MohanPublications Print Books Online store clik Here Devullu.com

తిరుత్తణి కార్తికేయ రణశిబిరం_Tiruttani

తిరుత్తణి కార్తికేయ రణశిబిరం.
.
ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీ దేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి. దేవసేనానిగా వ్యవహరించిన మురుగన్‌ రాక్షసుడు సూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి పళని, తిరుచెందూర్‌, స్వామిమలై, తిరుపరన్‌కుండ్రం, తిరుత్తణి, పళముదిరి కొలయ్‌. సుబ్రహ్మణ్యస్వామికి మురుగన్‌, కార్తికేయుడు, శరవణుడు, శరవణవభుడు, షణ్ముగం, ఆర్ముగం, స్కందుడు అనే పేర్లుకూడా వున్నాయి. సూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తిరుత్తణిలోని కొండపై విశ్రాంతి తీసుకున్నాడు. ప్రశాంత వదనంతో కనిపిస్తాడు. అందుకనే ఈ క్షేత్రం అరుల్‌మిగు సుబ్రహ్మణ్య షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందింది.
శ్రీవల్లితో వివాహం
స్వామివారు శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. సూరపద్ముడిని తిరుచెందూరులో సంహారం చేసిన అనంతరం ఇక్కడకు చేరుకున్న షణ్ముఖుడు విశ్రాంతి తీసుకుంటారు. అందుకునే అన్ని మురుగన్‌ ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధవుత్సవం జరుగుతుంది. ఆ రోజున వేయి కిలోగ్రాముల పుష్పాలతో అభిషేకం కన్నులపండువగా నిర్వహిస్తారు. స్వామివారి వాహనం మయూరం ఇక్కడ కనిపించదు. దీని స్థానంలో ఏనుగు వుంటుంది. దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది. సుబ్రహ్మణ్యస్వామికి స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు తన కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించే సమయంలో ఐరావతాన్ని కానుకగా ఇస్తాడు. అందుకే ఐరావతం విగ్రహరూపంలో ఆలయంలో వుంటుంది. అయితే దేవలోకం కూడా వృద్ధి చెందాలన్న తలంపుతో ఐరావతం తూర్పువైపు తిరిగి వుండాలని దేవేంద్రుడు అభ్యర్థిస్తాడు. ఆ అభ్యర్థనను మురుగన్‌ అంగీకరించడంతో ఐరావతం వేరే దిక్కును చూస్తుండటం గమనించవచ్చు.

చందన విశిష్టత
ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో వేసి సేవిసే అన్ని జబ్బులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే పర్వదినాల్లో మాత్రమే ఈ చందనాన్ని పంపిణీ చేస్తారు
365 మెట్లు
ఆలయాన్ని చేరుకోవాలంటే భక్తులు 365 మెట్లు ఎక్కాల్సివుంటుంది. సంవత్సరంలో 365 రోజులకు గుర్తుగా ఈ వీటిని ఏర్పాటుచేయడం విశేషం. నూతన సంవత్సరాదికి మెట్లోత్సవం నిర్వహిస్తారు. దీనినే పడిపూజ అంటారు.
భైరవస్వామి
ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసివుంటాడు. నాలుగు శునకాలు నాలుగు వేదాల పరిరక్షణకు అని తెలుస్తోంది. భైరవుడి ముందు పీఠం ముందు మూడు శునకాలు దర్శనమిస్తాయి. పీఠం వెనుక భాగంలో మరో శునకం వుంటుంది. చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునేవారు ఇక్కడ ప్రార్థన చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.
వల్లీ, మురుగన్‌ల సందేశం
సుబ్రహ్మణ్వేశ్వరస్వామి, వల్లీల వివాహం మానవాళికి ఒక సందేశానిచ్చింది. వల్లీదేవిని స్వామివారు వేటగాడి రూపంలో పెళ్లిచేసుకుంటారు. జననం, మరణం అనే వలయంనుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆ పరంధాముడిని ఆర్తితో ప్రార్థించాలి. ఈ ప్రపంచం ఒక బాడుగ ఇల్లు లాంటిదని ఎవరూ తెలుసుకోలేరు. అంతా తమదే, శాశ్వతమనే భావనతో స్వార్థంగా ప్రవరిస్తుంటారు. అయితే ఇవన్నీ అశాశ్వతమని తెలుసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని సుబ్రహ్మణ్వేశ్వర, వల్లీదేవిలు మానవాళికి సందేశమిచ్చారు.
స్వామి మహిమలు
అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు ఇక్కడే స్వామివారిని కొలుస్తూ పరమపదించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఒకసారి ఇక్కడకు వచ్చారు. మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని దీక్షతులకు ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని నోటిలో వేసుకొనగానే ముత్తుస్వామి నోరు పవిత్రమైంది. ఆశుధారగా గానం చేశారు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి ఇవ్వడం భగవద్‌ లీలావినోదం.
ఇలా చేరుకోవచ్చు
* చెన్నై-తిరుపతి మార్గంలో ఈ క్షేత్రం వుంది.
* తిరుపతి నుంచి 66 కి.మీ.దూరంలో వుంది.
* తిరుపతి నుంచి రైలు, బస్సు లేదా ఇతర వాహనాల ద్వారా తిరుత్తణి చేరుకోవచ్చు
* మెట్ల మార్గం ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా స్వామి సన్నిధిని చేరి స్వామిని దర్శించుకోవచ్చు.






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list