MohanPublications Print Books Online store clik Here Devullu.com

టీటీ ఇంజెక్షన్_TT Injection-

దెబ్బ తగిలింది... టీటీ తప్పదా?


పీడియాట్రీ కౌన్సెలింగ్

మా బాబుకు ఏడేళ్లు. దెబ్బలు తగిలిన ప్రతి సందర్భంలో టీటీ ఇంజెక్షన్ వేయించాలా? - రవికాంత్, నల్లగొండ

పిల్లలకు నెలన్నర, రెండున్నర నెలలు, మూడున్నర నెలలో ఇచ్చే డీపీటీ టీకాలో టీటీ టీకా కూడా ఉంటుంది, ఏడాదిన్నర, నాలుగేళ్ల వయసులో ఇచ్చే డీపీటీ టీకాలోనూ టీటీ మందు ఉంటుంది. ఆ టీకాలన్నింటినీ మీరు కరెక్ట్‌గా వేయిస్తే ప్రతి చిన్న దెబ్బకూ టీటీ ఇంజెక్షన్ వేయించాల్సిన అవసరం లేదు. పదేళ్ల వయసులో మళ్లీ డీపీటీ టీకా వేయించాలి. ఆ తర్వాత ప్రతి పదేళ్లకూ టీటీ వేయిస్తూ ఉండాలి. బాగా పెద్ద దెబ్బ తగిలి, దానికి బాగా మట్టి అంటుకుపోతే పిల్లల డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైతే టీటీ  టీకా, టెటనస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇవ్వాల్సి రావచ్చు. ఈ అవసరం సాధారణంగా సరిగ్గా షెడ్యూల్ ప్రకారం డీపీటీ, టీటీ టీకాలు తీసుకోనివారికే పడుతుంది.దెబ్బ తగలగానే ముందుగా శుభ్రంగా నీళ్లతో యాంటీసెప్టిక్ సబ్బుతో కడిగి శుభ్రమైన బట్టతో పొడిగా అద్దాలి. చిన్న చిన్న దెబ్బలను శుభ్రంగా, పొడిగా ఉంచితే తొందరగా మానిపోతాయి.

మా మేనల్లుడు జ్వరంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు డెంగ్యూ చాలా తరచుగా కనిపిస్తోంది కదా. వాడు డెంగ్యూతో బాధపడుతున్నట్లుగా మాకు అనిపిస్తోంది. ప్లేట్‌లెట్స్ ఎక్కించాలా? మాకు ఆందోళనగా ఉంది. దయచేసి సలహా ఇవ్వండి. - నిహారిక, ఖమ్మం

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు తెల్ల రక్తకణాల సంఖ్య, పేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతుంది. అదే టైమ్‌లో రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్ కావడం వల్ల ఎర్రరక్తకణాల కాన్సన్‌ట్రేషన్ పెరుగుతుంది. రక్తపోటు (బీపీ) పెరగడం, ముఖం కొంచెం ఉబ్బుగా కనిపించడం జరగవచ్చు. అవసరాన్ని బట్టి కరెక్ట్‌గా సెలైన్ ఎక్కించడం ద్వారా డాక్టర్లు బీపీ తగ్గకుండా చూసుకుంటారు. ప్లేట్‌లెట్స్ బాగా తగ్గితే (పది నుంచి ఇరవై వేల కంటే తక్కువకి పడితే) మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించడం వల్ల ఉపయోగం ఉండవచ్చు.  క్యాపిల్లరీ లీక్ అంటే రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్ తగ్గుముఖం పడుతున్న టైమ్‌లో ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లో నీరుపట్టడం, ఆయాసం రావడం వంటివి కూడా జరగవచ్చు. డెంగ్యూబారిన పడిన ఏ పిల్లలనైనా తప్పనిసరిగా పిల్లల డాక్టర్‌కి చూపించాలి. డెంగ్యూలో తీవ్రత పెరుగుతోందనే సూచనలు... అంటే అదేపనిగా వాంతులు కావడం, పొట్టనొప్పి, ఒళ్లు చల్లబడిపోవడం, ఒంటి నిండా ఎర్రమచ్చలు, ఎక్కడి నుంచైనా రక్తస్రావం జరగడం, మత్తుగా లేదా చికాకుగా ఉండటం, మూత్రం బాగా తగ్గిపోవడం, బాగా ఆయాసంగా ఉండటం జరిగితే మాత్రం తప్పనిసరిగా హాస్పిటల్‌లో చేర్చాల్సి ఉంటుంది.
డాక్టర్ శివరంజని హెచ్‌ఓడీ  డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్
మాక్స్‌క్యూర్ షియోషా, మాదాపూర్, హైదరాబాద్


డయాలసిస్‌కు ప్రత్యామ్నాయం...

నెఫ్రాలజీ కౌన్సెలింగ్

నా వయసు 50 ఏళ్లు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. నేను ఉండే ఊళ్లో డయాలసిస్ సెంటర్ లేదు. డయాలసిస్ కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? - డి. విశ్వేశ్వర్, మునగాల
ఇలా వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించాల్సిన వ్యక్తుల్లో కిడ్నీ మార్పిడి మంచి చికిత్స. అయితే ఇది అందరికీ సాధ్యపడే అంశం కాదు. మాటిమాటికీ హాస్పిటల్‌కు వెళ్లేందుకు అనువుగా లేనివారు, ఇంట్లోనే డయాలసిస్ చేసుకునే  కంటిన్యువస్ ఆంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ (సీఏపీడీ)  మెషిన్‌ను వాడటం మంచిది. దీంతో డయాలసిస్ చాలా సులువుగా చేసుకోవచ్చు. డయాలసిస్ పూర్తయ్యాక మామూలుగా తమ వృత్తులూ చేసుకోవచ్చు. దీనివల్ల జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) కూడా బాగా మెరుగవుతుంది.
నా వయసు 34 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం  వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - ఎస్. బాలయ్య, జనగామ
మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు)  తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి  నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్
అజీర్ణం... కడుపు ఉబ్బరం తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. నేను మార్కెటింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. నేను కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? - దశరథ, నిజామాబాద్
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో  గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్‌ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.
కారణాలు : 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది.  తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం     కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం  పైత్య రసం వెనక్కి ప్రవహించడం  కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు  శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో  ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు : కడుపు నొప్పి, మంట కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం  అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు  ఆకలి తగ్గిపోవడం  కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : సమయానికి ఆహారం తీసుకోవాలి  కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి  పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి      ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి.
చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list