GRANTHANIDHI blog Posts updates, Followకై Facebook MOHAN PUBLICATIONS Page LIKE చెయ్యగలరు

క్యాన్సర్‌_Cancer Cure Tips

ఇవి తింటే క్యాన్సర్‌ దూరం..!

ఈ సహస్రాబ్దిలో మనిషిని అత్యధికంగా భయపెడుతోన్న వ్యాధి ఏదైనా ఉందీ అంటే అది నూటికి నూరు శాతం క్యాన్సరే. ఏటా దాదాపు 1.41 కోట్ల మంది దాని బారినపడుతున్నారు. 82 లక్షల మంది మరణిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ మీద పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ జీవనశైలితోపాటు ఆహారమూ ఈ వ్యాధికి ప్రధాన కారణమనీ; మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా క్యాన్సర్‌ను చాలావరకూ నిరోధించగలమనీ తేల్చి చెబుతున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి...

అవకాడో..!


రోగనిరోధకశక్తి తగ్గిపోవడం... హానికర ఫ్రీ రాడికల్స్‌ విడుదల కావడం... ఇవే క్యాన్సర్‌ కంతుల పెరుగుదలకు ప్రధాన కారణాలు. అయితే ఆహారపదార్థాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలతో నిరంతరం పోరాడుతూ వాటి పెరుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో మొదటగా చెప్పుకోదగ్గది అవకాడో. ఇందులో అధికంగా ఉండే గ్లూటాథియోన్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంటు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడం ద్వారా అన్ని రకాల క్యాన్సర్లనూ నిరోధిస్తుంది. అందుకే ఈ గ్లూటాథియోన్‌ను ‘మాస్టర్‌ యాంటీ ఆక్సిడెంట్‌’గానూ పిలుస్తారు.

ఎండల్లో... టొమాటో..!


టొమాటోల్లోని లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడం ద్వారా క్యాన్సర్లను నివారిస్తుంది. వేసవిలో వచ్చే టొమాటోల్లో ఈ లైకోపీన్‌ శాతం మరీ ఎక్కువ. ఈ లైకోపీన్‌ నోటి క్యాన్సర్‌ కణాలను అద్భుతంగా నాశనం చేస్తుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు నిరూపించారు. ఉడికించిన టొమాటోల్లో విటమిన్‌-సి శాతం ఎక్కువ. ఇది సాధారణ కణాలు దెబ్బతినకుండానూ క్యాన్సర్‌ రాకుండానూ నిరోధిస్తుంది. వీటిని తినడంవల్ల రొమ్ము, ప్రొస్టేట్‌, క్లోమ, మలద్వార క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

బ్రకోలీ తరహావన్నీ...


బ్రకోలీ, కాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రస్సెల్స్‌ స్ప్రౌట్స్‌... వంటి క్రూసిఫెరస్‌ జాతులకు చెందిన ఆకు, కాయగూరలన్నీ క్యాన్సర్‌ నిరోధకాలే. ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొనే గ్లూటాథియోన్‌కు మంచి నిల్వలు. అలాగే వీటిల్లోని ఐసోథియోసైనేట్లు కూడా అన్ని రకాల క్యాన్సర్లనూ అడ్డుకుంటాయి. వీటిల్లోని ఇండోల్‌-3-కార్బినాల్‌, రొమ్ము క్యాన్సర్‌ను సమర్థంగా అరికడుతుందట. బ్రకోలీ మొలకల్లోని సల్ఫొరాఫేన్‌ అనే ఫైటో కెమికల్‌, క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకునే ఎంజైములను విడుదల చేయడం ద్వారా పేగు, మలద్వార క్యాన్సర్లను నియంత్రిస్తుంది. బ్రకోలీతో పోలిస్తే వాటి మొలకల్లో ఈ రసాయన శాతం 20 రెట్లు ఎక్కువ.

బొప్పాయి... ఎంతో మేలు..!

బొప్పాయిలోని సి- విటమిన్‌ అద్భుత యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తూ క్యాన్సర్‌ కారక నైట్రస్‌అమైన్లు శరీరంలోకి శోషణ చెందకుండా చేస్తుంది. అలాగే ఇందులోని ఫొలాసిన్‌ అనేక క్యాన్సర్లను నిరోధిస్తుంది.

