళ్లే మెట్లదారి పక్కన చరిత్ర తెలిపే శిలా శాసనాలు దర్శనమిస్తాయి. ప్రధాన వీధిలో శాసన స్తంభం ఉంది. దీనిపైన శ్రీఆంజనేయస్వామి కొలువై ఉంటాడు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మంగళగిరికి నాలుగు దిక్కులా కొలువై పూజలందుకుంటున్నాడు. ఏటా ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.పన్నెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో రథోత్సవం ఎంతో ప్రత్యేకమైంది.
కొండపైకి చేరుకోవాలంటే...
పదిహేడేళ్ల కిందటివరకూ కొండపైన ఉండే పానకాలస్వామిని భక్తులు 450 మెట్లు ఎక్కి దర్శించుకునేవారు. 2004 కృష్ణా పుష్కరాల సందర్భంగా కొండపైకి ఘాట్‌ రోడ్డుని నిర్మించారు. మంగళగిరి విజయవాడ రైల్వే జంక్షన్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ, గుంటూరుల నుంచి ప్రతి ఐదు నిమిషాలకూ బస్సు సౌకర్యం ఉంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చేవారు నేరుగా మంగళగిరి రైల్వేస్టేషన్‌కు వెళ్లవచ్చు. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఆలయం ఉంది. బస్సులూ, సొంత వాహనాల్లో వెళ్లేవారు నేరుగా ఆలయం దగ్గరకు చేరుకోవచ్చు. దేశంలోని ఏ నృసింహ క్షేత్రంలోనైనా ఒక్క నరసింహస్వామే దర్శనమిస్తాడు. కానీ లక్ష్మీనృసింహస్వామీ, పానకాల నరసింహస్వామీ, గండాలయ నరసింహస్వామిలను ఒకేచోట కళ్లారా చూసుకుని తరించాలంటే మంగళగిరిని దర్శించాల్సిందే.
- ఎస్‌.కృష్ణప్రసాద్‌, న్యూస్‌టుడే, మంగళగిరి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list