MohanPublications Print Books Online store clik Here Devullu.com

అన్నపూర్ణా స్తోత్రం_AnnaPurnaStotram-MohanPublications


అన్నపూర్ణా స్తోత్రం -
అన్నదాన మహిమ - 
భోజన విధానం

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౧ ||
నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౨ ||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౩ ||
కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౪ ||
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౫ ||
ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౬ ||
ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౭ ||
దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౮ ||
చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౯ ||
క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||
అన్నిదానములను నన్నదానమే గొప్ప
కన్నతల్లికంటే ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.
అన్నానికున్న ప్రాధాన్యతని వేదాలు కూడా వక్కాణించాయి. అన్న సూక్తాన్ని పఠించడం కూడా అన్నం మీద మన భక్తి భావాన్ని నిలుపుకోవడమే. అందుకే ఆర్యులు `అన్నం పరబ్రహ్మ స్వరూపం' అన్నారు. అన్నమే జీవిని బతికిస్తుంది. అన్నమే పోషిస్తుంది. అన్నమే ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంటుంది. అన్నమే మనుగడకి ఆలంబనగా ఉంటుంది. అలాగని మితిమీరి భుజిస్తే ప్రాణం తీస్తుంది. అన్నం తిననిరోజు నీరసించి, ఆత్మ అసంతృప్తికి లోనవుతుంది. చంపినా, పోషించినా సర్వులకూ అన్నమే ప్రదానం. `సహనా వవతు+సహనౌ భునక్తు+సహ వీర్యం కరవావహైః+ తేజస్వినామదీతమస్తు మా విద్విషావహైః ఓం శాంతిః శాంతిః శాంతిః' ఇదే అన్న సూక్తం.
సకలజీవరాసులకూ అన్న ప్రదాత ఆ సూర్యభగవానుడు. గ్రహాధిపతి అయిన సూర్యుని కరుణ వలన బుతువులు సక్రమంగా ఉండి, వర్షాలు పడి పంటలు పండి అందరూ సుఖజీవనం సాగిస్తున్నారంటే అందుకు కర్త ఆ ప్రత్యక్షనారాయణుడు సూర్యుడే. సూర్యరస్మి లేనిదే ఏ మొక్కా మొలకెత్తదు. అలాగే వరి ధాన్యాలు కూడా అంకురించవు. ప్రత్యక్షంగా సూర్యుని ప్రభావంతో మనకి జీవనాధారం అయిన అన్నాన్ని భక్తి శ్రద్ధలతో భుజిస్తేనే ఆయురారోగ్యాలు కలుగుతాయి.
ఇప్పుడు మనం చేస్తున్నదేమిటీ..? తిన్నంత తిని, మిగిలింది పెంటకుప్పలపాలు చేస్తున్నాం. అసలు అన్ని దానాల్లోకీ అన్నదానం గొప్పదని పెద్దల వాక్కు. అది కూడా ఈరోజుల్లో మనం చేయలేకపోతున్నాం. పూర్వం అన్ని లోగిళ్ళలోను నిత్యం ఇంటిల్లిపాదికీ వండే టప్పుడు ఒక గుపెడు బియ్యం ఎక్కువ పొయ్యిమనేవారు. ఎందుకంటే, అతిధి, అభ్యాగతుల కోసం, అన్నార్తులెవరైనా వస్తే పెట్టాలనే ఉద్దేశ్యంతోను అలా చేసేవారు. మనకి అన్నదానాలు చేసే గొప్ప మనసూ లేదు, అన్నాన్ని బ్రహ్మ స్వరూపంగా భావించే గుణమూ లేదు. అందుకే ఒకనాటి కాలంలో లేని అనేక రుగ్మతలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అన్నం తినకుండా ఇతర పదార్థాలతో కడుపు నింపుకున్నా జవసత్వాలు క్రమేపీ క్షీణించడం మనలోనే చూస్తూవుంటాం. అలాగే అన్నం ముట్టని వారికి మనస్సు కూడా స్వాధీనం తప్పి విపరీత ఆలోచనలతో ఎప్పుడు అస్తిమితంగా ఉంటారు. అన్నం తినడం అనేది కూడా ఒక యోగమే. ఎంతో డబ్బువ్యామోహంతో అనేక రకాల పనులుచేసి అక్రమంగా కోట్లు కూడబెట్టినవాడికి అన్నం తినే యోగం లేకుండా అజీర్తివ్యాధో, అంతకన్నా భయంకరమైన దీర్ఘవ్యాధో పట్టుకుని జీవితాంతం అవస్తపడుతూంటాడు.
