MohanPublications Print Books Online store clik Here Devullu.com

గ్లోరియస్‌ తెలంగాణ _glorious Telangana

గ్లోరియస్‌ తెలంగాణ


GloriousTelangana
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాల నిలయం, ముక్కోటి దేవతలు కొలువైన ఆలయం, ఆకుపచ్చని అరణ్యాల నెలవు, ఆకాశం నుంచి దుంకే జలపాతల కొలువు ఒక్కటని కాదు ప్రపంచానికే తలమానికమైన నేల తెలంగాణ. ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతీది దర్శించుకోవలసినవే. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు 31 జిల్లాలు వేటికవే సాటి. కొత్త జిల్లాల నేపథ్యంలో పర్యాటక రంగం కొత్త శోభను సంతరించుకుంటోంది. తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచ గుర్తింపు రావడమే దీనికి నిదర్శనం.
GloriousTelangana4

1 :నల్లగొండ 


పర్యాటక ప్రదేశాలు
PILLALAMARRI-TEMPLEనాగార్జున సాగర్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. చందంపేట గుహలు, దేవరకొండ కోట, సాగర్ వెనుక జలాల్లోని ఏలేశ్వరం ప్రాంతంలోని మల్లన్నస్వామి ఆలయం ప్రధానమైన పర్యాటక ప్రాంతాలు. మూసీ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంది. రాచకొండ గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, వాడపల్లి, ఛాయా సోమేశ్వర దేవాలయం ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. రుద్రమ మరణ ధ్రువీకరణ శాసనం ఉన్న చందుపట్లను హెరిటేజ్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.

ఎలా వెళ్లాలి?
నల్లగొండకు హైదరాబాద్ నుంచి అనేక బస్సులు ఉన్నాయి. రైల్వే సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ 153.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ప్రత్యేక బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

ఎక్కడ ఉండాలి?
నాగర్జున సాగర్‌లో విడిది చేయడానికి హోటల్స్, తెలంగాణ టూరిజం వారి హరిత హోటల్స్ ఉన్నాయి.

2 యాదాద్రి భువన గిరి 


పర్యాటక ప్రదేశాలు
guttaకొలనుపాక జైనదేవాలయం, ఏకశిలపై వెయ్యేళ్ల క్రితం నిర్మించిన భువనగిరి కోట చూడదగ్గ ప్రదేశాలు. భువనగరి కొండ రాక్ ైక్లెంబిగ్‌కు అనుకూలం. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సుప్రసిద్ధం. పోచంపల్లి చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. తెలంగాణ పర్యాటక శాఖ యాదాద్రి భువనగిరి కోట మీదకు కేబుల్ కారు ఏర్పాటు చేయనుంది. దీనివల్ల పర్యాటకంగా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి యాదాద్రి 62.1 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుంచి యాదాద్రికి పెద్ద సంఖ్యలో బస్సులు ఉన్నాయి.

3 సూర్యాపేట 


పర్యాటక ప్రాంతాలు
పురాతన కాకతీయుల కాలం నాటి శివాలయాలు, పిల్లల మర్రి, వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన చెన్నకేశవ ఆలయం ఇక్కడి పర్యాటక ప్రదేశాలు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌కు సూర్యాపేట 134.3 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుంచి, నల్లగొండ నుంచి కూడా అన్ని పర్యాటక ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.

4 మహబూబ్‌నగర్ 


ఒకప్పుడు ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తి చేసే ప్రాంతంగా విలాసిల్లింది పాలమూరు. నిజాం పాలనలో దీన్ని మహబూబ్‌నగర్‌గా మార్చారు.
పర్యాటక ప్రాంతాలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పిల్లల(ఊడల) మర్రి ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మర్రిచెట్టు మూడెకరాల్లో విస్తరించి ఉంది. పర్యాటక శాఖ ప్రదర్శనశాల, వస్తుప్రదర్శనశాల కూడా ఉన్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పురాతన విగ్రహాలు ఇక్కడ భద్రపరిచారు. దేవరకద్ర మండలంలో కోయిల్ సాగర్ జలాశయం, పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం జిల్లాలో ప్రధాన పర్యాటకాలు.
ఎలా వెళ్లాలి?
హైదారాబాద్ నుంచి పాలమూరు 135 కి.మీ. దూరంలో ఉంటుంది. పిల్లలమర్రి నగకం 99.4 కి.మీ. దూరంలో ఉంటుంది.
ఊడలమర్రి