గింజలతో...
గింజల్లో సమృద్ధిగా ఉండే క్యుయెర్సిటిన్‌, క్యాంఫెరాల్‌... వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ వ్యాపించకుండా అడ్డుకుంటాయి. నట్స్‌ అన్నీ క్యాన్సర్‌ నిరోధకాలే అయినప్పటికీ బ్రెజిల్‌ నట్స్‌లో సెలీనియం అత్యధికం. అందుకే ఇది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను చాలావరకూ నిరోధించగలదు. అయితే నట్స్‌ కొందరిలో అలర్జీలకు కారణమవుతాయి. అలాంటివాళ్లు నేరుగా సెలీనియం సప్లిమెంట్లను తీసుకోవడం మేలు. వాల్‌నట్స్‌, అవిసెగింజల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు క్యాన్సర్‌ను సమర్థంగా అడ్డుకుంటాయి. అవిసెలతోబాటు ఇతర ముడిధాన్యంలోని పీచుతో పేగు, మలద్వార క్యాన్సర్లనూ నిరోధించవచ్చు. అవిసెల్లోని లిగ్నన్లు కంతులు పెరగకుండా చూస్తాయి. అలాగే బెంజాల్డిహైడ్‌కు ప్రధాన నిల్వలైన అత్తిపండ్లు కంతుల్ని కుంచించుకుపోయేలా చేస్తాయట. ఇవి జీర్ణాశయ క్యాన్సర్ల నివారణకీ తోడ్పడతాయి. గింజలతోబాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, మాంసాహారం తీసుకుంటే ఎముక క్యాన్సర్‌ నివారణ సులభమవుతుంది.

వెల్లుల్లి చేసే మేలెంతో...
వెల్లుల్లిలోని ఎలియం పదార్థాలు క్యాన్సర్‌తో పోరాడే రోగనిరోధక కణాలను ప్రేరేపించడం ద్వారా కంతుల పెరుగుదల వేగాన్ని అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ కారక కణాలు ఆరోగ్యకర కణాల్లోకి ప్రవేశించకుండానూ అడ్డుకుంటాయి. డై-ఎలైల్‌-సల్ఫైడ్‌ అనే పదార్థం కాలేయంలోని క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేయడానికి దోహదపడుతుంది అలాగే వెల్లుల్లి జాతులకు చెందిన ఉల్లి, చైవ్స్‌, లీక్స్‌... వంటి వాటిల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చాలా ఎక్కువ. ఇవి పొట్ట, పేగు క్యాన్సర్లనూ నిరోధిస్తాయి.

బెర్రీలన్నీ క్యాన్సర్‌ నిరోధకాలే!


చెర్రీలూ స్ట్రాబెర్రీలూ గోజిబెర్రీలూ రాస్బెర్రీలూ బ్లూ బెర్రీలన్నీ క్యాన్సర్‌ను నిరోధించేవే. ముఖ్యంగా నలుపురంగు రాస్బెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గొంతులోని కణుతుల్ని ప్రభావవంతంగా నివారిస్తాయి. వీటిల్లోని గాలిక్‌ ఆమ్లం శక్తిమంతమైన యాంటీవైరల్‌గా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఇతర పదార్థాలు ఫ్రీ-రాడికల్స్‌ సంఖ్యను బాగా తగ్గిస్తాయి. వీటితోబాటు దానిమ్మ, ద్రాక్ష... వంటి పండ్లను తరచూ తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్‌ను చాలావరకూ తగ్గించవచ్చు.

తేయాకులో...

గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీల్లోని కెటెచిన్లు క్యాన్సర్‌ కణాల విభజనను అడ్డుకుంటాయి. అంతేకాదు, ఇవి పొట్ట, పేగు, వూపిరితిత్తులు, కాలేయం, క్లోమ క్యాన్సర్లన్నింటినీ నిరోధించగలవని తేలింది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ రోగులకు గ్రీన్‌ టీ ఎంతో మేలు.

క్యారెట్లు ఎంతో మేలు!

క్యారెట్‌, బీట్‌రూట్‌, గుమ్మడి, చిలగడదుంపల్లోని బీటాకెరోటిన్‌, ల్యూటెన్‌... వంటివన్నీ వూపిరితిత్తులు, నోరు, గొంతు, పొట్ట, పేగు, మూత్రాశయం, మూత్రపిండాలు, ప్రొస్టేట్‌, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లన్నింటినీ తగ్గిస్తాయట. క్యారెట్లలోని ఫాల్కారినాల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని డానిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ నిరూపించింది. క్యారెట్ల కారణంగా కళ్లు, చర్మ సంబంధ క్యాన్సర్లూ దరిచేరవు. సంక్లిష్ట పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఈ రకం కూరగాయలు అన్నవాహిక క్యాన్సర్లు రాకుండానూ అడ్డుకుంటాయి. వీటిల్లోని బీటాకెరోటిన్‌, క్యాన్సర్‌ కారక రసాయనాలు కణత్వచాన్ని దాటి డీఎన్‌ఏను చేరకుండానూ రక్షిస్తుంది. క్యారెట్‌ ముక్కలు లేదా జ్యూస్‌ని ఓ అరకప్పు మోతాదులో రోజుకి రెండుసార్లు తీసుకుంటే అండాశయ క్యాన్సర్‌ తగ్గుముఖం పడుతుంది.