చక్కెర వ్యాధిగ్రస్తులకి వైద్యులు కూడా అన్నం మాని రొట్టెలు తినమంటారు. ఇది ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి!. ఇటువంటివి కర్మానుగుణంగా సంక్రమిస్తాయి. అందుకే మనకి అన్నీ బాగున్నప్పుడే, అతిధి, అభ్యాగతుల్ని, బంధువర్గాన్నీ, అన్నార్తుల్ని, గృహస్తుని, పెద్దవారిని, గురువుల్ని, భాగవతోత్తముల్ని, పండితుల్ని ఆదరిస్తూ వారికి తృప్తిగా అన్నం వడ్డించి భోజన సదుపాయం చేస్తూవుంటే, పెట్టింది ఎక్కడికీ పోదు. రెండింతలై తిరిగి వస్తుంది. అలా పెట్టిన వారికి అన్న యోగ్యం కలుగుతుంది. అందుకే 'పెట్టినమ్మకి పెట్టినంత' అనే సామెత పుట్టుకొచ్చింది. నలుగురికి పంచింది నాలుగింతలవుతుందన్నది కూడా దీనికి పర్యాయమే.
భోజన విధానం
అన్నాన్ని భుజించేటప్పుడు కూడా పద్దతి పాటించాలి. శుభ్రంగా అలికిన నేల మీద కంచంలోగానీ, అంతకన్నా శ్రేష్టమైన అరటి ఆకులో గానీ అన్నం, శాకాలు వడ్డించుకుని పీటలు వేసుకుని ఇంటిల్లిపాదీ కింద కూర్చుని భుజించడం చాలా ఉత్తమం. అందువల్ల వండిన పదార్ధాలు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అయ్యాయేమో అనే శంక లేకుండా ఉన్నదానినే అందరూ సర్దుకునే అలవాటు అవుతుంది. భుజించే ముందు అందరూ అన్నానికి నమస్కరిస్తూ దానిని మనకి ప్రసాదించిన దేవుని దివ్యప్రసాదంగా భావించి, కళ్ళ కద్దుకుని తినడం ప్రారంభించాలి. సోఫాల్లోను, కుర్చీలోను కూర్చుని భుజించడం నిషిద్ధం.వీలైతే అన్న సూక్తం పటించడం మరీ మంచిది. అన్నం భుజించేటప్పుడు మనం అన్నం మీదే దృష్టి నిలిపి తింటే అది వంటపడుతుంది.
అన్నానికి ఉన్న మరో శక్తి ఏమిటంటే, అన్నం తినే సమయంలో మన భావాలు ఏవి ఉంటాయో, శారీరకంగా అందుకు తగిన ఫలితాలే తిన్న అన్నం వలన కలుగుతాయి. అందుకే టీవీలు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, చాడీలు మాట్లాడుకుంటూ తింటే నెగెటివ్ ఆలోచనలు వృద్ధిచెందుతాయి. అలాకాకుండా భగద్భక్తితో, మనసులోకి ఎటువంటి ఆలోచనల్నీ రానీయకుండా, పద్దతిని పాటిస్తూ భుజిస్తే పాజిటివ్ ఆలోచనలు వృద్ధిచెందుతాయి. మనసు ప్రశాంతంగా ఉండి చేసే అన్ని పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఎవరైనా భోజనం చేసి వెళ్ళమని ఒకటికి రెండు సార్లు అడిగితే తిరస్కరించకూడదు. వండి వడ్డించిన వారిని లోపాలు ఎంచకూడదు. మనకు దంత సిరి ఉంటే వండిన పదార్ధాలు రుచికరంగానే ఉంటాయి. అది లేకపోతే ఆరోజుకి కనీసం అన్నం తినే ప్రాప్తం కలిగిందని సంతోషించాలి తప్ప అదిబాగాలేరు, ఇదిబాగాలేదు అంటూ తినేటప్పుడు విమర్శించకూడదు.
ఇంట్లో పెద్దవారు, పిల్లలు ఉంటే, ముందుగా వారికి భోజనం పెట్టాలి. అందువల్ల ఆకలితో వేచివున్న వారి ఆత్మ శాంతిస్తుంది. అందుకే చాలామంది ఇప్పటికీ కడుపునిండా భోజనంచేసి, 'హమ్మయ్య! ఆత్మారాముడు శాంతించాడు' అంటూవుంటారు. భర్త భుజించిన తరువాతే, భార్య భుజించడం ఉత్తమ సంప్రదాయం. అది వీలుపడనివారు ఇద్దరూ కలిసి భుజించడం మధ్యమం. ముందు ఇల్లాలు తినడం అథమం.
ఇలా చిన్న చిన్న విషయాలు పాటిస్తుంటే మనకి, ఇంటిల్లిపాదికీ ఆయురా రోగ్యాలకి ఎటువంటిలోటూవుండదు. అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్ధాలని వృధాచేయకుండా, సద్వినియోగం చేస్తూవుంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది. అలక్ష్యం చేస్తే భుక్తికోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది. కనుక అన్నాన్ని గౌరవిద్దాం..నలుగురిని ఆదరిద్దాం...తృప్తిగా జీవిద్దాం..

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list