5 జోగులాంబ గద్వాల 


కృష్ణా, తుంగభద్ర నదులు నడయాడే జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతులు కలగలిసిన నేల ఇది. కృష్ణా, తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో విస్తరించి నడిగడ్డగా పేరొందింది.
పర్యాటక ప్రాంతాలు
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదైన జోగులాంబ క్షేత్రం కొలువైన అలంపూర్ ఈ జిల్లాలోనే ఉంది. బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం, గద్వాల చేనేత చీరలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు, చంద్రఘడ్ కోట, పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి దేవాలయం, పాగుంట వెంకటేశ్వరస్వామి దేవాలయం, జూరాల జలవిద్యుత్ కేంద్రం చూడదగ్గ ప్రదేశాలు.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి గద్వాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఉంది. గద్వాల మీదుగా కర్నూలు, కర్ణాటకకు వెళ్లే వాహనాలు సైతం ఉంటాయి.

6 వనపర్తి 


ఒకప్పుడు సంస్థానాధీశుల పాలనలో ఉన్న వనపర్తి ప్రస్తుతం జిల్లాగా ఆవిర్భవించింది. సంస్థానాల చరిత్రలో ప్రత్యేకమైన స్థానం పొందిన జిల్లా వనపర్తి.
పర్యాటక ప్రాంతాలు
వనపర్తికోట, పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయం. రామన్‌పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గరుడ పుష్కరిణి, ఘన్‌పూర్ కోట, భీమా రెండో విడత ఎత్తిపోతల పథకం కింద శంకరసముద్రం జలాశయం నిర్మాణంలో ఉంది.

ఎలా వెళ్లాలి?
మహబూబ్ నగర్ నుంచి వనపర్తికి బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి వనపర్తి 148.8 కి.మీదూరంలో ఉంది. ఇక్కడి నుంచి కూడా రవాణా సౌకర్యం ఉంది.
వనపర్తి కోట

7 నాగర్‌కర్నూల్ 


వందేళ్ల క్రితమే జిల్లాగా ఉన్న నాగర్ కర్నూలును తిరిగి జిల్లాగా చేశారు. 1794-1904 కాలంలోనూ నాగర్ కర్నూలు జిల్లాగా భాసిల్లింది.
పర్యాటక ప్రాంతాలు
పొడవైన కృష్ణాతీరం, సోమశిల అందాలు,
నల్లమల అభయారణ్యం ఈ జిల్లాకు వన్నెతెస్తున్నాయి. నాగార్జునసాగర్ పులుల అభయారణ్యం, తెలంగాణ సాగునీటి రంగంలో
Somasilaకీలకమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఎత్తిపోతల ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగం ఈ జిల్లాలోనే ఉన్నాయి. సోమశిల వద్ద సప్తనదుల సంగమం, మల్లెల తీర్థం జలపాతం, నల్లమలలోని పరహాబాద్ వ్యూపాయింట్ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదిలో పడవ ప్రయాణం ఆహ్లాదాన్ని పంచుతుంది. నల్లమలలోని ఉమమహేశ్వరస్వామి దేవాలయం, వట్టెం వెంకటేశ్వరస్వామి దేవాలయం, సోమేశ్వరాలయాలు ప్రసిద్ధి.

8 వరంగల్ అర్బన్ 


Bhadrakaliఓరుగల్లు పేరుతో విలసిల్లిన వరంగల్ జిల్లా పునర్విభజనలో భాగంగా నగరం చుట్టూ ఉన్న మండలాలన్నీ కలిపి వరంగల్ అర్బన్ జిల్లాగా ఆవతరించింది. తెలంగాణలో సికింద్రాబాద్ తర్వాత ప్రధాన రైల్వే జంక్షన్ కాజీపేట ఇక్కడే ఉంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది.
పర్యాటక ప్రాంతాలు
తెలంగాణ ప్రజలు కొలిచి మొక్కే భద్రకాళి దేవాలయం, చరిత్రాత్మక వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్, కాకతీయ తోరణం, ఖుష్ మహల్, నైజాం కాలంనాటి మామునూరు విమానాశ్రయం ఈ జిల్లాలోనే ఉన్నాయి.
కొత్త ఆకర్షణలు
మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధ్దరించినట్లయితే పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చినట్లవుతుంది. దీనితోపాటు ఇక్కడ నిర్మించతలపెట్టిన టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, వ్యాగన్ వర్క్‌షాప్ పూర్తయితే పర్యాటక రంగం మరింత అభివృద్ధికి నోచుకుంటుంది.