పసుపులో...
పసుపులో సైక్లో-ఆక్సిజినేజ్‌-2 శాతం ఎక్కువగా ఉండటంతో అది పేగు క్యాన్సర్‌ను సమర్థంగా తిప్పికొడుతుంది. అలాగే ఇందులోని కుర్‌క్యుమిన్‌ కంతుల పరిమాణాన్ని తగ్గించడంతోబాటు మంటను తగ్గించడం ద్వారా పేగు, రొమ్ము క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందట. అందుకే కప్పు నీళ్లలో టీస్పూను పసుపుతో పావు టీస్పూను మిరియాలపొడి కలిపి రోజూ తాగితే ఫలితం ఉంటుంది.

సిట్రస్‌ పండ్లన్నీ..!
సిట్రస్‌ జాతి పండ్లయిన గ్రేప్‌ఫ్రూట్‌, కమలా... వంటి వాటిల్లోని మోనోటెర్పీన్లు క్యాన్సర్‌ కారక కార్సినోజెన్‌ కణాలను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. ముఖ్యంగా గ్రేప్‌ఫ్రూట్‌ రొమ్ముక్యాన్సర్‌ను అద్భుతంగా తగ్గిస్తుందని తేలింది. ఇంకా వీటిల్లోని లిమోనిన్‌లు క్యాన్సర్‌ కణాలను నాశనం చేసే లింఫోసైట్లనూ ప్రేరేపిస్తాయి.

నాన్‌ రిఫైన్డ్‌ నూనెలు...
మెదడుతోబాటు నాడీవ్యవస్థలో 60 శాతం కొవ్వు ఆమ్లాలతోనే నిర్మితమై ఉంటుంది. కానీ మనం ఆహారం ద్వారా తీసుకునే నూనెల్లో రిఫైన్డ్‌ వెజిటబుల్‌, హైడ్రోజినేటెడ్‌ నూనెల శాతమే ఎక్కువ. దాంతో అవి కణాలమీద దాడి చేయడంతో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. వాటికి బదులు నాన్‌రిఫైన్డ్‌ కొబ్బరి, అవిసె, కాడ్‌ లివర్‌, ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌... వంటి నూనెల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు క్యాన్సర్‌ వ్యాధుల్ని రానివ్వవు.

మిరపా... మంచిదే
మిర్చి జాతుల్లోని క్యాప్సైసిన్‌ సైతం క్యాన్సర్‌ కారక నైట్రస్‌ అమైన్లను నిరోధించడం ద్వారా పొట్ట క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. క్యాప్సికమ్‌లోని ఫైటోకెమికల్స్‌ కూడా జీర్ణాశయ క్యాన్సర్లను కొంతవరకూ నివారిస్తాయి.

పుట్టగొడుగులతో...
మంచి పోషకాహారంగా మాత్రమే కాదు, పుట్టగొడుగుల్లోని లెంటినాన్‌ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. వీటిల్లోని లెక్టిన్‌ క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండా చేస్తుంది.

తాజా ఆకుకూరల్లో...
విటమిన్లూ ఖనిజాలూ యాంటీ ఆక్సిడెంట్లూ ఎంజైములూ అధికంగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు అన్ని విధాలా మంచివే. క్యాలరీలూ తక్కువ. పాలకూర, కేల్‌, వాటర్‌ క్రెస్‌... వంటి వాటిల్లో క్యాన్సర్‌ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. వీటిల్లోని గ్లూకోసైనోలేట్లు అన్నిరకాల క్యాన్సర్‌ కారక కణాలనూ పనిచేయకుండా చేస్తాయి. దాంతో కంతులు పెరగకుండా ఉంటాయి.

ద్రాక్షతో రక్ష.
ద్రాక్షపండ్లలోని బయోఫ్లేవనాయిడ్లు అద్భుత యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాదు, శక్తిమంతమైన క్యాన్సర్‌ నిరోధకాలు కూడా. వీటిల్లోని రెస్‌వెరాట్రల్‌ క్యాన్సర్‌ను ప్రేరేపించే ఎంజైములు విడుదల కాకుండా చేస్తుంది. అలాగే ఎలాజిక్‌ ఆమ్లం కూడా క్యాన్సర్‌ కణాలకు అవసరమైన ఎంజైములను అడ్డుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నిరోధించడంతోబాటు కంతుల పెరుగుదలనీ అడ్డుకుంటుంది.

చూశారుగా... మనం రోజు తీసుకునే ఆహారంలోనే క్యాన్సర్‌ను నిరోధించేవెన్నో. కాబట్టి ఆయా పదార్థాలను వాటిల్లోని పోషకాలు నశించకుండా తీసుకోవడంతోబాటు; క్యాన్సర్‌కు ప్రధాన కారకాలైన వేపుళ్లూ నిల్వపచ్చళ్లూ ప్రాసెస్‌డ్‌ పదార్థాలూ వంటి వాటికి దూరంగా ఉండటమూ అంతే అవసరం. అప్పుడే ఆ భూతాన్ని ధైర్యంగా దూరంగా తరిమేయగలం..! (ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం)

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం