MohanPublications Print Books Online store clik Here Devullu.com

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి_Kasapuram_Anjaneyeswaraswamy-MohanPublications

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి

శ్రీ ఆంజనేయస్వామి భవిష్యత్‌ బ్రహ్మ. ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించడంలో ఆయన నిష్టాగరిష్టుడు. శ్రీరామనాప జపం విన్నంత మాత్రానే ఆయన ప్రసన్నుడవుతాడు. అనంతపురం జిల్లా కసాపురంలో వెలిసిన హనుమంతుడు భక్తుల కోరికలను తీర్చుతూ వారిపై చల్లనిచూపును ప్రసరిస్తున్నాడు. దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తమను కష్టాల నుంచి గట్టెక్కించమని, తమను, తమ కుటుంబాల్లోని వారిని ఎల్లవేళలా చల్లగా ఉండేలా దీవించమని ఆ దేవుడిని వేడుకుంటారు. ఆ స్వామిని దర్శిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. మనసులో అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని, ఏ పనులు ప్రారంభించినా విఘ్నం లేకుండా ముందుకు సాగుతాయని, సర్వరోగాలు నయమవుతాయని స్వామిని దర్శించటం మహాభాగ్యంగా తలుస్తారు భక్తులు. అలాంటి సర్వమంగళ స్వరూపుడు, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడే కసాపురంలో వెలిసిన నెట్టికంటి ఆంజనేయస్వామి. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కసాపురంలో ఆంజనేయస్వామి దేవస్థానంఉంది. ఉగాది పండుగ సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. కోరిన వరాలు ఇచ్చి ప్రజలకు ఇలవేల్పు అయిన స్వామివారి గుడి నిర్మాణానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడి జానపదాల నుండి వినిపించే కథల్ని పరిశీలిస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఒకసారి ఆయనకు కుహూ గండం ఏర్పడింది. ఆ సమయంలో రాజ్యపాలన చేయడం మంచిదికాదని జ్యోతిష్యులు చెప్పడంతో కొన్ని ఘడియలు రాజ్యపాలన చేసేందుకు కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలు సింహాసనం అధిష్టించారు. తరువాత తిరిగి కృష్ణదేవరాయలు రాజ్యాధికారాన్ని చేపట్టారు. కొన్ని ఘడియలు రాజ్యాధికారం చేసిన వ్యాసరాయలు విజయనగరాన్ని వదలి తీర్థయాత్రకు బయలుదేరుతాడు. ఆయనకు ఆంజనేయస్వామి మీద భక్తి ఎక్కువ. యాత్రలో భాగంగా ఆయన కర్నూలు జిల్లాలోని చిప్పగిరి (శిల్పగిరి) చేరుకుంటాడు. ఒకనాటి రాత్రి ఆంజనేయస్వామి కలలో కనిపించి సమీపంలోని నెట్టికల్లు (కసాపురం) గ్రామంలో ఎండుపుల్ల చిగురించిన చోట గుడి కట్టించమని ఆజ్ఞాపించాడట. మరుసటి దినం రాయలవారు నెట్టికల్లు గ్రామాన్ని సందర్శంచి స్వామికి ప్రీతికరమైన స్థలం కనుగొని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. నెట్టికల్లు గ్రామం వద్ద గుడి ఉండడం వల్ల నెట్టికంటి ఆంజనేయస్వామి అని స్వామికి పేరు వచ్చింది. నెట్టికల్లు గ్రామం కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పడానికి ఆనవాళ్లు ఉన్నాయి. ఆ గ్రామానికి ఆనుకునే కసాపురం ఉంది. దీంతో స్వామిని కసాపురం ఆంజనేయస్వామి అని పిలుస్తారు. ఇక్కడ కాటేజీలు, వసతి గదులు ఉన్నాయి. ప్రతి శనివారం విశేషసంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. ఆలయం సంవత్సర ఆదాయం రూ. 17 కోట్లు. ప్రతిరోజూ దాదాపు 10 వేల మంది భక్తులు వస్తుంటారు.


కసాపురానికి చేరుకోవాలంటే...
గుంతకల్లు - పత్తికొండ మార్గంలో గుంతకల్లు పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కసాపురం గ్రామం ఉంది. గుత్తికి 33 కి.మీ.లు, అనంతపురం 115, కర్నూలు 74, బెంగుళూరు 298, హైదరాబాదుకు 334 కి.మీ.ల దూరంలో కసాపురం ఉంది. రైళ్లలో ప్రయాణించి గుంతకల్లు జంక్షన్‌కు చేరుకునే భక్తులు ఏడు కి.మీ.ల దూరంలోని కసాపురంకు చేరుకోవడానికి ఆటోల సౌకర్యం ఉంది. భక్తులు గుంతకల్లు నుండి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు ఉన్నాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list