ఎలా వెళ్లాలి?
ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ వరంగల్ నగరంలోనే ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కాజీపేట లేదా వరంగల్ రైల్వేస్టేషన్‌లో దిగితే తిరగడానికి సిటీ బస్సులుంటాయి.
ఎక్కడ ఉండాలి?
వరంగల్ నగరంలో తెలంగాణ పర్యాటక శాఖ హరిత హోటల్ ఉంది. దీనికి తోడు ప్రైవేటు హోటల్స్ కూడా ఉన్నాయి.

9 వరంగల్ రూరల్ 


వ్యవసాయానికి పెద్దపీట వేసిన జిల్లా వరంగల్ గ్రామీణం. అందుకే నర్సంపేటలో రైసుమిల్లులు, గీసుగొండలో పత్తి పరిశ్రమలు విస్తరించాయి. కాకతీయుల పాలనకు గుర్తుగా చారిత్రక పాకాల సరస్సు, పాకాల గుండం శివాలయం, అయినవోలు దేవస్థానం కనిపిస్తాయి. ఈ జిల్లాలోని
గంగదేవిపల్లి దేశానికే ఆదర్శ గ్రామ పంచాయతీగా
పేరుగాంచింది.
పర్యాటక ప్రాంతాలు
భీముని పాదం జలపాతం, కొమ్మాల జాతర ప్రసిద్ధి.

ఎలావెళ్లాలి?
వరంగల్ నుంచి పాకాల చెరువు 55.6 కి.మీ, ఐనవోలు 16.9 కి.మీ దూరంలో ఉంటాయి. వరంగల్ నుంచి ఈ ప్రాంతాలకు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి.

10 మహబూబాబాద్ 


వరంగల్ నుంచి పురుడు పోసుకున్న మరో జిల్లా మహబూబాబాద్. ఒకప్పుడు మానుకోటగా పేరుగాంచిన ఈ జిల్లా గిరిజనులకు అలవాలం. అడవుల విస్తీర్ణం కూడా ఈ జిల్లాలో ఎక్కువే. అందుకే ప్రకృతి తీర్చిదిద్దిన జిల్లాగా పేరుగాంచింది.
పర్యాటక ప్రాంతాలు
అనంతారంలోని శ్రీవెంకటేశ్వరస్వామి, నర్సింహులపేటలో శ్రీవెంకటేశ్వరస్వామి, డోర్నకల్ చర్చి, గూడూరులోని భీముడిపాదం సందర్శనీయ స్థలాలు.

11 జయశంకర్ భూపాలపల్లి 


తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక భూమిక వహించిన ఆచార్య జయశంకర్ సార్ పేరు మీదుగా ఏర్పాటైన జిల్లా ఇది. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాగా, గోదావరి నది ప్రవహిస్తున్న జిల్లాగా గుర్తింపు ఉంది.
పర్యాటక ప్రాంతాలు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర, చారిత్రక రామప్ప దేవాలయం, కాళేశ్వరంలో శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయాలు, గణపురంలో కోటగుళ్లు, రేగొండ పాండవుల గుట్ట, కోటంచ నర్సింహస్వామి దేవాలయం, రామప్ప, లక్నవరం చెరువులు, వాజేడు మండలంలోని బోగత జలపాతం పర్యాటక కేంద్రాలు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి 209.9 కిలోమీటర్ల దూరంలో భూపాలపల్లి ఉంది. భూపాలపల్లి నుంచి మేడారం 54.3 కిలోమీటర్లు, కాళేశ్వరం 52.4 కి.మీ, రామప్ప 28.2, కోటగుళ్లు 15.5 కి.మీ, లక్నవరం 55.1కి.మీ దూరంలో ఉన్నాయి.

12 జనగామ 


ఒకప్పుడు జైనుల ప్రాబల్యం కలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే డివిజన్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైల్వే మార్గాలున్నాయి. దేవాదుల, ఎస్సారెస్పీలతోపాటు బయ్యన్న రిజర్వాయర్, స్టేషన్ ఘన్‌పూర్ జలాశయం ఇక్కడి ప్రధాన ప్రాజెక్టులు.
పర్యాటక ప్రాంతాలు
పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి, జీడికల్ వీరాచల శ్రీసీతారామచంద్ర స్వామి , పెంబర్తి లోహ హస్తకళలో ఖండాంతర ఖ్యాతి ఆర్జించింది. మహాకవి పోతన జన్మస్థలం బమ్మెర, కవి పాల్కురికి సోమనాధుడి స్వగ్రామం పాలకుర్తి ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. దక్కన్ పీఠభూమిలో ఎత్తయిన ప్రాంతం సోలామైల్ కూడా ఇక్కడే ఉంది. జనగామలో చీనకోడూరు రిజర్వాయర్ వద్ద బోట్ సౌకర్యం, గెస్ట్‌హౌజ్ నిర్మాణం, జీడికల్లు రామాలయం అభివృద్ధి చేసే ఆలోచనలో పర్యాటక శాఖ ఉంది.
ఎలా వెళ్ళాలి?
రాజధానికి 91.6 కిమీ దూరంలో జనగామ ఉంది. జనగామకు సికింద్రాబాద్ నుంచి రైల్వే సౌకర్యం ఉంది. జనగామ నుంచి పాలకుర్తి 36 కి.మీ దూరం.

13 కరీంనగర్ 


హైదరాబాద్ సంస్థానంలో ఎలగందులగా ప్రసిద్ధి చెందిన జిల్లా కరీంనగర్. నాటి జ్ఞాపకంగా ఎలగందుల ఖిల్లా నేటికీ కనిపిస్తుంటుంది. ఇది జిల్లా కేంద్రం నుంచి 14 కి.మీ దూరంలో ఉంది.
పర్యాటక ప్రాంతాలు
ఎలగందుల కోటతో పాటు నగరానికి దగ్గర్లో దిగువ మానేరు జలాశయం ఉంది. దీనిపై నిర్మించిన మానేరు డ్యాం పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి. డ్యామ్ దిగువన 30 ఎకరాల్లో డీర్ పార్క్ చూడదగ్గది. కరీంనగర్‌లో వెండితో వస్తువులు తయారుచేసే కళ (ఫిలిగ్రీ) ప్రపంచ గుర్తింపు పొందింది. జిల్లాలోని ఇల్లందకుంట దేవాలయం ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి దేవాలయం, జిల్లా కేంద్రంలోని పురావస్తు ప్రదర్శన శాల చూడదగ్గవి.
ఎలా వెళ్లాలి?
జిల్లా ప్రధాన బస్‌స్టేషన్ నుంచి సిటీ బస్సులతో పాటు వివిధ రూట్లలో అయా ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
ఎక్కడ ఉండాలి?
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫైవ్‌స్టార్ నుంచి సాధారణ స్థాయి సౌకర్యాలు గల హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

14 పెద్దపల్లి 


పర్యాటక ప్రాంతాలు
ramagirikhillaఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఎల్ మడుగు జలాశయం, రామగిరి ఖిల్లా, సబితం జలపాతం, రామునిగుండాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఓదెల మల్లన్న దేవాలయం పెద్దపల్లి జిల్లాలోనే పెద్దదిగా చెప్పుకోవచ్చు. కోటి లింగాల- ఎల్లంపల్లి మధ్య 20 కి.మీ పొడవు, 1 కి.మీ వెడల్పు గల వాటర్ బాడీలో నడిపేందుకు రూ.2 కోట్లతో కొత్త బోట్లను కొనాలని పర్యాటక శాఖ ప్రతిపాదన ఉంది.
ఎలా వెళ్లాలి?
పెద్దపల్లితో పాటు రామగుండంలో ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. పెద్దపల్లి, గోదావరిఖని, కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాల నుంచి బస్సులుంటాయి.
ఎక్కడ ఉండాలి?
ఈ పర్యాటక ప్రాంతాలన్నీ ఒక్కరోజులో చూసేవే కనుక బస అవసరం లేదు. ఒకవేళ ఉండాల్సి వస్తే హోటల్స్ ఉన్నాయి.

15 జగిత్యాల 


పర్యాటక ప్రాంతాలు
గోదావరి నది జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, సారంగాపూర్, ధర్మపురి, వెల్గటూర్ మండలాల మీదుగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో పలు దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పొలాసలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉత్తర తెలంగాణ జిల్లాలకు సేవలందిస్తోంది. క్రీస్తు పూర్వమే తెలంగాణలోని గోదావరి నది పరీవాహక ప్రాంతంలో నాగరికత వర్ధిల్లిందనడానికి కీలక ఆధారమైన కోటిలింగాల పట్టణం ఈ జిల్లాలోనే ఉంది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాలు, జగిత్యాల కోట, క్లాక్‌టవర్ ప్రధాన పర్యాటక కేంద్రాలుగా విలాసిల్లుతున్నాయి.
ఎలా వెళ్లాలి?
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి జగిత్యాలకు, కొండగట్టుకు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలనుంచి ధర్మపురికి బస్సులుంటాయి.
ఎక్కడ ఉండాలి?
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉండానికి హోటల్స్ ఉన్నాయి. ధర్మపురి, కొండగట్టులో వసతులు ఉన్నప్పటికీ ఇంకా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

16 సిరిసిల్లా 


చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల. అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరను నేసిన ఘనత సిరిసిల్లదే. మరనేత, చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి.
పర్యాటక ప్రాంతాలు
దక్షిణ కాశీ క్షేత్రంగా, కోడె మొక్కుల దేవుడిగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ జిల్లాలోనే ఉంది. ఎగువ మానేరు జలాశయం కూడా ఇక్కడే ఉంది. సిరిసిల్ల చేనేత పరిశ్రమ, వేములవాడ, నాంపల్లి గుట్ట మొదలైనవి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు.

ఎలా వెళ్లాలి?
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వేములవాడకు బస్సులు నడుస్తున్నాయి.
ఎక్కడ ఉండాలి?
వేములవాడలో ఉండడానికి వీలుగా అనేక సత్రాలు, ప్రైవేటు హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

17 భద్రాద్రి కొత్తగూడెం 


భద్రాచలంలో భక్త రామదాసు కట్టించిన దేవాలయం ఉంది. ఇది తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు గాంచింది.
పర్యాటక ప్రాంతాలు
Bhadradiభద్రాద్రి దేవాలయం, పర్ణశాల, తాలిపేరు, పెద్దవాగు, మూకమామిడి, కిన్నెరసాని, పాలెంవాగు ప్రాజెక్టులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. అటవి ప్రాంతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల అభయారణ్యం ఏర్పాటుకు అనుకూలం. కిన్నెరసానిలో రూ.15 కోట్లతో హరిత రెస్టారెంట్, ఎకో పార్క్, గెస్ట్ హౌజ్ ఏర్పాటు కానున్నాయి.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి భద్రాచలం 309.3 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యేక బస్సులు, రైలు సౌకర్యాలున్నాయి. త్వరలోనే విమానాశ్రయం కూడా రానుండడంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది.
ఎక్కడ ఉండాలి?
భద్రాచలంలో దేవాలయ సత్రాలతో పాటు పర్యాటక శాఖ నివాసాలు, ప్రైవేటు లాడ్జీలు, హోటల్స్ ఉన్నాయి.

18 ఖమ్మం 


పర్యాటక ప్రాంతాలు
ఖమ్మంలో స్వయంభుగా వెలసిన స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జిల్లాల్లో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. దీంతో పాటు నగరంలోని ఖిల్లా అత్యంత పురాతనమైంది. నేలకొండపల్లిలోని భౌద్ధస్తూపం, భక్తరామదాసు నివాసం ప్రముఖమైనవి. వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులున్నాయి. సత్తుపల్లిలో ఉపరితల బొగ్గు గని (ఓపెన్‌కాస్ట్) చూడదగిన ప్రాంతాలు.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ఖమ్మం 193.3 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుంచి సూర్యాపేట ద్వారా బస్సు సౌకర్యం,
సికింద్రాబాద్ నుంచి రైల్వే
సౌకర్యం ఉన్నాయి.

