MohanPublications Print Books Online store clik Here Devullu.com

500 and 1000 notes

















నోట్ల రద్దుతో ఎన్నెన్ని సిత్రాలో..



ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: నల్లధనంపై నరేంద్రమోదీ ప్రకటించిన మెరుపుదాడిపై ప్రముఖుల నుంచి సామాన్యుని దాకా దేశం యావత్తూ అభినందనల జల్లు కురిపించింది. రూ.500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం అక్రమార్కుల గుండెల్లో గునపంలా దిగగా.. మరికొందరికి ఇది వరంలా మారింది. సామాన్య ప్రజలకు తాత్కాలిక కష్టాలు తీసుకొచ్చింది. మనం ఎన్నడూ చూడని విచిత్రాలకు, వైపరీత్యాలకు, తమాషాలకు వేదికైంది. గత మూడు రోజుల్లో జరిగిన ఈ పరిణామాల్లో కొన్ని..
* సాధారణంగా మనం ఎవ్వరికైనా రుణం ఇవ్వాలంటే వారి వ్యక్తిగత వివరాలను బట్టో, వారి సామర్ధ్యాన్ని చూసో ఇస్తాం. ప్రాంసరీ నోటు రాయించుకుంటాం. కానీ కర్ణాటకలోని ఓ ఎమ్మెల్యే పేద రైతులకు రూ.3లక్షల చొప్పున రుణాలిచ్చాడు. అదీ ఎలాంటి పత్రాలు రాయించుకోకుండానే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్‌ ఎంటంటే అవన్నీ రూ.500, రూ.1000 నోట్లే.
* దొంగతానికి వచ్చే దొంగలకు ఏ మాత్రం కనికరం ఉండదు. వాళ్లు దోచుకోవడానికి వచ్చాక లక్షల కొద్దీ డబ్బు కనపడితే వదిలేస్తారా. కానీ ఇలాంటి ఘటనే తమిళనాడులోని తిరుచ్చి శివారులో చోటు చేసుకుంది. అక్కియంపాట్టిలో రైతు ముత్తుకృష్ణన్‌ ఇంటిపై ముసుగులు ధరించిన దొంగల ముఠా దాడి చేసి ఆయన్ను బంధించింది. ఆ తర్వాత బీరువాలోని 70 సవర్ల నగలు దోచుకుని వెళ్లిపోయారు. అనంతరం పరిశీలించగా అందులోని రూ.16లక్షల నగదును అక్కడే వదిలేశారు.


* వీధుల్లోని చెత్తకుండీల్లో డబ్బు సంచులు దర్శనమివ్వడం ఇటీవల చోటుచేసుకున్న మరో సిత్రం. పుణెలోని లా కళాశాల రోడ్డులో చెత్త సేకరించేందుకు వెళ్లిన శాంతా ఒహ్వాల్‌కు ఓ సంచి దొరికింది అందులో అన్నీ 1000 నోట్లే కనిపించాయి. వాటి విలువ రూ.52వేలు.
* నోట్ల రద్దు నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 12 గంటల వరకూ పాతనోట్లతో ఆస్తి పన్ను చెల్లించవచ్చని ప్రకటించింది. ఇంకేముంది జనం క్యూ కట్టారు. పన్నులు కట్టండి మొర్రో అని ఇన్నాళ్లూ మొత్తుకుంటున్నా పట్టించుకోని వాళ్లంతా ఎగబడి కట్టేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఖజానా గలగలలాడిపోయింది. ఈ ఒక్కరోజులో వసూలైన మొత్తం దాదాపు 35 కోట్లపైనే. ఇక్కడ మరో విశేషమేమిటంటే పన్ను కట్టిన వాళ్లలో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లే అధికం.


* బ్యాంకులు తమ డిపాజిట్లు పెంచుకోవాలంటే ఎన్నో కష్టాలు పడాలి. ప్రజలను చైతన్య పరిచేందుకు వారోత్సవాలు జరపాలి. కానీ ఇవేమి లేకుండా ఒక్కరోజులో కోట్లు వచ్చిపడటం ఇంతకుముందెన్నడైనా చూశారా.. ఎస్‌బీఐకి కేవలం ఒకటిన్నర రోజులోనే రూ.53వేల కోట్లు డిపాజిట్లుగా వచ్చాయి. గురువారం మొత్తం 31వేల కోట్లు రాగా శుక్రవారం మధ్యాహ్నానానికే రూ.22వేల కోట్లు వచ్చాయి.



* నదుల్లో ఈదే చేపలనే ఇన్నాళ్లూ చూశాం.. కానీ తాజాగా నోట్ల కట్టలు తేలాడుతూ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోని మీర్జాపూర్‌ వద్ద గంగానదిలో 500, 1000 నోట్లు కొట్టుకురావడాన్ని స్థానికులు గమనించారు.
* సినిమా థియేటర్లలో ఒక్కడి కోసం షో వేయడం ఎప్పుడైనా విన్నారా. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ చిత్రం చోటు చేసుకుంది. చిల్లర సమస్యతో జనాలు థియేటర్ల వైపు రావడం తగ్గించారు. అయితే ఒకే ఒక్కడు మాత్రం సినిమా చూసేందుకు హాల్‌కు వచ్చాడు. అతడి కోసం యాజమాన్యం షో రన్‌ చేసింది. ఈ సందర్భంగా తమకు నష్టం వచ్చినా మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ యజమాని చెప్పడం విశేషం.



* ఓ యువతి బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉంది. బిల్లు 40 వేలు అయ్యింది. బిల్లు కట్టేందుకు పాత రూ.500, రూ.1000 నోట్లు ఇస్తామంటే ఆసుపత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. సుకంత చౌ అనే యువతి డిశ్చార్జి కావాల్సి ఉన్నా వారి బంధువుల వద్ద ఎలాంటి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు లేవు. దీంతో వాళ్లు చిల్లర కావాలని వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు. కొద్దిసేపట్లోనే బంధువులు తమ పిల్లల కిడ్డీబ్యాంకుల్లో దాచుకున్న చిల్లర దగ్గరి నుంచి తమ వద్ద ఉన్న చిల్లరంతా పోగేసి రూ.40వేల నాణేలను వారికి సమకూర్చారు. ఆ నాణేల మూట తీసుకునేందుకు తొలుత ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించినా ఆఖరుకు అంగీకరించింది.
* సుప్రీం కోర్టులో నోట్ల రద్దుపై వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంలోనూ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈకేసు విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది బదులు జూనియర్‌ న్యాయవాది హాజరయ్యారు. మీ సీనియర్‌ ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించగా చిల్లరదొరక్క కోర్టుకు రాలేకపోయారని సమాధానమిచ్చాడు. కేసు వాయిదా వేయాల్సిందిగా కోరడంతో.. ఈసారి మళ్లీ చిల్లర దొరకలేదని చెప్పొద్దంటూ న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు.



* ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలిలోని ఓ కంపెనీ కార్మికులు రూ.500, రూ.1000 నోట్లను బస్తాల్లో తెచ్చి కాల్చి బూడిద చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.



ఇక సామాన్యుల తిప్పలు వర్ణనాతీతం. ప్రయాణాల మధ్యలో ఉన్నవాళ్లు,పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నవారు ఈ నోట్ల రద్దుతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇక బ్యాంకుల్లో క్యూలో నిల్చొని ప్రజలు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు ఇంతకుముంద ఎప్పుడు చూడలేదు.
* శుక్రవారం కేరళలోని రెండు బ్యాంకుల్లో అపశృతి చోటు చేసుకుంది. బ్యాంక్‌లో డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ 75 ఏళ్ల వృద్ధుడు క్యూలో నిలబడలేక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోగా మరొకరు ప్రమాదవశాత్తూ మొదటి అంతస్థు నుంచి జారిపడి మృతి చెందారు. ముంబయిలోని శివారు ప్రాంతమైన విశ్వనాథ్‌ 73ఏళ్ల వృద్ధుడు నోటు మార్పిడి కోసం బ్యాంక్‌కు వెళ్లగా క్యూలో నిలవలేక అస్వస్థతకు గురై మృతి చెందాడు.



* మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ పెళ్లి వారికి ఇక్కట్లు మొదలయ్యాయి. చెన్నైలో నిర్మల్‌కుమార్‌ అనే వ్యక్తి స్నేహితుడి వివాహం శుక్రవారం నిర్ణయించారు. దాని కోసం రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. వారి వద్ద ఉన్న కరెన్నీ ఎలా మార్చుకోవాలో తెలియక ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుండటంతో నిర్మల్‌ ఆర్‌బీఐ కార్యాలయంలో డబ్బులు మార్చుకునేందుకు వచ్చాడు. అయితే అతడికి కేవలం రూ.4వేలు మాత్రమే లభిచండంతో పెళ్లి కార్డులు అధికారులకు చూపించి మరికొంత నగదు కావాలంటూ ప్రాధేయ పడ్డాడు. అయినా వారు కనికరించలేదని వాపోయాడు.




న్యూదిల్లీ: పాత నోట్ల రద్దుతో కష్టాలు పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కాస్త వూరట కలిగించింది. పెట్రోల్‌ బంకులు, ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో నవంబర్‌ 24 వరకు పాతనోట్లు చెలామణి అవుతాయని ప్రకటించింది. నవంబర్‌ 14తో ముగుస్తున్న ఈ గడువును 24వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసింది.
నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని మోదీ మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, 1000 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, 2000 నోట్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పాతనోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు.

ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం నోట్ల మార్పిడి.. నగదు ఉపసంహరణలో కాస్త వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.

* రూ.500, రూ.1000 పాతనోట్లను బ్యాంకులో మార్చుకునేందుకు పరిమితి రూ.4000 నుంచి రూ.4,500కు పెంచింది. 

*ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు రూ.2000 నుంచి రూ.2,500కి పెంచింది. 

* బ్యాంకు కౌంటర్ల నుంచి ఒక వారంలో తీసుకోగలిగే నగదు పరిమితి రూ.20,000 నుంచి రూ.24,000కు పెంచింది. ఈ మొత్తాన్ని రోజుకు గరిష్ఠంగా రూ.10,000 చొప్పున తీసుకోవచ్చనే పరిమితి తొలగించింది.




కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ 

దిల్లీ: దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద భద్రత పెంచేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ తెలిపారు. పెద్దనోట్ల రద్దు, తదనంతర పరిమాణాలపై ఈరోజు ఆయన కేంద్ర ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శక్తికాంత దాస్‌ మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నోట్ల మార్పిడి, విత్‌డ్రా పరిమితి పెంచినట్లు వెల్లడించారు. బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
బ్యాంకులో రోజుకు ఎన్నిసార్లైనా నగదు జమ చేసుకోవచ్చని.. దీనికి ఎలాంటి పరిమితి లేదన్నారు. అయితే రూ.2.50లక్షలు.. ఆపై డిపాజిట్లకు మాత్రం ఆధారాలు చూపించాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉప తపాలా కార్యాలయాల్లోనూ నగదు డిపాజిట్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నగదు ఉపసంహరణ పరిమితిని రూ.24వేలకు పెంచామని.. దీనిని ఒకేరోజులో తీసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొత్త రూ.500నోట్లు నిన్నటి నుంచే ఏటీఎంలలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా త్వరలోనే మైక్రో ఏటీఎంలు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
పెట్రోల్‌ బంకులు, మందుల దుకాణాలు, పన్నుల చెల్లింపులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో పాతనోట్ల చెలామణి చేసుకునే అవకాశాన్ని నవంబర్‌ 24 వరకు పొడిగించినట్లు శక్తికాంతదాస్‌ తెలిపారు.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list