19 నిజామాబాద్ 


ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయి లాంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పుట్టినిల్లు నిజామాబాద్. గోదావరి నది మీద కట్టిన ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతోంది.
పర్యాటక ప్రాంతాలు
బడా పహాడ్ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, సారంగాపూర్ హనుమాన్ దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దేవల్ మజీద్, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అలీసాగర్, అశోకాసాగర్, జానకంపేట అష్టముఖి కోనేరు, బోధన్ భీమునిగుట్టలు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాలు. వీటితో పాటు బ్రిటీష్ కాలం నాటి రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం, వైద్య కళాశాల చూడదగ్గ ప్రాంతాలు.

20 కామారెడ్డి 


కామారెడ్డిలో చూడదగిన ముఖ్య ప్రాంతం నిజాం సాగర్ ప్రాజెక్ట్. దీన్ని నిజాం నవాబులు కేవలం ఏడు సంవత్సరాలలో నిర్మించారంటారు.
పర్యాటక ప్రాంతాలు
మంజీరా నది మీద నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ కామారెడ్డికి ప్రముఖ పర్యాటక ప్రాంతం. బిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం, కాల భైరవస్వామి, లక్ష్మీనరసింహస్వామి, బుగ్గరామలింగేశ్వర, బసవేశ్వర ఆలయాలు. పోచారం, కౌలాస్నాలా ప్రాజెక్టు, దోమకొండ సంస్థానం కోట, పోచారం అభయారణ్యం పర్యాటక ప్రాంతాలు. గాయత్రి, మాగి చక్కెర కర్మాగారాలు చూడదగ్గవి. తెలంగాణలో బెల్లం ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతం కూడా ఇదే. బీటెక్ డెయిరీ టెక్నాలజీ కళాశాల ఈ జిల్లాలోనే ఉంది.

21 మెదక్ 


హైదరాబాద్‌కు సమీపంలో ఉండి అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా మెదక్. జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘనపూర్ ఆనకట్ట సాగునీటి ఆనకట్టే కాకుండా పర్యాటక ప్రాంతంగానూ ఉంది.
పర్యాటక ప్రాంతాలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిని దర్శించడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మెదక్ ఖిల్లా, కొల్చారం మండలంలోని జైనమందిరం, నర్సాపూర్ అడవులు, పోచారం జలాశయం, పోచారం అభయారణ్యం ప్రధాన పర్యాటక ప్రాంతాలు. వీటితో పాటు ఏడుపాయల వనదుర్గా జాతర జిల్లాలో ప్రముఖమైంది. ఇక్కడ మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నగరం నుంచి మెదక్‌కు 101.4 కి.మీ. దూరం. జిల్లా కేంద్రం నుంచి ఏడుపాయల 29.4 కి.మీ. దూరంలో ఉంటుంది. మెదక్ నుంచి అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.

22 సిద్దిపేట 


ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక సిద్దిపేట జిల్లాలోనే ఉంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎక్కువ మండలాలు సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాయి.
పర్యాటక ప్రాంతాలు
కొమురవెల్లి మల్లన్న, వర్గల్ సరస్వతీ క్షేత్రం, కొండపోచమ్మ, 600 సంవత్సరాల చరిత్ర కలిగిన నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ములుగులోని పాండురంగ ఆశ్రమం, జగదేవ్‌పూర్ వరదరాజుస్వామి , సిద్దిపేటలోని కోటి లింగేశ్వర ఆలయం, కోమటి చెరువు పర్యాటక కేంద్రాలు. కోమటిచెరువును మరింత అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి సిద్దిపేట 103.4 కి.మీ. దూరంలో ఉంది. రాజధాని నుంచి కరీంనగర్ వెళ్లే బస్సులు సిద్దిపేట మీదుగానే వెళతాయి.
ఎక్కడ ఉండాలి?
దేవస్థాన సత్రాలతో పాటు ప్రైవేటు హోటల్స్, లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి.

23 సంగారెడ్డి 


గోదావరి ఉపనది మంజీరా నది మీద కట్టిన బ్యారేజీ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలోనే ఉంది. మంజీరా అభయారణ్యంలో దాదాపు 600 మొసళ్లు ఉంటాయని అంచనా.
పర్యాటక ప్రాంతాలు
సింగూరు జలాశయం, ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం ప్రధాన పర్యాటక ప్రాంతాలు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుండి సంగారెడ్డి 71.6 కి.మీ దూరంలో ఉంది. నిత్యం బస్సులుంటాయి. మెదక్ నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి.


24 హైదరాబాద్ 


పర్యాటక ప్రదేశాలు
గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, చౌమొహల్లా ప్యాలెస్, కింగ్‌కోఠి, పురానీ హవేలీ, ఫలక్‌నుమా ప్యాలెస్ కట్టడాలు చరిత్రకు సజీవసాక్ష్యాలు. ఇండో- అరబిక్- పర్షియన్ వాస్తు శిల్ప కళానైపుణ్యానికి హైదరాబాద్ కట్టడాలు ప్రతీక. ఒక్కో కట్టడానిది ఒక్కో చారిత్రక నేపథ్యం. ప్రపంచంలో ఎక్కడా లేని నిర్మాణశైలి వీటి సొంతం. మక్కా మసీదు, లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి దేవాలయాలు పండుగలకు ప్రధాన ఆకర్షణ. హుస్సేన్‌సాగర్, బుద్ధవిగ్రహం, ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు హైదరాబాద్ సొంతం.


25 వికారాబాద్ 


పర్యాటక ప్రదేశాలు
అనంతగిరి తెలంగాణ ఊటి. 41 వేల హెక్టార్లమేర విస్తరించిన అటవీ ప్రాంతం, చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. అనంతగిరి కొండల్లోనే పద్మనాభుడు కొలువుదీరాడు. బుగ్గరామేశ్వరం, భూకైలాస్, ఏకాంబరేశ్వర, జుంటుపల్లి రాముడు, కొండంగల్ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. జిల్లాలోని కోటిపల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులు చూడదగ్గవి.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి అనంతగిరి 80.4 కి.మీ. దూరంలో ఉంది. వికారాబాద్‌కు వెళ్లే వాహనాలు ఈ మార్గంలోనే వెళ్తాయి.

26 మేడ్చల్ 


కీసర
ఉత్తర తెలంగాణను హైదరాబాద్ నగరానికి అనుసంధానించే పట్టణం మేడ్చల్. మేడ్చల్ అంటే ప్రకాశవంతమైన ప్రాంతమని అర్ధం.
పర్యాటక ప్రాంతాలు
కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. జైన, బౌద్ధమతాలకు సంబంధించి చారిత్రక ఆనవాళ్లు ఎన్నో ఇక్కడ వెలుగుచూశాయి. బాలానగర్, జీడిమెట్ల, ఉప్పల్ పారిశ్రామికవాడల్లో వేల సంఖ్యలో పరిశ్రమలున్నాయి. ద్రాక్షతోటలు, అందమైన విల్లాలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రం.

27 రంగారెడ్డి 


పర్యాటక ప్రాంతాలు
రెండో తిరుపతిగా పేరొందిన చిల్కూరు బాలాజీ, నర్కూడలోని అమ్మపల్లి దేవాలయాలు ప్రధాన ఆలయాలు. సినిమా చిత్రీకరణలకు అమ్మపల్లి ఆలయం పేరుగాంచింది. శంషాబాద్‌లోని ముచ్చింతల్లో చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలు, నిజాం కాలంలో మూసీ, ఈసీ నదులపై నిర్మితమైన తాగునీటి చెరువులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట)లు ప్రసిద్ధ పర్యాటకాలు.

28 ఆదిలాబాద్ 


ప్రకృతికి పర్యాయపదంగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో పొచ్చర, గాయత్రి, కనకాయి జలపాతాలున్నాయి. ఇక్కడి ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయం ఇంద్రవెల్లి మండలంలో ఉంది. పర్యాటక శాఖ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వాటర్‌ఫాల్స్‌కు మరింత ఆదరణ పెరుగుతుంది.
ఎలా వెళ్లాలి?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 304.9 కి.మీ. దూరంలో ఉండే జిల్లా ఆదిలాబాద్. రాజధాని నుంచే కాక కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాల నుంచీ బస్సు, రైల్వే సౌకర్యాలున్నాయి.
ఎక్కడ ఉండాలి?
ఇక్కడ పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా అడవుల్లోనే ఉన్నాయి. అక్కడ ఉండడానికి ఎక్కువ సౌకర్యాలు లేవు. జిల్లా కేంద్రంలోనే బస ఏర్పాట్లు చేసుకోవాలి.
నాగోబా

29 నిర్మల్ 


చదువుల తల్లి బాసర జ్ఞానసరస్వతీ దేవి కొలువైన జిల్లా నిర్మల్. తూర్పున అడవులు, పడమర బాసర క్షేత్రం, ఉత్తరాన సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన గోదావరి నది కలిగి ఉన్న అద్భుతమైన జిల్లా ఇది. నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్‌లకు పెట్టింది పేరు. ఒకప్పుడు నిజాం ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేశారంటారు.
పర్యాటక ప్రాంతాలు
400 ఏళ్ల క్రితం నిమ్మనాయుడు పాలించడంతో ఆయన పేరుపై వెలిసిందే నిర్మల్. బాసర సరస్వతి దేవాలయం, పాపేశ్వర ఆలయం, అడెల్లి మహాపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం జలాశయాలతో పాటు సదర్మాట్ బ్యారేజీ తదితర ప్రాజెక్టులు తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి. నిర్మల్‌లోని పొచ్చెర, కుంటాల, కడెం జలపాతాలు, జిన్నారం, కవ్వాల్ టైగర్ జోన్ ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ టూరిజం అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రయత్నిస్తోంది.

30 మంచిర్యాల 


yellampalliఅపారమైన బొగ్గునిల్వలు, గోదావరి, ప్రాణహిత నదుల కలయికతో పునీతమైన జిల్లా మంచిర్యాల. సిమెంటు పరిశ్రమలు ఈ జిల్లా ప్రత్యేకం. జైపూర్ మండలంలో నిర్మించిన 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం తెలంగాణకు వెలుగురేఖ. గోదావరి నదిపై ఎల్లంపల్లి వద్ద నిర్మించిన జలాశయం వేల గ్రామాలకు తాగు, సాగునీరు అందిస్తున్నది.
పర్యాటక ప్రాంతాలు
మందమర్రి మండలంలో గాంధారి ఖిలా, గాంధారి వనం, జైపూర్ మండలంలో మొసళ్ల అభయారణ్యం, కోటపల్లి మండలంలో కృష్ణజింకల అభయాణ్యం, జన్నారం మండలంలో పులుల అభయారణ్యం ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు. గూడెం గుట్టలో శ్రీసత్యనారాయణ స్వామి ఆలయాన్ని మరో అన్నవరంగా పిలుస్తారు. ఎల్లంపల్లితో పాటు ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులు ఉన్నాయి.
ఎలా వెళ్లాలి?
ఈ ప్రాంతాలను దర్శించడానికి కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల నుంచి బస్సు సౌకర్యాలున్నాయి.
ఎల్లంపల్లి ప్రాజెక్టు

31 కుమ్రం భీం ఆసిఫాబాద్ 


కుమ్రం భీం పోరాడిన జోడేఘాట్ ఇప్పుడు తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి స్మారక మందిరం నిర్మిస్తున్నారు. నేటి జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ ఒకప్పటి గోండుల రాజధాని. ఏడు దశాబ్దాల క్రితమే జిల్లా కేంద్రం.
పర్యాటక ప్రాంతాలు
జోడేఘాట్‌తో పాటు జైనూరులోని మార్లవాయి హేమండార్ఫ్ దంపతుల స్మారకస్థలం, సప్తగుండాల, సముతుల గుండం జలపాతాలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు. కెరమెరి మండలంలోని జంగుబాయి దేవత శంకర్లొద్ది, తిర్యాణి మండలంలోని అర్జున్లొద్ది గుహలు గిరిజనుల ఆధ్యాత్మిక క్షేత్రాలు. వాంకిడిలో కాకతీయుల నాటి శివాలయం ఉంది. కుమ్రం భీం ప్రాజెక్టు, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, జగన్నాథ్ సాగర్, పాల్వాయిసాగర్ జలాశయాలు ఈ జిల్లాలో ముఖ్యమైనవి.
ఎలా వెళ్లాలి?
రాజధాని నుంచి 307.2 కి.మీ. దూరం. ఆసిఫాబాద్‌కు నిత్యం పెద్ద సంఖ్యలో బస్సులుంటాయి.
186


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list